‘హోదా’ను తుంగలో తొక్కారు
టీడీపీపై వైఎస్సార్‌సీపీ నేత బొత్స ధ్వజం
అందుకే తమ పార్టీ ఢిల్లీలో ధర్నాకు పూనుకుందని వెల్లడి
హైదరాబాద్: తన రాజకీయ స్వార్థం కోసం అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే అంశాన్ని తుంగలో తొక్కిందని, అందుకే తమ పార్టీ ఈ విషయంపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు ధర్నాకు పూనుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై తామింతవరకూ మాటల్లో చెప్పి చూశామని, ఇక చేతల్లో చూపాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వెళుతున్నామని చెప్పారు. పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జునతో కలసి ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ధర్నా చేస్తామని, తరువాత పార్లమెంటు వరకూ ప్రదర్శన(మార్చ్) నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే అనకాపల్లి, తిరుపతి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లలో సుమారు మూడువేల మంది క్రియాశీల కార్యకర్తలు, నేతలు బయల్దేరి వెళ్లారని, ధర్నా రోజున ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, జిల్లాల్లోని ఇతర ముఖ్యనేతలు హాజరవుతారని బొత్స చెప్పారు. ఈ ధర్నాలో ఢిల్లీలోని ఆంధ్రులంతా పాల్గొంటారన్నారు.
ప్యాకేజీ గురించి మాట్లాడే హక్కు సుజనాకు ఎవరిచ్చారు?
సీఎం చంద్రబాబు, టీడీపీ కేంద్రమంత్రులు ప్రత్యేక హోదా కోసం కృషి చేయకుండా వారి రాజకీయ ప్రయోజనాలు, వ్యాపారాల్లో ముని గి తేలుతున్నారని బొత్స దుయ్యబట్టారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని వారం రోజులక్రితం సంబంధిత శాఖ మంత్రి అంత స్పష్టంగా చెప్పినా.. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు మాట్లాడలేదని, బయటికొచ్చి మాత్రం హోదా వస్తుందని చెప్పడం వింతగా ఉందని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తుందని గతంలో చెప్పిన కేంద్రమంత్రి సుజనా చౌదరి ఇప్పట్లో హోదా రాదు, ప్రత్యేక ప్యాకేజీ వచ్చే అవకాశముందని చెబుతున్నారని బొత్స దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజీ గురించి మాట్లాడే అధికారం, హక్కు సుజనా చౌదరికి ఎవరిచ్చారని మండిపడ్డారు.