నారే మూలం | main importance of saplings | Sakshi
Sakshi News home page

నారే మూలం

Published Wed, Sep 17 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

main importance of saplings

 నాణ్యమైన నారు కోసం..
 నాణ్యమైన పొగాకు నారును పెంచాలంటే ప్రధానంగా నల్లరేగడి, ఎర్రగరప నేలలు అవసరం. ఊట్లపల్లిలో పొగాకుకు అనువైన నల్లరేగడి నేలలున్నాయి.

  ఎర్రగరప నేలలకంటే నల్లరేగడి నేలలో మొలకశాతం, వేరు బాగా తొడిగి మొక్క బలంగా ఉంటుంది.
  ఎకరం భూమిలో నారుమడి పెంచితే సుమారు వెయ్యి ఎకరాల్లో పొగాకు సాగుచేయవచ్చు.
  నారు సాగుచేయాలంటే రైతులకు పొగాకు బోర్డు వద్ద బ్యారన్ లెసైన్స్ ఉండాలి.
  భూమి ఏటవాలుగా ఉండాలి. బోరు వసతి ఉంటే మంచిది. నేలకు నీరు ఇంకిపోయే స్వభావం ఉండాలి.
  వాతావరణంలో పూర్తి తేమ ఉండొద్దు...అధిక ఉష్ణోగ్రతలూ నమోదుకావద్దు.
  ఒక ఎకరం పొలంలో నారుమడి పెంచాలంటే రూ.లక్ష పెట్టుబడి అవసరం.

 పొగాకు సాగుకు సన్నద్ధమయ్యేదెలా..
  పొగాకు బోర్డు, సీటీఆర్‌ఐ ఎంపిక చేసి సరపరా చేసిన విత్తనాలను మాత్రమే వినియోగించాలి.
  ఒక్కో బ్యారన్‌కు 100 గ్రాములు మాత్రమే సరఫరా చేస్తారు. గ్రామంలోని రైతులంగా ఓ రైతు పొలాన్ని ఎంచుకుని అక్కడే నారు మడిని ఏర్పాటు చేసుకోవాలి.
  వేసవి దుక్కులు దున్ని తొలకరి మొదలైన తర్వాత నాలుగైదు సార్లు భూమిని గుల్లగా దుక్కి చేసుకోవాలి.
  ఒకటన్ను పశువుల పెంట, గుళికలు, వర్మికంపోస్టును దుక్కిలో కలిసేటట్లు కలియదున్నాలి.
  ఒక మీటర్ వెడల్పున చెక్క లాగాలి. అదే సమయంలో బెడ్‌లనూ ఏర్పాటు చేసుకోవాలి.
  సిమెంట్ తూరతో రోలింగ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బెడ్ గట్టిపడి దృఢంగా ఉం టుంది.
  ఒక అగ్గిపెట్టె నిండా నారుగింజలు తీసుకుని కి లో ఇసుకలో కలుపుకుని బెడ్‌లపై చల్లుకోవాలి.
  మొలకెత్తకుండా ముందుగానే బెడ్‌లపై ఎండుగడ్డితో కప్పుకోవాలి.
  గడ్డిపై స్పింక్లర్, లేదా వాటర్‌క్యాన్‌ల ద్వారా వాటరింగ్ చేసుకోవాలి.

 జాగ్రత్తలు..
  బెడ్‌లపై నడవకుండా ఉండాలి. బెడ్‌లు మధ్యలో ఎత్తువచ్చి.. ఇరు వైపులా పల్లంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా బెడ్‌పై నీరు నిల్వ ఉండదు.
  వారం తర్వాత నారు మొలకలు ప్రారంభం కావడంతోనే గడ్డిని దశల వారీగా పక్కకు జరుపుకుంటూ నారు ఎదిగేందుకు జాగ్రత్త వహించాలి.
  మధ్యమధ్యలో నీళ్లు చల్లుకుంటూ మొదట్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. అలాగని నేల తడి ఆరిపోవడానికి వీల్లేదు.
  కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.
 
 తెగుళ్లు- నివారణ
  నారుమడులకు సాధారణంగా వచ్చే మాగుడు తెగులుకు బయోటెక్స్, మ్యాంకోజబ్ మిశ్రమాలను శాస్త్రవేత్తల సూచనల మేరకు పిచికారీ చేయాలి.
  వేరుకుళ్లు రాకుండా ఉండాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహిస్తే చాలు.
  బూజుపట్టిన, పండిన ఆకులను తొలగించాలి. ఇటువంటి పరిస్థితుల్లో సున్నపుతేటను పిచికారీ చేయాలి.
  వర్షం వెలిసిన తర్వాత మాగుడు తె గులు రాకుండా క్రిమిసంహారకాలను పిచికారీ చేసేముందు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి.
  పెరుగుదలకు అమ్మోనియా, డీఏపీ వంటి మందులు నీటిలో కలిపి క్యాన్‌లతో నారుమడులపై చల్లాలి. ఎరువుల అవశేషాలు ఆకులపై ఉండకుండా ఉండేందుకు వెంటనే పరిశుభ్రమైన నీటిని పిచికారీ చేయాలి.
  తగు జాగ్రత్తలు వహిస్తే 40 రోజుల తర్వాత నాణ్యమైన నారును సేకరించుకోవచ్చు.

 నాటు వేసేటప్పుడు..
 మొక్కలు నాటు వేసేటప్పుడూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నారు వేసే పొలం వద్ద నీటి లభ్యతను చూసుకోవాలి. అప్పటికప్పుడు నారు పీకి వెంటనే వేసుకుంటే మొక్క నాణ్యత దెబ్బతినదు. దూరప్రాంతం నుంచి నారు తెస్తే దాదాపు రెండురోజుల పడుతుంది. పొలం వద్ద, రవాణాలో మొక్కలు నలిగి నాణ్యత దెబ్బతింటుంది. స్థానికంగా నారు మడులను పెంచడం వల్ల విద్యుత్‌సరఫరా, చేను తడి, నాటే విస్తీర్ణం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నారు తెచ్చుకోవచ్చు. రవాణా ఖర్చులు కూడా ఉండవు. మొక్కలు దెబ్బతినవు కాబట్టి అధిక దిగుబడులు సాధించవచ్చని ఊట్లపల్లి రైతులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement