చిన్న రైతులు.. చిన్న ట్రాక్టర్లు
- 30 నుంచి 45 అశ్వశక్తి గల పెద్ద ట్రాక్టర్లను కొనలేని చిన్న కమతాల రైతుల కోసం మార్కెట్‌లో 16 అశ్వశక్తి గల చిన్న ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాయి.
- వీటి ఎత్తు, పొడవు తక్కువ. కాబట్టి చిన్న కమతాల్లోను, పండ్ల తోటల్లోనూ సులువుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వీటి ఇంధనపు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.
- ఈ ట్రాక్టరుకు అనుసంధానంగా ఉపయోగపడే వివిధ సేద్య పరికరాలను వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు.
- రెండు చెక్కల రెక్కల నాగలిని చిన్న ట్రాక్టర్‌కి అనుసంధానించి రోజుకు 3.5 నుంచి 4 ఎకరాల వరకు లోతు దుక్కి చేసుకోవచ్చు.
- ఆరు చెక్కల కల్టివేటర్‌ను అనుసంధానం చేసి నేలను వదులు చేయడానికి, చదును చేయడానికి, దున్నటానికి ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు. రోజుకు 5 నుంచి 6 ఎకరాల్లో సేద్యం చేసుకోవచ్చు.
- ఐదు చెక్కల విత్తనం, ఎరువు వేసే పరికరాన్ని చిన్న ట్రాక్టరుకు అనుసంధానించి.. శనగ, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, ప్రొద్దుతిరుగుడు విత్తనాలను, ఎరువులను ఏకకాలంలో తగిన మోతాదులో, తగిన లోతులో వేసుకోవచ్చు.
- చిన్న ట్రాక్టరుకు స్ప్రేయర్‌ను అనుసంధానించడం ద్వారా ఒకేసారి 40 అడుగుల వెడల్పు వరకు క్రిమిసంహారక మందులను పొలంలో రోజుకు 10 నుంచి 12 ఎకరాల వరకు పిచికారీ చేయవచ్చు.
- చిన్న ట్రాక్టర్లకు సరిపోయే పంట నూర్పిడి యంత్రం కూడా అందుబాటులో ఉంది. పంటను బట్టి జళ్లెను మార్చుకుంటూ ఈ పరికరాన్ని ఉపయోగించి గంటకు 2 నుంచి 2.5 క్వింటాళ్ల శనగ, జొన్న, మినుము తదితర పంటలను నూర్చవచ్చు.
ఠ మరిన్ని వివరాలకు ప్రధాన శాస్త్రవేత్త డా. జోసఫ్‌రెడ్డిని 94408 39340లో సంప్రదించవచ్చు.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు
1100, 1800 425 1110
కిసాన్ కాల్ సెంటర్ :1551
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్‌స,6-3-249/1,
రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034
saagubadi@sakshi.com