ట్రంప్ పై విరుచుకుపడ్డ జుకర్బర్గ్
శాన్ ఫ్రాన్సిస్కో:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా ఆంక్షలపై ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ విరుచుకుపడ్డారు. ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులను తగ్గించేందుకు, ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను జుకర్ బర్గ్ తప్పుబట్టారు. ట్రంప్ ముస్లింపై ఆంక్షలనువిధిస్తూ తీసుకున్న కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన ధ్వజమెత్తారు. ఈ ఆదేశాల ప్రభావం గురించి తాను చింతిస్తున్నానని ఫేస్బుక్ పేజీ పోస్ట్ లో రాశారు.
టెర్రరిస్టుల నుంచి అమెరికా రక్షణ ముఖ్యమే అయినప్పటికీ ఆపదలో ఉన్నవారికీ, శరణార్థులకు సహాయం చేసేందుకు విశాలంగా వ్యవహరించాలని కోరారు. వారికి సాయపడేందుకు మన దేశ ద్వారాలు ఎపుడే తెరిచే ఉండాలని సూచించారు. కొన్ని దశాబ్దాల క్రింత అమెరికా ఇలా వ్యవహరించి ఉండకపోతే చాన్ ప్రిస్కిల్లా ఇవాళ ఇక్కడ ఉండేది కాదంటూ..తన భార్య చాన్ కుటుంబం చైనా వియత్నాం నుంచి వలస వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
చాన్ అంశం తన వ్యక్తిగత అంశమే ..అయినా.. మనది వలస దారుల దేశం.. మన చుట్టూ వున్న ప్రపంచం బావుంటే.. వలసదారులకు మంచి పనిని, జీవనాన్ని అందివ్వగలిగితే మనకే మంచిదంటూ చెప్పుకొచ్చారు. అమెరికా భవిష్యత్తులో వారు కూడా ఒక భాగమని జుకర్ వర్గ్ చెప్పారు. ఈ ప్రపంచంలో అందరికీ మరింత ఉన్నతమైన స్థానంగా అమెరికాను తీర్చిదిద్దడానికి మనం అందరం ధైర్యంగా, సంయమనంగా పనిచేయడానికి ముందుకు రావాలని ఆశిస్తున్నానని జుకర్ తన పోస్ట్ లో కోరారు.
కాగా ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకుద్దేశించిన అత్యంత క్లిష్టమైన నిబంధనల ఆర్డర్ పై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము అనుకోవట్లేదని ఆయన వెల్లడించారు. ఈ ఆర్డర్ ప్రకారం ఏడు ముస్లిం దేశాల వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అలాగే అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. అయితే సిరియా వలసదారుల్లో క్రిస్టియన్లకు ప్రాధాన్యమివ్వనున్నారు. మరోవైపు ట్రంప్ ఈ సంచలన నిర్ణయంపై హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని హెచ్చరిస్తున్నారు.