చెరకుకు ప్రత్యామ్నాయం తీపిజొన్న! | Sweet corn is alternative to sugarcane | Sakshi
Sakshi News home page

చెరకుకు ప్రత్యామ్నాయం తీపిజొన్న!

Published Tue, May 10 2016 12:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

చెరకుకు ప్రత్యామ్నాయం తీపిజొన్న! - Sakshi

చెరకుకు ప్రత్యామ్నాయం తీపిజొన్న!

♦ చెరకు కన్నా తక్కువ నీటితో, తక్కువ కాలంలోనే పండించవచ్చు
♦ ఇథనాల్, ఆల్కహాల్ తయారీకి ఉపయోగం
♦ ఉప ఉత్పత్తులతో అపార ఆర్థిక ప్రయోజనాలు
♦ చిక్కోలులో ప్రయోగాత్మకంగా 300 ఎకరాల్లో సాగు.. ప్రారంభమైన క్రషింగ్
 
బహుళ ప్రయోజనాల పంట తీపి జొన్న (స్వీట్ సోర్గమ్). గడ్డు పరిస్థితులకు ఎదురొడ్డి నిలవటం ఈ పంట నైజం. ఇది సాధారణ జొన్న మాదిరిగా ఆహార పంటే కాదు.. జీవ ఇంధనాన్ని కూడా అందిస్తుంది. అంతేకాదు.. దీని ఉప ఉత్పత్తులు ఎన్నెన్నో. దీని సాగును పరిశ్రమలతో అనుసంధానించటం ద్వారా రైతుల బతుకుల్లో కొత్త వెలుగులు నింపవచ్చు. చెరకు సాగుతో విసిగిపోయిన రైతులకు ఇది చక్కని ప్రత్యామ్నాయ పంట. శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి పారిస్ షుగర్ ఫ్యాక్టరీ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రైతులు తీపిజొన్నను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. సోమవారం నుంచి క్రషింగ్, ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ‘సాగుబడి’ స్పెషల్ ఫోకస్.

 చెరకు రైతులకు ప్రత్యామ్నాయ పంటగా తీపి జొన్న అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి శ్రీకాకుళం జిల్లా రేగిడి, పాలకొండ, వీరఘట్టాం మండలాల్లో 300 ఎకరాల్లో తీపిజొన్న ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నది. సంకిలి చెక్కెర కర్మాగారం యాజమాన్యం రైతులను ప్రోత్సహించి  ఈ పంటను సాగు చేయిస్తోంది. తొలిసారిగా తీపిజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభమైంది. చెరకు సాగుతో నష్టాలు రావటం వల్ల రైతులు ఇతర పంటల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని చక్కెర కర్మాగారాలకున్న సామర్థ్యంలో 50 శాతం వరకు మాత్రమే చెరకు లభిస్తోంది. ఈ గడ్డు పరిస్థితుల్లో తీపిజొన్న సాగుతో ఇటు రైతులకు అటు చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యాలకూ లాభం కలుగుతుందని భావిస్తున్నారు.

 తీపి జొన్న పంట కాలం 110 రోజులు
 చెరకు ఏడాదికి ఒక పంటే చేతికొస్తుంది. తీపి జొన్న పంట కాలం 110 రోజులు మాత్రమే. అంటే ఏడాదికి మూడు పంటలు పండించవచ్చు. చెరకు 30 టన్నుల దిగుబడి వస్తే చాలనుకునే స్థితిలో రైతులున్నారు. తీపి జొన్న ఎకరాకు 20-25 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా దిగుబడులను మరింత పెంచుకునే అవకాశమూ ఉందని నిపుణులు చెబుతున్నారు.

 చెరకులో 30 టన్నుల దిగుబడి వస్తే టన్నుకు రూ. 2,500 చొప్పున ఎకరాకు రూ. 75 వేల ఆదాయం వస్తోంది. ఖర్చులకు, వచ్చే ఆదాయానికి సరిపోతోంది. తీపిజొన్న టన్నుకు ప్రారంభ ధర రూ. 1,300 వరకు చెల్లిస్తున్నారు. ఎకరాకు రూ. 20 వేల వరకు ఆదాయం వస్తోంది.

 రేగిడి మండలంలో ఖండ్యాం, తునివాడ, వెంకమపేట, సంకిలి, బొడ్డువలస, కొమెర తదితర గ్రామాల్లో 300 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. తొలివిడతలో 110 మంది రైతులు ఈ పంటను వేశారు. మరో 250 ఎకరాల్లో ఈ పంటను సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

 పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం జీవ ఇంధనాల వాడకాన్ని పెంచాలని భావిస్తోంది. పర్యావరణంపై దుష్ర్పభావం, విదేశీ మారక నిల్వలపై చూపుతున్న ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకు జీవ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇథనాల్‌ను జీవ ఇంధనంగా పెట్రోల్‌తో కలిపి వాడుతున్నారు. 10 శాతం బయో ఇథనాల్ వాడకాన్ని తప్పనిసరి చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. పండ్లను మాగబెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌కు బదులు ఇథనాల్ వాడుతున్నారు. ఈ కారణాల వల్ల భవిష్యత్‌లో తీపిజొన్న సాగుకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
 - ఎస్. పి. నాయుడు, సాక్షి, రేగిడి, శ్రీకాకుళం జిల్లా
 
 తక్కువ నీటితోనే తీపిజొన్న సాగు
 తీపిజొన్న పైరు బాగుంది. తక్కువ నీటి తడులతోనే ఈ పంటను సాగు చేయవచ్చు. చెరకుతో పోల్చితే సాగు ఖర్చు తక్కువ. దిగుబడి, ఆదాయం ఎంత వస్తుందో చూడాలి.
 - దూసి ప్రసాదరావు (91777 52162), రైతు, ఖండ్యాం, రేగిడి మం, శ్రీకాకుళం జిల్లా
 
 రెండెకరాల్లో తీపిజొన్న సాగు చేశా..
 ఇప్పటి వరకూ చెరకు పంటనే సాగు చేస్తున్నాం. ఏడాదికి ఒక పంట మాత్రమే వస్తుంది. పంట మార్పిడి కోసమని తీపిజొన్నను రెండెకరాల్లో సాగు చేశాను. తక్కువ కాలంలో ఈ పంట చేతికొస్తుంది కాబట్టి మేలే. పంట ఆశాజనకంగా ఉంది.
 - కింజరాపు సురే ష్‌నాయుడు, రైతు, కె.వెంకటాపురం,  రేగిడి మం,  శ్రీకాకుళం జిల్లా
 
 తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా...
 నీటి ఎద్దడి, కూలీల కొరత కారణంగా చెరకు సాగు తగ్గుతోంది. కర్మాగారంలో ఇథనాల్ తయారీకి చెరకుకు  ప్రత్యామ్నాయంగా తీపి జొన్న ఉపయోగపడుతుంది. తొలిసారిగా సంకిలిలోని ఈఐడీ పారిస్ చక్కెర కర్మాగారంలోనే ఈ పంటను గానుగాడిస్తున్నాం. కోతకోసిన 8 గంటల లోపు దీన్ని పూర్తి చేయాల్సి ఉండటం వల్ల ప్రయోగాత్మక సాగుకు ఫ్యాక్టరీ దగ్గర్లోని గ్రామాలను ఎంపికచేశాం. చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్ తయారీ అనుబంధ పరిశ్రమ. దీని తయారీకి ఇప్పటి వరకు వాడుతున్న చెరకు పంటకు ప్రత్యామ్నాయంగా తీపిజొన్నను ముందుకు తెచ్చే కృషి జరుగుతోంది.
 - ఎ. నాగిశేషారెడ్డి (76809 62888), జీఎం, ఈఐడీ పారిస్ చక్కెర కర్మాగారం, సంకిలి,శ్రీకాకుళం జిల్లా
 
 అన్ని భూముల్లోనూ సాగు చేయొచ్చు..
 అన్ని రకాల భూములు తీపిజొన్న సాగుకు అనుకూలమే. చెరకు కన్నా తక్కువ నీటితోనే దీన్ని సాగు చేయవచ్చు. వేసవిలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు. 110 రోజుల్లో పంట చేతికొస్తుంది. దిగుబడులు బావుంటాయి.
 - ఎం. మధుసూదనరావు (88866 12679) వ్యవసాయాధికారి, రేగిడి, శ్రీకాకుళం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement