భుజియింపవయ్య బొజ్జగణపయ్య
నైవేద్యాన్ని తృప్తిగా స్వీకరించి భక్తుల కడుపు నింపే దేవుడు...
ముక్కోటి దేవతల్లో...
బొజ్జగణపయ్య ఒక్కడే!
పెడుతుంటే చెయ్యడ్డు పెట్టడు పెడుతున్నదేమిటని చూడనే చూడడు!
అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
ఎనీథింగ్...
నిటలాక్షుని అగ్రసుతునికి విందే!
ఇవన్నీ కలిసిన ఉండ్రాళ్లయితేనా...
ఇక చెప్పేదేముందీ...
ఆయనకు భుక్తాయాసం.
మనకు భక్తాయాసం.
జిల్లేడుకాయలు
కావలసినవి:
బియ్యప్పిండి - 2 కప్పులు
నీరు - 5 కప్పులు
కొబ్బరితురుము - కప్పు
బెల్లం తురుము - కప్పు
ఏలకులపొడి - టీ స్పూను
తయారి:
ఒక పాత్రలో నీరు మరిగించాలి.
బియ్యప్పిండి వేసి బాగా కలిపి మంట తగ్గించి, పదినిముషాలుంచి దించేయాలి.
బాణలిలో కొబ్బరితురుము, బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి స్టౌమీద ఉంచి, ఉడికించి దించేయాలి.
చల్లారాక చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.
కొద్దిగా బియ్యప్పిండిని చేతిలోకి తీసుకుని, పల్చగా ఒత్తి కొబ్బరి ఉండను అందులో ఉంచి జిల్లేడుకాయ ఆకారంలో అంచులను మూసేయాలి.
ఇలా అన్నీ తయారుచేకుని, ఇడ్లీ రేకులలో ఉంచి, కుకర్‌లో పెట్టి, మూత ఉంచాలి.
పదినిముషాలయ్యాక దించేయాలి. (విజిల్ పెట్టకూడదు)
కేసర్ పనీర్ మోద క్ పేడా
కావలసినవి:
పనీర్ - అరకప్పు
పాలపొడి - అరకప్పు
పాలు - అరకప్పు
పంచదార - అరకప్పు + 3 టేబుల్ స్పూన్లు
ఏలకులపొడి - అర టీ స్పూను
కుంకుమపువ్వు - కొద్దిగా
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
తయారి:
పనీర్‌ని మెత్తగా పొడి చేయాలి.
(అవసర మనిపిస్తే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవచ్చు)
మందపాటి బాణలిలో పనీర్ పొడి, పాలపొడి, పాలు, కుంకుమపువ్వు వేసి అన్నీ కలిసేవరకు బాగా కలపాలి.
నెయ్యి జత చేసి కలపాలి.
కిందకు దించి చల్లారనివ్వాలి.
మిక్సీలో పంచదార, ఏలకులపొడి వేసి మెత్తగా చేయాలి.
ఈ పొడిని పనీర్ మిశ్రమంలో వేసి కలపాలి. (తీపిఎక్కువ తినేవారు, మరి కాస్త జత చేయవచ్చు)
ఈ మిశ్రమాన్ని ఉసిరికాయ పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. (మోదక్ మౌల్డ్‌లు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగించవచ్చు).
బిళ్ల కుడుములు
కావలసినవి:
బియ్యపురవ్వ - కప్పు
నీరు - 3 కప్పులు
నూనె - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
తయారి:
బాణలిలో రవ్వను కొద్దిగా (నూనె లేకుండా) వేయించాలి.
ఒక మందపాటి పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి.
మరుగుతున్న నీటిలో రవ్వ వేసి కలపాలి.
మంట తగ్గించి సుమారు పది నిముషాలు ఉంచి దించి, చల్లారనివ్వాలి.
చేతికి నూనె రాసుకుని, ఉడికించుకున్న రవ్వను కొద్దిగా తీసుకుని ఉండలుగా చేసి, వాటిని టిక్కీల మాదిరిగా ఒత్తాలి.
స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక టీ స్పూను నూనె వేసి ఈ టిక్కీలను ఒక్కొక్కటిగా వేసి రెండువైపులా కాల్చాలి.
వీటిని ఉల్లిపాయ చట్నీతో తింటే బాగా రుచిగా ఉంటాయి.
(గోధుమవర్ణంలోకి మారాక రెండవవైపు తిప్పాలి. లేదంటే విరిగిపోతాయి)
తామర గింజల పాయసం
కావలసినవి:
తామర గింజలు - కప్పు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి)
పాలు - అర లీటరు; కండెన్స్‌డ్ మిల్క్/ పంచదార - 6 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు - కొద్దిగా
బాదంపప్పు ముక్కలు - టీ స్పూను; పిస్తా పప్పులు - కొద్దిగా
కిస్‌మిస్ - రెండు టేబుల్ స్పూన్లు; ఏలకులపొడి - అర టీ స్పూను
తయారి:
మందపాటి పాత్రలో సన్నటి మంట మీద పాలు మరిగించాలి.
తామర గింజలను చిన్నచిన్న ముక్కలుగా చేయాలి.
బాణలిలో నెయ్యి వేసి కరిగాక, బాదంముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిస్‌మిస్ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.
అదే బాణలిలో మిగిలి ఉన్న నేతిలో తామర గింజలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి.
సగం గింజలను మిక్సీలో వేసి పొడి చేయాలి.
మిగిలిన గింజలను, తామరగింజల పొడిని పాలలో వేసి ఉడికించాలి.
కండెన్స్‌డ్ మిల్క్ లేదా పంచదార జతచేయాలి.
టేబుల్ స్పూన్ పాలలో కుంకుమపువ్వు వేసి బాగా కలిపి మరుగుతున్న పాలలో వేసి ఐదు నిముషాలు ఉంచాలి. ఏలకులపొడి, డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి.
బౌల్స్‌లో పోసి పిస్తా ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
చిక్కుడుగింజలు-ఉండ్రాళ్లు
కావలసినవి:
బియ్యప్పిండి - కప్పు
నీరు - 2 క ప్పులు; నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - అర టీ స్పూను
చిక్కుడు గింజలు - అర కప్పు
కొబ్బరి తురుము - అర కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను
నిమ్మరసం - టీ స్పూను
ఆవాలు - పావు టీ స్పూను
జీలకర్ర - పావు టీ స్పూను
శనగపప్పు - అర టీ స్పూను
మినప్పప్పు - అర టీ స్పూను
నూనె - మూడు టీ స్పూన్లు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత
బాల్స్ తయారి:
ఒక పాత్రలో నీరు, ఉప్పు, కొద్దిగా నూనె పోసి మరిగించాలి.
మంట తగ్గించి బియ్యప్పిండి పోసి కలిపి మూత పెట్టి 15 నిముషాలు ఉంచాలి.
ఒక వెడల్పాటి పాత్రకు నూనె రాయాలి.
కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఉండలుగా చేసి, వీటిని ప్లేట్ మీద ఉంచి, పైన కొద్దిగా నూనె జల్లి కుకర్‌లో ఉంచి మూతపెట్టి పదినిముషాలు ఉంచి దించేయాలి.
చిక్కుడు గింజలను ఉడికించి నీరు తీసేయాలి.
పాన్‌లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి.
ఉడికించిన చిక్కుడు గింజలు, చిన్న ఉండ్రాళ్లు, వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి.
నిమ్మరసం, కొబ్బరితరుగులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
బెల్లం కుడుములు
కావలసినవి:
బియ్యప్పిండి - అర కప్పు
నీరు - ముప్పావు కప్పు; బెల్లం తురుము - అర కప్పు కంటె కొద్దిగా తక్కువ; ఎండుకొబ్బరి తురుము - మూడు టేబుల్ స్పూన్లు
ఏలకులపొడి - కొద్దిగా; నెయ్యి/నూనె - రెండు టేబుల్ స్పూన్లు
తయారి:
ఒక పెద్ద పాత్రలో నీరు పోసి మరిగించాలి.
బెల్లం తురుము వేసి రెండు మూడు నిముషాలు కలపాలి.
ఏలకులపొడి, ఎండుకొబ్బరి తురుము, బియ్యప్పిండి వేసి ఆపకుండా కలపాలి.
కిందకు దించి ఐదు నిముషాలు వదిలేయాలి.
చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతులలోకి తీసుకుంటూ, ఉండలు చేయాలి.
వీటిని కుకర్‌లో ఇడ్లీ రేకుల మీద ఉంచి, వాటి మీద కొద్దిగా నెయ్యి వేసి, మూత పెట్టాలి (విజిల్ పెట్టకూడదు).
పది నిముషాలయ్యాక దించేయాలి.
ఉండ్రాళ్లు
కావలసినవి:
బియ్యపురవ్వ - రెండుకప్పులు
నీరు - మూడున్నర కప్పులు
శనగపప్పు - పావు స్పూను; ఉప్పు - తగినంత
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
తయారి:
ఒక పెద్ద పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి.
శనగపప్పు వేసి బాగా కలపాలి.
రవ్వ వేస్తూ ఆపకుండా కలిపి, మంట తగ్గించాలి.
కొద్దిగా చల్లారాక చేతికి నూనె చేసుకుని, బియ్యపురవ్వను కొద్దిగా తీసుకుంటూ ఉండ్రాళ్లు చేయాలి.
ఉల్లి చట్నీ తయారి
కావలసినవి:
ఉల్లితరుగు - కప్పు; ఎండుమిర్చి - 6
పచ్చికొబ్బరి తురుము- పావు కప్పు; చింతపండుగుజ్జు - టీ స్పూను
బెల్లం తురుము - టీ స్పూను; ఉప్పు - తగినంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు; నెయ్యి - టీ స్పూను
తయారి:
మిక్సీలో ఎండుమిర్చి, పచ్చికొబ్బరి తురుము, బెల్లం తురుము, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి
ఉల్లితరుగు, చింతపండు గుజ్జు వేసి మరో మారు మిక్సీ పట్టి పేస్ట్ తయారుచేసుకోవాలి (మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి)
బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి సుమారు పది నిముషాలు వేయించాలి
మరో బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించి ఈ మిశ్రమాన్ని పచ్చడిలో వేసి కలిపి బిళ్ల కుడుములతో వడ్డించాలి.
నోట్
రవ్వ తయారి: బియ్యాన్ని శుభ్రంగా కడిగి పది నిముషాలు
నానబెట్టి నీరు వడపోసి, వస్త్రం మీద ఆరపోయాలి.
నీరంతా పోయాక (బియ్యం తడిగానే ఉండాలి) మిక్సీలో వేసి విప్పర్ మోడ్‌లో మిక్సీ తిప్పి రవ్వ తయారుచేసి, జల్లించాలి.
సేకరణ: డా.వైజయంతి
కర్టెసీ: చెఫ్ అండ్ హర్ కిచెన్