
నారాయణరెడ్డి దగ్గర ఆయుధం లేదని తెలిసే..
పత్తికొండ: కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ కీలక నేత, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చిన దుండగులు పక్కాపథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలిసింది. నారాయణరెడ్డి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే దాడికి దిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
తన గన్ లైసెన్స్ రెన్యూవల్ చేయాల్సిందిగా నారాయణరెడ్డి పదేపదే అభ్యర్థన చేసినా పట్టించుకోని పోలీసు శాఖపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో టీడీపీ ‘ముఖ్య’నేతల పాత్రపై విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ వివరణ కీలకంగా మారింది. ఆదివారం నారాయణరెడ్డి హత్య జరిగిన కొద్ది సేపటికి ఎస్పీ రవికృష్ణ ‘సాక్షి’తో మాట్లాడారు.
నారాయణరెడ్డి హత్య బాధాకరమైన సంఘటన అని, ఇది జరగకుండా ఉండాల్సిందన్న ఎస్పీ రవికృష్ణ.. బాధ్యులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. గత కొంత కాలంగా కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని, ఈ హత్యకుగల కారణాలను శోధిస్తామని తెలిపారు. ఇటీవలే జిల్లాలోని అన్ని స్టేషన్లనూ అప్రమత్తం చేశామని, గస్తీని పెంచామని వివరించారు. కాగా, నారాయణరెడ్డి గన్ రెన్యూవల్ చేయని విషయం తనకు తెలయదని, అధికారుల నుంచి సమాచారం తెల్సుకుంటానని ఎస్పీ రవికృష్ణ చెప్పారు.
ఎలా జరిగిదంటే..
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర‍్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రత‍్యర్థులు బాంబులతో దాడిచేసి వేటకొడవళ‍్లతో నరికి దారుణంగా హత‍్యచేశారు. నంద్యాలలో సూర‍్యనారాయణరెడ్డి కుమార్తె వివాహానికి హాజరై ఆదివారం ఉదయం 11.30 గంటలకు కారులో స‍్వగ్రామానికి వస‍్తుండగా కృష‍్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామ శివారులో కల‍్వర్టు వద‍్ద ఈ దాడి జరిగింది. నారాయణరెడ్డి ప్రయాణిస్తున‍్న కారు కల‍్వర్టు వద‍్ద స్లో కావడంతో అక‍్కడే కాపు కాసిన ప్రత‍్యర్థులు ట్రాక‍్టర‍్లతో కారును ఢీకొట్టి నారాయణరెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని లాగి వేటకొడవళ‍్లతో నరికి కిరాతకంగా హతమార్చారు. తొలుత బాంబులు విసిరిన ప్రత‍్యర్థులు కారును చుట్టుముట్టి హతమార్చినట్లు తెలుస‍్తోంది.
నారాయణరెడ్డి కదలికలను క్షుణ‍్ణంగా పరిశీలిస్తున‍్న ప్రత‍్యర్థులు పథకరచనచేసి కల‍్వర్టు వద‍్ద కారు ఎలాగూ వేగం తగ్గుతుందని భావించి అక‍్కడే ట్రాక‍్టర‍్లతో మాటువేసి హతమార్చారు. కొద్దిరోజుల ముందే నారాయణరెడ్డి తన వద‍్ద వున‍్న లైసెన‍్సు రివాల‍్వర్‌ను పునరుద‍్ధరించుకునేందుకు పోలీసులకు అప‍్పగించారు. ఈ విషయం కూడా ప్రత‍్యర్థులకు తెలిసే ఉంటుందని భావిస్తున్నారు. ఆయన నిరాయుధుడిగా ఉన‍్నాడన‍్న సమాచారంతో సమయం చూసి దాడిచేశారు.