తెలుగు తీర్పు ఎటువైపు!
రాష్ట్ర విభజన అంశం ఐదు రాష్టాల ఓటర్లపై కూడా ప్రభావం చూపనుందా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గతంలో వివిధ రాష్ట్లాలో జరిగిన ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఏపార్టీకి ఓటు వేసినా.. ఈసారి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నెలకొన్న కారణంగా వాళ్ల మూడ్ ఎలా ఉంటుందనే బెంగ రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఢిల్లీ, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లు పార్టీల భవిష్యత్ నిర్ణయించడంలో కీలకం మారనున్నారు. కేవలంలో దేశ రాజధాని ఢిల్లీలోనే పది లక్షల మంది పైగా తెలుగువాళ్లు ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే పదిలక్షల మంది తెలుగు వాళ్లలో అత్యధికంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే అధికమని తెలుస్తోంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న తెలుగు ప్రజలు ఆ పార్టీకి ఓటేయడం సందేహస్పదమే. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండటంతో గత ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపారనేది కాదనలేని వాస్తవం. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. దానికి తోడు విభజన అంశం సీమాంధ్రలో అగ్గిపుట్టిస్తోంది. ఇలాంటి తరుణంలో తెలుగువాళ్ల నిర్ణయం పార్టీల గెలుపోటములను నిర్ధారించడంలో ప్రధాన అంశంగా మారింది.
కేవలం ఢిల్లీలోనే కాకుండా మధ్యప్రదేశ్ లో కూడా తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగానే ఉంది. అభివృద్ధి అంశమే ప్రధాన ఎజెండాగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. చౌహాన్ ఆశలకు తెలుగు వాళ్లు మద్దతు ఇస్తారా లేక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతారా అనే అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ విభజన అంశం తెలుగువాళ్లపై ప్రభావం చూపితే మళ్లీ బీజేపీకే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన అంశాన్ని తెలుగువాళ్లు పక్కన పెడితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా కాంగ్రెస్ అనుకూలించనుందని అనేది మరో వాదన.
సమీకరణాలు ఎలా ఉన్నా.. వలసల నగరాలు పేరున్న ఢిల్లీ, భిలాయ్ లాంటి ప్రదేశాల్లో తెలుగు వాళ్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తికరమైందే. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఢిల్లీలోని తెలుగువాళ్లంతా తమవైపే ఉన్నారని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు తెలుగు ఓటర్ల మరోసారి గుర్తు చేసింది. ఢిల్లీలో ప్రధాన పార్టీల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రధాన రాజకీయ పక్షంగా ఈ ఎన్నికల్లో దూసుకుపోతోంది. అవినీతి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి లేదా అధికార పార్టీకే ఈ ఎన్నికల్లో తెలుగు మొగ్గు చూపుతారా అనే విషయం వేచి చూడాల్సిందే.