
పందెపు గిత్తలకు సుగర్ ముప్పు!
♦ అధిక శ్రమ, ఒత్తిడే కారణం
♦ పశువైద్య నిపుణుడు డా. సుధాకర్‌రెడ్డి కృషితో వెలుగు చూసిన వైనం
మధుమేహం (డయాబెటిస్) అనగానే మనుషులకు వచ్చే వ్యాధిగానే పరిగణించటం సహజం. కానీ పశువులక్కూడా ఈ వ్యాధి వస్తుందనే సంగతి ఓ పశువైద్య నిపుణుని కృషితో దేశంలోనే తొలిగా వెలుగులోకి వచ్చింది. వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డా. భవనం సుధాకర్‌రెడ్డి అధిక వత్తిడికి గురయ్యే పశువులు మధుమేహం బారిన పడుతున్నట్టు కనుగొన్నారు. లూథియానాలో 2 నెలల క్రితం జరిగిన భారతీయ పశువైద్య మండలి సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రానికి ఆయనకు అవార్డు కూడా వచ్చింది.
ఒంగోలు జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన భవనం సుధాకర్‌రెడ్డి తిరుపతిలోని పశు వైద్య విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేశారు. 2012 నుంచి ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాలలో సహాయ ఆచార్యులుగా పని చేస్తున్నారు. బండలాగుడు పోటీల్లో పాల్గొనే ఎడ్లు బలహీన పడి, బరువు తగ్గుతుండటంతో వాటి యజమానులు ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలకు తీసుకొస్తూ ఉంటారు. ఎడ్ల మూత్రం, రక్తాన్ని పరీక్షించిన ఆయన మధుమేహం పాలైనట్లు గుర్తించారు.
పశువుల మూత్రాన్ని పరీక్షించగా.. ఆరోగ్యవంతమైన పశువుల్లో ఉదజని సూచిక (పీహెచ్) స్థాయి 7-9 వరకు ఉంది. మధుమేహం సోకిన పశువుల్లో 5-6కు పడిపోయింది. తెల్ల రక్తకణాలు, కీటోన్ బాడీస్, చక్కెర స్థాయిలు కూడా అధికంగా ఉన్నట్టు తేలింది.
అధిక శారీరక శ్రమ, హార్మోన్లలో అసమతుల్యత, స్టెరాయిడ్స్ వాడకం వంటి కారణాల వల్ల పశువులు మధుమేహానికి గురవుతున్నాయని డా. సుధాకర్‌రెడ్డి అంటున్నారు. ముఖ్యంగా బండలాగుడు పోటీల్లో పాల్గొనే ఎడ్లు మధుమేహం బారిన పడే అవకాశాలు అధికం. వాటికయ్యే గాయాలు, నొప్పులను తగ్గించేందుకు ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్ మోతాదుకు మించి వాడ టం కూడా ఈ వ్యాధి కి దారితీస్తోందని ఆయన అంటున్నారు. వైరల్ జ్వరాలతో పేగులు దెబ్బతిన్నా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.
చక్కెర స్థాయిల్లో అసమతుల్యత వల్ల కీటోన్ బాడీస్ పెరిగి పశువులు పిచ్చిగా ప్రవర్తిస్తాయి. బరువు కూడా తగ్గుతాయి. నీరు ఎక్కువగా తాగుతూ తరచూ మూత్ర విసర్జన చేస్తాయి. మూత్రం బెల్లం రంగులో ఉండి, కొంచెం జిగటగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి నరాల బలహీనత ఏర్పడుతుంది. అప్పుడు మనుషుల్లాగే పశువులకు కూడా ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మధుమేహం సోకిన పశువులకు చికిత్స చేయటం ప్రయాసతో కూడుకున్న పని. ఇది వైద్యుడి పర్యవేక్షణలోనే జరగాలి.
- కె.వీరారెడ్డి, ప్రొద్దుటూరు, వైఎస్సార్ కడప జిల్లా
ముందు జాగ్రత్తే మేలు..
పశువులను ఎక్కువగా ఒత్తిడికి గురిచేయకూడదు. అవసరం లేకున్నా స్టెరాయిడ్స్ వాడ కూడదు. పశువుల రక్తం, మూత్రంలో చక్కెర పరీక్షలు చేయించటం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. వ్యాధి వచ్చాక బాధపడేకంటే ముందు జాగ్రత్తలు పాటించటం మేలు.
- డా. భవనం సుధాకర్‌రెడ్డి (90302 18657), సహాయ ఆచార్యులు (ఔషధ విభాగం), పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు, వైఎస్సార్ కడప జిల్లా