
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి...
►కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జోతిని కలిశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని వారు ఈ సందర్భంగా సీఈసీ ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటు వేయకుంటే రోడ్డుపై ఎలా తిరుగుతారు, పార్టీకి ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు ఆపివేస్తామని బెదిరిస్తున్నారని, అలాగే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.50 లక్షలు ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు ఈ సందర్భంగా ఏకే జోతికి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ....అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెడుతోందని, సుమారు పదిమంది మంత్రులు అక్కడే మకాం వేసి అరాచకాలు చేస్తున్నారన్నారు. అలాగే పలువురు అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అలాగే నంద్యాలలో ఎన్నికలు పాదర్శకంగా జరిగేలా కేంద్ర బలగాలను పంపించాలని సీఈసీని కోరినట్లు ఆయన తెలిపారు. సీఈసీని కలిసినవారిలో ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ తదితరులు ఉన్నారు.