రాయల తెలంగాణ అంటే యుద్దమే: కేసీఆర్
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో యుద్దానికి తెరతీస్తాం అని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయల తెలంగాణ నిర్ణయానికి ఒప్పుకోమని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోందని.. మా పిల్లల చేసిన త్యాగాలు రాయల తెలంగాణ కాదు
ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి నిర్ణయం తీసుకుంది అని, ఆ నిర్ణయాన్ని కేబినెట్ కూడా అంగీకరించింన విషయాన్ని ఆయన తెలిపారు. అలాంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పుడు నిర్ణయమతుందన్నారు. అలాగే షరతులతో కూడిన తెలంగాణకు అంగీకరించం అని అన్నారు. తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాల శ్రమ అని, ప్రాణ త్యాగాలకు పాల్పడింది రాయల తెలంగాణ కోసం కాదని కేసీఆర్ అన్నారు.
ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా జీవోఎం చర్చిస్తుందని తాము మంత్రుల బృందాన్ని ప్రశ్నించామన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం, పోరాటం జరిగింది అని, తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని కోరామని కేసీఆర్ తెలిపారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నామని.. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 29వ రాష్ట్రమవుతుందని తాను చెప్పానని ఆయన అన్నారు. గతంలో ఏర్పడిన 28 రాష్ట్రాలకు వర్తించే విధంగానే తెలంగాణకు కూడా అవే నిబంధనలు, విధానాలు ఉండాలి అని జీవోఎం సభ్యులకు తెలిపాను అని మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత రాజ్యంగంలో ఏముందో తమకు తెలుసు అని.. ఉమ్మడి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అనే విషయం తమకు తెలుసు అని ఆయన అన్నారు.
ఉన్నపళంగా వారిని వెళ్లమని కోరితే బాగుండదనే విషయం కారణంగా ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నామన్నారు. గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వెలువడుతున్నా.. తాము అడ్డదిడ్డంగా మాట్లాడటం ఇష్టం లేక టీఆర్ఎస్ స్పందించలేదని తెలిపారు. రాయల తెలంగాణ అంటే మరో యుద్దం తప్పదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.