రేణుకాచౌదరిపై వేటు?
-
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించిన హైకమాండ్!
-
ఆ స్థానంలో హర్యానా మంత్రి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి పదవి నుంచి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరిని ఆ పార్టీ హైకమాండ్ తప్పించినట్లు తెలుస్తోంది. రేణుకపై వేటు వేస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు ఆమెకు కూడా వర్తమానం పంపిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిధిగా రేణుక పనితీరుపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం రెండు నెలల పాటు (నవంబర్, డిసెంబర్) ఏఐసీసీ తరఫున మీడియా సమావేశాల్లో మాట్లాడరాదని ఆదేశించినట్లు ఆ వర్గాల కథనం. అంతేకాదు.. టీవీ చర్చలకు పార్టీ తరఫున పాల్గొనే నాయకుల జాబితా నుంచి సైతం ఆమె పేరును తొలగించారని సమాచారం.
అయితే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఈ మేరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ.. ఏఐసీసీలోని ముఖ్యులు మాత్రం దీన్ని అనధికారికంగా ధ్రువీకరిస్తున్నారు. రేణుక కొంత కాలంగా ఏఐసీసీ మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గత మే 5న ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణలో అధికార ప్రతినిధిగా పదవి దక్కిన రేణుక చివరిసారి అక్టోబర్ 18వ తేదీన ఏఐసీసీ మీడియా సమావేశంలో మాట్లాడారు. అదే సమయంలో హర్యానా మంత్రి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా ఏఐసీసీ మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నారు. రేణుక స్థానంలో ఆయనను అధికార ప్రతినిధిగా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సన్నిహితంగా మెలిగే రేణుకాచౌదరిని ఉన్నపళంగా పదవి నుంచి తప్పించటం ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.