Small tractors
-
మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్లు: ఏఆర్ రెహమాన్ గీతం అదుర్స్
కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా): ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్తగా మరిన్ని వాహనాలను ఆవిష్కరించింది. చిన్న ట్రాక్టర్లు, కార్లు వీటిలో ఉన్నాయి. చిన్న కమతాల రైతులు, వ్యక్తిగత ఫామ్హౌస్లున్న వారు మొదలైన వర్గాలకు ఉపయోగపడేలా తేలికపాటి, చిన్న ట్రాక్టర్లను ఫ్యూచర్‌స్కేప్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రవేశపెట్టింది. మహీంద్రా ఓజా పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్ల శ్రేణిలో ఏడు మోడల్స్ ఉంటాయి. వీటి ధర రూ. 5,64,500 నుంచి రూ. 7,35,000 వరకు (పుణె– ఎక్స్ షోరూమ్) ఉంటుంది. తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో తయారు చేసే ఈ ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడంతో పాటు ఉత్తర అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూరప్ తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఈడీ (ఆటో, ఫార్మ్ విభాగాలు) రాజేశ్ జెజూరికర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ట్రాక్టర్ల ఎగుమతులను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 18,000 పైచిలుకు ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. ఓజా ప్లాట్‌ఫాంపై రూ. 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు జెజూరికర్ వివరించారు. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్ మెషినరీ కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. (2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్) థార్.ఈ, గ్లోబల్ పికప్ ఆవిష్కరణ.. ఫ్యూచర్‌స్కేప్ కార్యక్రమంలో భాగంగా ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘థార్.ఈ’ని కూడా ఆవిష్కరించింది. వినూత్నమైన డిజైన్, ఇంటీరియర్స్‌తో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు సంస్థ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజే నక్రా తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్ల కోసం గ్లోబల్ పికప్ వాహనాన్ని సైతం సంస్థ ఆవిష్కరించింది. రోజువారీ ప్రయాణ అవసరాలతో పాటు సాహస ట్రిప్‌లకు కూడా అనువుగా ఇది ఉంటుందని నక్రా వివరించారు. అటు, విద్యుత్ వాహనాల శ్రేణి కోసం నెలకొల్పిన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ (ఎంఈఏఎల్)కి కొత్త లోగోను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ‘లే ఛలాంగ్’ ప్రచార గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపర్చారు. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్) -
చిన్న రైతులు.. చిన్న ట్రాక్టర్లు
- 30 నుంచి 45 అశ్వశక్తి గల పెద్ద ట్రాక్టర్లను కొనలేని చిన్న కమతాల రైతుల కోసం మార్కెట్లో 16 అశ్వశక్తి గల చిన్న ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. - వీటి ఎత్తు, పొడవు తక్కువ. కాబట్టి చిన్న కమతాల్లోను, పండ్ల తోటల్లోనూ సులువుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వీటి ఇంధనపు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. - ఈ ట్రాక్టరుకు అనుసంధానంగా ఉపయోగపడే వివిధ సేద్య పరికరాలను వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. - రెండు చెక్కల రెక్కల నాగలిని చిన్న ట్రాక్టర్‌కి అనుసంధానించి రోజుకు 3.5 నుంచి 4 ఎకరాల వరకు లోతు దుక్కి చేసుకోవచ్చు. - ఆరు చెక్కల కల్టివేటర్‌ను అనుసంధానం చేసి నేలను వదులు చేయడానికి, చదును చేయడానికి, దున్నటానికి ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు. రోజుకు 5 నుంచి 6 ఎకరాల్లో సేద్యం చేసుకోవచ్చు. - ఐదు చెక్కల విత్తనం, ఎరువు వేసే పరికరాన్ని చిన్న ట్రాక్టరుకు అనుసంధానించి.. శనగ, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, ప్రొద్దుతిరుగుడు విత్తనాలను, ఎరువులను ఏకకాలంలో తగిన మోతాదులో, తగిన లోతులో వేసుకోవచ్చు. - చిన్న ట్రాక్టరుకు స్ప్రేయర్‌ను అనుసంధానించడం ద్వారా ఒకేసారి 40 అడుగుల వెడల్పు వరకు క్రిమిసంహారక మందులను పొలంలో రోజుకు 10 నుంచి 12 ఎకరాల వరకు పిచికారీ చేయవచ్చు. - చిన్న ట్రాక్టర్లకు సరిపోయే పంట నూర్పిడి యంత్రం కూడా అందుబాటులో ఉంది. పంటను బట్టి జళ్లెను మార్చుకుంటూ ఈ పరికరాన్ని ఉపయోగించి గంటకు 2 నుంచి 2.5 క్వింటాళ్ల శనగ, జొన్న, మినుము తదితర పంటలను నూర్చవచ్చు. ఠ మరిన్ని వివరాలకు ప్రధాన శాస్త్రవేత్త డా. జోసఫ్‌రెడ్డిని 94408 39340లో సంప్రదించవచ్చు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు 1100, 1800 425 1110 కిసాన్ కాల్ సెంటర్ :1551 మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్స,6-3-249/1, రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034 saagubadi@sakshi.com