గ్రీన్ రైస్ దిగుబడి అదుర్స్!
- తక్కువ ఎరువులతో 67 బస్తాలు పండిన జెడ్‌జీవై-1..
- తెలంగాణ ఎర్రనేలల్లో బోర్ల కింద సాగుకూ అనుకూలం
- చౌడు పొలాల్లో, ఉప్పు నీటిని తట్టుకొని
- 55 బస్తాలు పండిన హెచ్‌హెచ్‌జెడ్5 ఎస్‌ఏఎల్-10 వంగడం
- అసలు ఎరువులు, పురుగుమందుల్లేకుండా
- 30 బస్తాలు పండిన ఎస్‌ఏజీఎస్4 వంగడం
ఆకలిపై పోరులో వజ్రాయుధం విత్తనం! మన సుదీర్ఘ వ్యవసాయ సంస్కృతికి బలమైన పునాదీ విత్తనమే. వేలాది ఏళ్ల సేద్య పరంపరలో అన్నదాతలు ఎంపిక చేసి సాగుచేస్తూ పరిరక్షించుకుంటున్న అపురూప సంపద దేశవాళీ విత్తనాలు. ఆధునిక వంగడాలు విఫలమవుతున్న నేపథ్యంలో.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు నిశ్చింతగా తిరిగి వాడుకోదగిన దేశవాళీ వంగడాలే మళ్లీ అవసరమవుతున్నాయి. 250 దేశవాళీ వంగడాల్లో సద్గుణాలను తమలో ఇముడ్చుకున్న గ్రీన్ సూపర్ రైస్ వంగడాల రాకకు పూర్వరంగం ఇదే. తక్కువ వనరులతో 67 బస్తాల వరకు ధాన్యం దిగుబడినిచ్చే ఈ వంగడాలు ఇప్పుడిప్పుడే తెలుగు రైతు తలుపు తడుతున్నాయి..
వాతావరణ మార్పులను తట్టుకుంటూ.. తక్కువ వనరులతోనైనా అధిక దిగుబడినివ్వగల గ్రీన్ సూపర్ రైస్ వరి విత్తనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ని రైతుల చేతికి అందివచ్చాయి. చైనా శాస్త్రవేత్తలు, మనీల (ఫిలిప్పీన్స్)లోని అంత ర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఇరి) ఉమ్మడి గా సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు రూపొందించారు. సుమారు 250 దేశవాళీ వరి వంగడాల్లోని సద్గుణాలను పుణికిపుచ్చుకున్న ఏడు విశిష్ట వంగడాలను ప.గో. జిల్లా ఆచంటకు చెందిన ధాన్య పండిట్ బిరుదాంకితులు, అభ్యుదయ రైతు శాస్త్రవేత్త నెక్కంటి సుబ్బారావు ఈ రబీలో తొలిసారిగా సాగు చేయడం సాగుబడి పాఠకులకు తెలిసిందే. ఈ 7 వంగడాలకు చెందిన 1,400 గ్రాముల విత్తనాలతో ట్రేలలో నారు పెంచి.. శ్రీ వరి పద్ధతిలో ఆరుతడులతో సాగు చేసి ఆయన 20 క్వింటాళ్ల వరకు విత్తనాలను ఉత్పత్తి చేశారు. ఈ వంగడాల్లో 4 చక్కని ఫలితాల నిచ్చాయని సుబ్బారావు తెలిపారు. సాధారణ వరి వంగడాలతో పోల్చితే 25% తక్కువ రసాయనిక ఎరువులతో, తక్కువ నీటితోనే మంచి దిగుబడి నిచ్చాయన్నారు. జడ్‌జీవై-1 విత్తనాలను తెలంగాణ, సీమలోని 10 జిల్లాల రైతులకు ఇస్తున్నానని చెప్పారు. అన్నదాతలూ ఆల్ ది బెస్ట్!
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
అంతిమ తీర్పరి రైతే!
జీరో ఫెర్టిలైజర్ వంగడం చక్కగా 30 బస్తాలు పండింది. జెడ్‌జీవై-1 అత్యధి కంగా 67 బస్తాల దిగుబడి నిచ్చింది. నా నుంచి విత్తనాలు తీసుకున్న 200 మంది రైతుల జాబితాను మనీలా పంపిస్తా. ఈ ఖరీఫ్‌లో 2 కిలోల విత్తనాలతో రబీలో 18 ఎకరాలకు విత్తనాలు తయారు చేసుకోవచ్చు. ఏ విత్తనానికైనా అంతిమ తీర్పరి రైతే.
- నెక్కంటి సుబ్బారావు (94912 54567), రైతు శాస్త్రవేత్త, ఆచంట