కడప, న్యూస్‌లైన్: సమైక్యపోరు ఉధృత రూపం దాల్చుతోంది. సమైక్యరాష్ట్రానికి మద్దతుగా పలుచోట్ల వైఎస్సార్ సీపీ నాయకులు ఆమరణదీక్షలకు దిగుతున్నారు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి రాజంపేటలో, కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీమేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆమరణదీక్ష గురువారం నాటిని నాలుగొరోజుకు చేరుకున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ద్వారకానాథరెడ్డి సంఘీభావం తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు, ఉద్యోగులు తరలివచ్చి దీక్షలకు మద్దతు పలికారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష దీక్షలకు సంఘీభావం తెలిపి ఆటపాటలతో ఆకట్టుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి ఆమరణ దీక్షకు పూనుకున్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు టోల్‌గేట్ సమీపంలో ఆమరణదీక్ష చేపట్టారు. ప్రకాశం జిల్లా పర్చూరులో గొట్టిపాటి భరత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆరోరోజుకు చేరుకుంది, వైఎస్సార్‌సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈనెల 19 నుంచి విజయవాడలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా దేవరపల్లిలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు గురువారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఇదిలాఉండగా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ యువనేతలు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, గుర్రం గౌతమ్, సాల్మన్‌రాజు చేపట్టిన నిరవధిక నిరహారదీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి.
బాబు, కిరణ్‌లతోనే అధోగతి: ఆకేపాటి
రాజంపేట: తెలుగుతల్లి గర్భం నుంచి పుట్టినదే సీమాంధ్ర ఉద్యమమని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం రాజంపేట పాతబస్టాండు కూడలిలో ఆమరణదీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడులచే రాజీనామాలు చేయించిన తరువాతే ఆయా పార్టీల నాయకులు ఉద్యమాలు చేస్తే బాగుంటుందన్నారు. బాబు, కిరణ్‌ల వల్లే ఈ రాష్ట్రం రెండుగా చీలిందన్నారు. సోనియా పెంపుడు కుక్కలచే నియమించబడిన కమిటీ ఆమెకు విరుద్ధంగా చెప్పగలదా అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ఆ కమిటీకి సమస్యలు చెప్పుకోవాలంటే తెలుగువారికి ఎంత దుస్థితి పట్టిందో అవగతమవుతోందన్నారు. సమైక్యం కోసం వైఎస్సార్‌సీపీ 16మంది ఎమ్మెల్యేలు తమ పదవులను తృణప్రాయంగా వదలుకున్నార న్నారు.
ప్రాణత్యాగానికైనా సిద్ధం: కొరముట్ల
రైల్వేకోడూరు: రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే సోనియా తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరులోని వైఎస్సార్‌సర్కిల్ వద్ద ఆమరణదీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా రాష్ట్రాన్ని విభజించేందుకు సిద్ధపడ్డారన్నారు. ప్రస్తుతం రాష్ట్రం సమైక్యాంధ్ర నినాదాలతో అగ్నిగుండంగా తయారైందని, అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం లేదని ఆరోపించారు. సమైక్యాంధ్ర కొరకు ప్రాణత్యాగానికైనా సిద్ధమై అమరణ నిరాహారదీక్షకు కూర్చున్నానన్నారు. సీమాంధ్రులు 60 సంవత్సరాలు కష్టపడి రాజధాని హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని, ఇప్పుడు దానిని ఎలా వదిలేసి వెళతారని ప్రశ్నించారు.
నాల్గోరోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ నాయకుల అమరణదీక్ష
Published Fri, Aug 16 2013 4:46 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement