బత్తాయి తొక్కలతో కరువుపై పోరు
దక్షిణాఫ్రికాలోని జొహెన్నస్‌బర్గ్‌కు చెందిన కైరా నిర్గిన్ 16 ఏళ్ల బాలిక. బత్తాయి తొక్కలతో పంట పొలాల్లో కరువును నివారించే పర్యావరణ హితమైన పద్ధతిని రూపొందించింది. ఇందుకు గాను 2016 గూగుల్ సైన్స్ ఫెయిర్ అవార్డ్‌ను గెలుచుకుంది.
పంటల సాగులో దీర్ఘకాలిక నీటి అవసరాలు తీర్చేందుకు నీటిని పీల్చుకొని నిల్వ చేసుకునే కణాల (ఎస్‌ఏపీ: సూపర్ అబ్‌సార్బ్ పాలిమర్స్)తో పొడిని తయారు చేస్తారు. ఈ పొడి నేలలో కలసిపోయి దాని బరువు కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువగా నీటిని పీల్చుకొని నిల్వ చేసుకొని మొక్కలకు అందిస్తాయి. తీవ్ర నీటి కొరత ఎదుర్కొనే ప్రాంతాల్లో పంటల సాగుకు ఒక చక్కని అవకాశంగా వీటిని చెప్పవచ్చు.
నీటిని పీల్చుకొని నిల్వ చేసుకునే కణాలు రసాయన చర్యలో భాగంగా జీవన ద్రవ్యాన్ని విడుదల చేస్తాయి. ఇందులోని కణాలు ప్లాస్టిక్ పదార్థంగా (పాలిమరైజేషన్ ) మారే క్రమంలో హైడ్రోజల్స్ విడుదలవుతాయి. ఇవి నేలలోని నీటిని పీల్చుకొని నిల్వ చేసుకునే స్పాంజిల్లా పనిచేస్తాయి. ఒక రకంగా పంట భూమిలో నీటి రిజర్వాయర్‌లను కృత్రిమంగా ఏర్పాటు చేసుకోవటంగా చెప్పవచ్చు. వాటి బరువు కన్నా మూడొందల రెట్లు అధికంగా నీటిని పీల్చుకొని నిల్వ ఉంచుకుంటాయి. తర్వాత ఆ నీటిని పంట మొక్కలు గ్రహించేలా నెమ్మదిగా నేలలోకి విడుదల చేస్తాయి.
అయితే ప్లాస్టిక్ పదార్థంగా మార్చేందుకు ఇప్పటì వరకు రసాయన విధానాన్ని అనుసరిస్తున్నారు. రసాయనాలు నేలలో కలవకపోవటంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. పైగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కావటం వల్ల రైతుకు భారమవుతోంది. అణు పుంజీకరణం ప్రక్రియలో ఇప్పటి వరకు గంధకం, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను ఉపయోగిస్తున్నారు. దీనికి బదులు అవకాడో, బత్తాయి తొక్కలతోనూ ప్లాస్టిక్ పదార్థంగా మార్చవచ్చని కైరా నిరూపించింది. అవకాడో, బత్తాయి తొక్కలు ఉపయోగించి నేలలో నీటి తేమను ఎక్కువగా కాలం నిలిపి ఉంచే విధానాన్ని రూపొందించింది.
నిమ్మ జాతికి చెందిన పండ్లలో నీటిని పీల్చుకునే కణాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. బత్తాయి తొక్కల్లో 64 శాతం నీటిలో కరిగే చక్కెర పదార్థం ఉండటం వల్ల ఇందులోని కణాలకు నేలలో కలసి పోయే స్వభావం ఉంటుంది. జ్యూస్ తయారీ కర్మాగారాల్లో మిగిలిపోయే పండ్ల తొక్కలను పరిశోధనలో వాడింది. అవి 76.1 శాతం నీటిని పీల్చుకుంటాయి. రసాయన పద్ధతుల్లో తయారైన టన్ను నీటి నిల్వ పొడి ధర 2– 3 వేల డాలర్లు ఉండగా.. కైరా రూపొందించిన విధానంలో మాత్రం టన్ను 30 – 60 డాలర్లకే లభిస్తుంది. దీని వాడకం వల్ల కరువు ప్రాంతాల్లో 73 శాతం వరకు ఆహార భద్రత పెరుగుతుందని కైరా భావిస్తోంది. పంట వ్యర్థాలను ఉపయోగించి పంటలకు జీవం పోసే పదార్థాన్ని తయారు చేసిన కైరా ఇన్నోవేటివ్ స్ఫిరిట్ యువతకు ఆదర్శప్రాయం.
– దండేల కృష్ణ, సాగుబడి డెస్క్