మార్చ్‌పై ఉక్కుపాదం | ysrcp party rally at krishna district | Sakshi
Sakshi News home page

మార్చ్‌పై ఉక్కుపాదం

Published Thu, Oct 15 2015 3:45 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

మార్చ్‌పై ఉక్కుపాదం - Sakshi

మార్చ్‌పై ఉక్కుపాదం

* వైఎస్సార్‌సీపీ ర్యాలీపై పోలీసుల ప్రతాపం
* విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత  
* శాంతియుత ప్రదర్శన కూడా నేరమా?
* ప్రజాప్రతినిధుల ఆవేదన

సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదా కోసం ఏడు రోజుల పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ విజయవాడలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించ తలపెట్టిన మార్చ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వందలాదిగా పాల్గొన్న ఈ కార్యక్రమంపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి దొరికినవారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యానుల్లో పడేశారు. ఎమ్మెల్యేలు, నాయకులను పక్కకు ఈడ్చేశారు. ప్రజాప్రతినిధులు, మహిళలన్న విచక్షణ కూడా చూపించలేదు. అందరినీ జుట్లుపట్టి ఈడ్చేశారు. జగన్ దీక్షను భగ్నం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేయడంతో పాటు ప్రత్యేక హోదా పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగా బుధవారంనాడు విజయవాడలోని బందరు రోడ్డులోగల పీడబ్ల్యుడీ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఈ మార్చ్‌ను కొనసాగించాలని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ నిర్ణయించింది.

పార్టీ పిలుపునందుకుని బుధవారం మద్యాహ్నం పీడబ్ల్యుడీ గ్రౌండ్‌కు నాయకులు, శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారంతా ప్రదర్శనగా బయల్దేరగానే అక్కడే పెద్ద ఎత్తున మోహరించి ఉన్న పోలీసులు ఒక్క ఉదుటున దాడి చేశారు.  దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న తమను అడ్డుకోవడం తగదంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రతిఘటించడంతో పోలీసులు అందరినీ పక్కకు ఈడ్చేడం ప్రారంభించారు.

వైఎస్సార్‌సీపీ కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను దౌర్జన్యంగా ఈడ్చేసి వ్యాన్‌లోకి విసిరేసి వేర్వేరు పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. మార్చ్‌ను కవర్ చేసేందుకు సమీపంలో ఉంచిన సాక్షి టీవీ లైవ్ వాహనాన్ని కూడా పోలీసులు దౌర్జన్యంగా తొలగించారు. మిగిలిన మీడియా వెహికల్స్ ఉన్నప్పటికీ పనిగట్టుకుని సాక్షి టీవీ వాహనాన్ని అక్కడ్నుంచి తీసివేసే వరకు పోలీసులు పట్టుబట్టడం గమనార్హం.
 
హోదా సాధించేవరకూ పోరాటం ఆగదు..
ప్రత్యేక హోదా విషయంలో రాష్ర్టప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, హోదా సాధించేవరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదని మాజీ మంత్రి, పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.  పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను సాధించుకోవడం కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం దురుదృష్టకరమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.  

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాష్ర్టం మేలు కోరాల్సింది పోయి ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేదిలా ఉందని పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.జగన్ దీక్షను అపహాస్యం చేయడం ద్వారా చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రజాస్వామ్యానికి తిలోదకాలు వదిలారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

ప్రతిపక్షం గొంతు నొక్కేలా, ప్రజల ఆశలను నీరుగార్చేలా రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు జ్యోతుల నెహ్రూ,  బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొలుసు పార్థసారథి, కొడాలి నాని, వంగవీటి రాధా, పి.గౌతంరెడ్డి,అంబటి రాంబాబు , సామినేని ఉదయభాను, జోగి రమేష్, మేరుగ నాగార్జున,  వాసిరెడ్డి పద్మ, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
 
వారేమన్నా విద్రోహులా..?
వాళ్లంతా ప్రజా ప్రతినిధులు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బాధ్యత గలిగిన ప్రతిపక్ష పార్టీలో కీలకమైన నాయకులు.... వారు శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే ఇలా దుర్మార్గంగా వ్యవహరించడమేమిటి? పోలీసులు పక్కకు ఈడ్చేయడమేమిటి? మహిళలను జుట్టుపట్టి లాగడమేమిటి? వ్యానుల్లోకి విసిరేయడమేమిటి? వారేమన్నా సంఘ విద్రోహ శక్తులా..? లేక వారు చేస్తున్నది ఏమైనా విద్రోహచర్యా? రాష్ర్ట ప్రజల భవితవ్యానికి సంబంధించిన ప్రత్యేక హోదా అనే ఒక మహోన్నతమైన లక్ష్యం కోసం వారు పోరాడుతున్నారు.. శాంతియుతంగా ప్రదర్శన చేయడానికి ఉపక్రమించారు.

ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేయడానికి బయల్దేరితే వారిపై పోలీసులు ఆ స్థాయిలో దాడి చేయడమేమిటి? ఇపుడు అన్ని వర్గాలలోనూ తలెత్తిన ప్రశ్నలివి.
 పోలీసులు ఈ స్థాయిలో స్పందిస్తున్నారంటే పై స్థాయి నుంచి ఆదేశాలే కారణమన్నది బహిరంగ రహస్యమే. రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది అంటూ ఇపుడు తీవ్ర చర్చ జరుగుతోంది.

 ప్రత్యేక హోదా సంజీవని కాదు అంటూ వ్యాఖ్యలు..

ప్రతిపక్ష నేత ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా కనీసం స్పందించకపోవడం, మంత్రులతో దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయించడం, దీక్షను అపహాస్యం చేయడం, వైద్యులను తప్పుడు నివేదికలను ఆసరాగా చేసుకుని జగన్ దీక్షపై బురదజల్లే ప్రయత్నం చేయడం, చివరకు జగన్ దీక్షను పోలీసుల చేత బలవంతంగా భగ్నం చేయించడం, ఇపుడు శాంతియుత ప్రదర్శనపైనా దుర్మార్గంగా దాడి జరిపించడం ఇవన్నీ దేనికి సంకేతాలు?

అసలు ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి ఏమిటి? రాజధాని శంకుస్థాపన కోసం ఢిల్లీలో ఆహ్వానపత్రికలు పట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి రేఖామాత్రంగానైనా ఎందుకు వివరించడంలేదు? ప్రత్యేక హోదా ఇస్తేనే మా బిడ్డల భవిష్యత్ బాగుపడుతుందని ఎందుకు చెప్పడం లేదు? అదీ బహిరంగ రహస్యమే. ఆ రహస్యాన్ని ఛేదించే పనిలోనే ఇపుడు రాష్ర్ట ప్రజలు ఉన్నారు. దాని గురించే అంతా చర్చించుకుంటున్నారు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement