ఇది టైమ్ కాదు
ఇది టైమ్ కాదు
Published Tue, Nov 19 2013 2:28 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
‘సమైక్య’ పిటిషన్లపై స్పష్టంచేసిన సుప్రీంకోర్టు
కేంద్రం నిర్ణయాన్ని పార్లమెంటు, అసెంబ్లీ ఆమోదించలేదు
వాటి ఆలోచన ఏమిటో.. అవి ఏం చేస్తాయో తెలీదు
కాబట్టి ప్రస్తుతానికి మీవి ‘ప్రీమెచ్యూర్’ పిటిషన్లు
ఈ దశలో ముందే మేం జోక్యం చేసుకోలేం..
గతంలో ఇలాంటి పిటిషన్ ఒకటి డిస్మిస్ చేశాం..
ఈ వ్యాజ్యాలను అలా చేయలేం
పిటిషన్లలో లేవనెత్తిన న్యాయపరమైన
అంశాలన్నింటినీ ఓపెన్‌గా ఉంచుతున్నాం..
వీటిపై ‘సరైన దశ’లో వాదనలు వినడానికి సిద్ధం
{పస్తుతానికి పిటిషన్ల విచారణకు నిరాకరిస్తున్నాం..
సాక్షి, న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టడానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నిరాకరించింది. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ ఇంకా ఆమోదించాల్సి ఉంది. పార్లమెంటు, శాసనసభల ఆలోచన ఏమిటో.. అవి ఏం చేస్తాయో ఇంకా తెలియదు. కాబట్టి.. ముందస్తుగా ఈ విషయంలో జోక్యం చేసుకోలేం’ అని స్పష్టంచేసింది. ప్రస్తుత పిటిషన్లను ‘ప్రీమెచ్యూర్’గా(సమయంకన్నా ముందే వచ్చినవిగా) ధర్మాసనం అభివర్ణించింది.
అయితే, ఇదే విషయమై సరైన సమయంలో మళ్లీ కోర్టును ఆశ్రయించడానికి పిటిషనర్లకు అవకాశం కల్పించింది. ‘పిటిషన్లపై విచారణకు మేం నిరాకరిస్తున్నాం. ఏదేమైనప్పటికీ.. పిటిషన్లలో లేవనెత్తిన న్యాయపరమైన ప్రశ్నలన్నింటినీ ఓపెన్‌గా ఉంచుతున్నాం. సరైన దశలో తగిన పిటిషన్ల ద్వారా వాదనలు వింటాం. ప్రస్తుతానికి మీ పిటిషన్ల విచారణకు నిరాకరిస్తున్నాం..’ అని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. సుప్రీంకోర్టు చెప్పిన ‘సరైన దశ’లో పిటిషనర్లు మళ్లీ పిటిషన్లను వేసి ప్రస్తుత వాదనలనే వాటిలో లేవనెత్తవచ్చని, కావాలనుకుంటే మరిన్ని అదనపు అంశాలనూ జోడించవచ్చని న్యాయనిపుణులు పేర్కొన్నారు.
10 పిటిషన్లలో 8 మాత్రమే..
విభజన నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ మొదటగా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, పారిశ్రామికవేత్త కె.రఘురామ కృష్ణంరాజు, తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల
కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, కె.కృష్ణమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య రైతుల సంఘం, కె.ప్రభాకర్‌రాజు తదితరులు, అనిశెట్టి చంద్రమోహన్ ప్రభృతులు, ఎం. రామకృష్ణ వేసిన మొత్తం ఎనిమిది పిటిషన్లను సోమవారం జస్టిస్ దత్తు, జస్టిస్ లోకూర్‌తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్, చార్టర్డ్ అకౌంటెంట్ చిరంజీవిరెడ్డి వేసిన రెండు పిటిషన్లు కూడా ధర్మాసనం ముందుకు వస్తాయనుకున్నా అవి రాలేదు. న్యాయవాదులతో కిక్కిరిసిన కోర్టు హాలులో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మొదలైన విచారణ అరగంటకుపైగా కొనసాగి పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చడంతో పూర్తయింది. విచారణ సమయంలో పిటిషనర్లయిన రఘురామకృష్ణంరాజు, సోమయాజులు, పయ్యావుల కేశవ్‌తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, బాలశౌరి, అడుసుమిల్లి జయప్రకాశ్, రాష్ట్ర మంత్రి వట్టి వసంత్‌కుమార్, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్ ప్రభృతులు కోర్టు హాలులో ఉన్నారు. పిటిషనర్ల తరఫున ఫాలీ ఎస్.నారిమన్, హరీశ్ సాల్వే, రోహింటన్ నారిమన్, ఎం.ఎన్.రావు, ఎస్.ఎస్.ప్రసాద్ వాదించారు.
తొలి క్షణం నుంచీ అదే మాట..
న్యాయస్థానంలో వాదనలు జరుగుతున్నంతసేపూ ధర్మాసనం పలుమార్లు ‘ప్రీమెచ్యూర్’ అనే పదం వాడడం వినిపించింది. మొదట ఫాలీ ఎస్. నారిమన్ వాదిస్తూ, విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయం ఎలాంటి సంకేతాల్ని పంపుతోందో చూడాలని అన్నారు. దీనికి జస్టిస్ దత్తు స్పందిస్తూ, ‘‘ఇది ఇంకా పార్లమెంట్‌కు వెళ్లాలి కదా. కేబినెట్ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదం కోసం తగిన వేదిక ముందుంచాలి కదా’’ అని అన్నారు. నారిమన్ వాదిస్తూ, ‘‘అవును. కచ్చితంగా పెట్టాలి. కానీ రాజ్యాంగపరంగా పార్లమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని, ఆరంభించాల్సిన ప్రక్రియను కార్యనిర్వాహక వ్యవస్థ అయిన ప్రభుత్వం తీసుకోవడం మొదటి తప్పు. ఆర్టికల్ 3లోని అధికారాలను కేంద్రం ఉపయోగించుకుంటే.. వాటి ప్రకారం రాష్ట్రపతి సిఫార్సు మేరకు పార్లమెంట్‌లోని ఉభయసభల్లో బిల్లు పెట్టాలి. అనంతరం పార్లమెంట్ ఆ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపాలి. అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం అలాంటి ప్రతిపాదనేదీ చేయలేదు’’ అని పేర్కొన్నారు. నారిమన్ రాజ్యాంగంలోని ఆర్టికళ్లను ఉదహరించే ప్రయత్నం చేయగా జస్టిస్ దత్తు వద్దని వారిస్తూ, ‘‘గతంలో మేం ఒక పిటిషన్‌ను డిస్మిస్ చేశాం. ఆ డిస్మిస్ అనే పదాన్ని మేం వాడకుండా ఉండాల్సింది. అది వాడటం సరికాదు. ఇప్పుడు ఆ పదాన్ని వాడదల్చుకోలేదు’’ అని అన్నారు.
నిబంధనలు ఏం చెప్తున్నాయో చూడండి..
ఈ దశలో హరీశ్ సాల్వే వాదనలకు ఉపక్రమించారు. ‘‘దయచేసి నిబంధనలు ఏం చెప్తున్నాయో చూడండి. రాష్ట్రపతి సిఫారసు లేకుండా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో బిల్లును పెట్టడానికి వీల్లేదు. ఒకసారి బిల్లు ఆమోదం పొందినట్టయితే అప్పుడు పరిస్థితి ఏమిటి?’’అని అడిగారు. జస్టిస్ దత్తు స్పందిస్తూ, ‘‘ఒకవేళ ఏదైనా కారణం రీత్యా అలా జరగకపోతేనో’’ అని అన్నారు. దీనికి సాల్వే వాదిస్తూ, ‘‘ఇక్కడ రాష్ట్ర విభజనకు కేబినెట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దానిపై ముందుకెళ్తున్నారు. కొత్త రాష్ట్రం సరిహద్దులను నిర్వచించడానికి జీవోఎంను ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా సరిహద్దులను నిర్వచించినట్టయితే, వారి హక్కులకు భంగం వాటిల్లినట్టే అవుతుంది. ఈ దృష్ట్యా పిటిషన్‌ను ప్రీమెచ్యూర్‌గా పేర్కొనరాదు’’ అని అభ్యర్థించారు. ఎన్నికలు వస్తున్నాయనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని, రాష్ట్రాన్ని విభజించకూడదన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆర్టికల్ 371డీకి ప్రస్తుత నిర్ణయం విరుద్ధమని రోహింటన్ నారిమన్ పేర్కొన్నారు. దీనికి జస్టిస్ దత్తు స్పందిస్తూ, బిల్లును ఇంకా పెట్టనందున ఈ పిటిషన్ ప్రీమెచ్యూర్ అని, బిల్లును పెట్టాక న్యాయపరమైన అంశాలన్నింటినీ లేవనెత్తవచ్చునని అన్నారు.తరువాత సీనియర్ న్యాయవాది, మాజీ న్యాయమూర్తి ఎం.ఎన్.రావు లేచి, రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి లేకుండా ఏ రాష్ట్రాన్ని విభజించరాదని, అలా చేస్తే అది సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించినట్టేనని వాదించారు. చివరగా సీనియర్‌న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ వాదనను వినిపించారు. ప్రస్తుత నిర్ణయం ఆర్టికల్ 3కి వ్యతిరేకంగా ఉందని, విభజించాలంటే ముందుగా రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. తర్వాత ఇతర పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదన వినిపించడానికి సిద్ధం కాగా, జస్టిస్ దత్తు వారిని వారించారు. ‘మేం సీనియర్ న్యాయవాదుల వాదనలు విన్నాం. మా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. ఈ పిటిషన్లు ప్రస్తుతానికి ప్రీమెచ్యూర్‌వే(సమయానికన్నా ముందే దాఖలైనవి). అయితే సరైన దశలో పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చు’ అని విచారణను ముగించారు.
అంతం కాదిది.. ఆరంభం: రఘురామ కృష్ణంరాజు
‘‘అంతం కాదిది.. ఆరంభం.. ఇక ప్రతి దశలోనూ కేంద్రాన్ని నీడలా వెంటాడతాం. కేంద్రం వేసే ప్రతి అడుగునూ అడ్డుకోవడానికి మా శాయశక్తులా కృషిచేస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త కె.రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ‘సమైక్య’ పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం ఆయన కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ రోజు మాకు కొంత నిరాశ కలిగినా పూర్తి ఆశాభావంతో ఉన్నాం. మా పిటిషన్లను కొట్టివేయలేదు. వాటన్నింటినీ జడ్జిలు సహనంతో విచారించారు. మేం లేవనెత్తిన న్యాయపరమైన అంశాలన్నింటినీ ఓపెన్‌గా ఉంచుతున్నామన్నారు’’ అని ఆయన తెలిపారు.
మా వాదనల్లో బలం ఉందని తేలింది: పయ్యావుల
రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయకుండా న్యాయపరమైన అంశాలను ఓపెన్‌గా పెట్టడం చూస్తే పిటిషనర్లు లేవనెత్తిన అంశాల్లో, వాదనల్లో బలం ఉందని అర్థమవుతోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.
Advertisement
Advertisement