సీమ ప్రాజెక్టులకు ఇచ్చేది ఇంతేనా!
రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ. 8 వేల కోట్లు అవసరం అవుతాయని, కానీ వాటికి కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇవ్వడం దుర్మార్గం.. దారుణమని ఆయన విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తామంటూ చంద్రబాబు, మంత్రులు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా అక్కడకు నీళ్లు ఎలా ఇస్తారని నాగిరెడ్డి నిలదీశారు. పట్టిసీమతో పోలవరానికి ప్రమాదమని, చంద్రబాబు కేవలం తన లబ్ధి కోసమే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.