ప్రస్తుత సమయంలో వరి వేసి రైతులు నష్టపోవద్దని మధిర వ్యవసాయ పరిశోధన స్థానం...
మధిర: ప్రస్తుత సమయంలో వరి వేసి రైతులు నష్టపోవద్దని మధిర వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు బి. బాలజీనాయక్, డాక్టర్ డి.శివాని, బీవీ వరప్రసాద్, వి.శ్రీధర్ సూచిస్తున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల రైతులు వరినారు పోయటం, నాట్లు వేయటం వంటివి చేస్తున్నట్లు తాము గమనించామన్నారు. ఇప్పుడు వరినాట్లు వేస్తే దిగుబడి గణనీయంగా తగ్గుతుందన్నారు. వరి నార్లు పోయటం, నాట్లు వేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు. సోమవారం వారు ‘సాక్షి’కి వరి పంట- మెళకువలను వివరించారు.
రైతులు నవంబర్ నెల వరకు వేచివుండి రబీసీజన్‌కు సిపారసు చేసిన రకాలను నాటుకోవాలి. ఖరీఫ్ సీజన్‌లో నాటే సమయం ఇప్పటికే మించి పోయింది. ఆలస్యంగా వేసే వరిలో చీడపీడలు వ్యాపిస్తాయి. తాలుగింజలశాతం అధికంగా ఉంటుంది. దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ముదురునారు వేసుకున్న రైతులు పలు యాజమాన్య పద్ధతులు పాటించాలి.
ముదురు నారు (45-55 రోజులు) వేసిన పొలాల్లో సిఫారసు చేసిన నత్రజని ఎరువులను రెండు దఫాలుగా వేయాలి. అందులో 1/3వ వంతు నాటిన 10-15 రోజుల్లో, మిగిలినది 30-40 రోజుల్లో వేయాలి.
సిపారసు చేసిన నత్రజని ఎరువులను 15-20 శాతం అధికంగా వేయాలి.
వరినాట్లు దగ్గరదగ్గరగా అనగా చదరపు మీటర్‌కు 44 నుంచి 60 కుదుళ్లు ఉండే విధంగా వేయాలి. కుదురుకు నాలుగైదు మొక్కల చొప్పున నాటాలి.
నారు బాగా పెరిగితే కొసలు తుంచి వేసుకోవాలి.
ముఖ్యంగా ఎంటీయూ-1010 రకం ముదురునారు వేయకూడదు.
వరినాటిన 20-25 రోజుల్లో ఎకరానికి కార్బోప్యూరాన్ గుళికలు 10 కేజీలు లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు 8 కేజీల చొప్పున వేయాలి.
వరినాటిన 20-25 రోజుల్లో కలుపును కూలీల సహాయంతో తీయించాలి. లేనిపక్షంలో బిస్ పైరీబాక్ సోడియం ఎకరానికి 100 మి.లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి.
ఈ సూచనలతోపాటు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనమేరకు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.