
ఎక్కువైనా... తక్కువైనా నష్టమే
పాడి-పంట: పెనుగొండ (పశ్చిమ గోదావరి): మనకు అందుబాటులో ఉన్న నీటిలో 90 శాతాన్ని వ్యవసాయ రంగమే ఉపయోగించుకుంటోంది. అందులో నూ సుమారు 65 శాతం నీటిని వరి పైరుకు విని యోగిస్తున్నారు. అయితే ఈ పంటలో నీటి విని యోగ సామర్థ్యం చాలా సందర్భాలలో 40 శా తం కంటే తక్కువగానే ఉంటోంది. అవసరానికి మించి వినియోగించడం వల్ల నీరు వృథా అవుతోంది. దిగుబడులూ తగ్గుతున్నాయి. వరి పైరు కు నీటి అవసరం దాని పెరుగుదల దశలపై ఆధారపడి ఉంటుంది. ఏ దశకు ఎంత నీరు అవసరమో అంతే ఇవ్వాలి. నీరు ఎక్కువైనా, తక్కువైనా నష్టం తప్పదు. కాబట్టి ఆయా దశల్లో స రైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అధికోత్పత్తిని, తద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చునని చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మానుకొండ శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన రెడ్డి. ఆ వివరాలు..
ప్రధాన పొలం తయారీకి...
ప్రధాన పొలంలో ముందుగా పశువుల ఎరువు వేసి, 5-10 సెంటీమీటర్ల లోతు ఉండేలా నీరు పెట్టి బాగా కలియదున్నాలి. పచ్చిరొట్ట పైరు వేసుకున్న వారు దానిని కూడా భూమిలో కలియదున్నాలి. సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల భూమికి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పచ్చిరొట్ట పైరు భూమిలో కుళ్లిపోవడానికి మూడు వారాల సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకూ చేలో 5 సెంటీమీటర్ల నీటిని నిలగట్టాలి.
ప్రధాన పొలాన్ని తయారు చేసుకునే సమయంలో చేలో 10-15 సెంటీమీటర్ల లోతున నీటిని నిలగట్టి బాగా దమ్ము చేయాలి. దీనివల్ల భూమిలో గట్టి మట్టి పొర ఏర్పడుతుంది. భూమి లోపలి పొరల్లోకి నీరు ఇంకిపోకుండా అది అడ్డుకుంటుంది. పొలాన్ని దమ్ము చేయడం పూర్తయిన తర్వాత చదును చేసేటప్పుడు పలచగా నీరు ఉండాలి. భూమిని బాగా దమ్ము చేసి, చదును చేస్తే నీరు-పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కలుపు సమస్య కూడా తగ్గుతుంది.
నాటేటప్పుడు-ఆ తర్వాత...
వరి నాట్లు వేసేటప్పుడు చేలో పలచగా... అంటే 2 సెంటీమీటర్ల నీరు ఉండాలి. దీనివల్ల నారు మొక్కలను సరైన లోతులో నాటవచ్చు. నాట్లు పూర్తయిన తర్వాత నాలుగైదు రోజుల వరకూ 5 సెంటీమీటర్ల లోతున నీరు పెట్టాలి. ఇలా చేయ డం వల్ల వరి మొక్కలు గాలికి వాలి తేలిపోవు. భూమిలోనే నిటారుగా ఉండి, నిలదొక్కుకొని స్థిరపడతాయి. మూన త్వరగా తిరుగుతుంది. మొక్కల్లో భాష్పోత్సేక నష్టం తగ్గుతుంది. మొక్క త్వరగా కొత్త వేర్లు తొడుగుతుంది.
పిలక దశ నుంచి...
నాట్లు వేసిన తర్వాత 4-7 రోజుల్లో వరి మొక్క లు మూన తిరుగుతాయి. వేసినరకాన్ని బట్టి మూన తిరిగిన తర్వాత 30-40 రోజుల వరకూ పిలకలు వేసే దశ కొనసాగుతుంది. పిలకలు తొ లుత నెమ్మదిగా, ఆ తర్వాత ఎక్కువగా వస్తా యి. పిలకలు పెట్టే సమయంలో పొలంలో నీరు పలచగా... అంటే రెండు సెంటీమీటర్లకు మించకుండా ఉండాలి. ఆ సమయంలో నీటి లోతు ఎక్కువైతే పిలక అంకురాలు నీటిలో మునిగిపోతాయి. ఫలితంగా పిలకల సంఖ్య తగ్గుతుంది. అంతేకాక మొక్క పొడుగ్గా పెరుగుతుంది. ఈ దశలో పంట నీటి ఎద్దడికి గురైతే దిగుబడి 30 శాతం వరకూ తగ్గే ప్రమాదం ఉంది.
పిలక దశలో పైరుకు పైపాటుగా యూరి యా వేసేటప్పుడు చేలో సన్నని నీటి పొర ఉండేలా చూసుకోవాలి. యూరియా వేసిన 36-40 గంటల తర్వాత మామూలుగా నీరు పెట్టాలి. బరువు నేలల్లో నాట్లు వేసిన 45 రోజులప్పుడు సుమారు 2 రోజుల పాటు నేలను ఆరబెట్టాలి. ఆ తర్వాత తిరిగి కొత్త నీరు పెట్టాలి. దీనివల్ల వెన్ను వేయని పిలకలు తగ్గి, వేరు వ్యవస్థకు కావాల్సినంత ఆక్సిజన్ లభించి, మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఎక్కువ పిలకలు వస్తాయి. చిరుపొట్ట దశ నుం చి గింజ గట్టి పడే దాకా వరి చేలో 5 సెంటీమీటర్ల లోతు వరకూ నీరు ఉండాలి. కోతకు 10 రోజుల ముందు నీటిని నెమ్మదిగా తగ్గించి, పొలాన్ని ఆరబెట్టాలి.
ఎలా నివారించాలి?
వరిలో నీటి వృథాను నివారించాలంటే... తేలి క నేలల్లో ముందుగా చెరువు మట్టిని తోలి, సేంద్రియ-పచ్చిరొట్ట ఎరువులు వేసి, పొలా న్ని బాగా దమ్ము చేసి చదును చేయాలి. మాగా ణి వరి పొలానికి ముందుగా నీరు పెట్టి, నాలుగైదు సార్లు దమ్ము చేయాలి. ఇలా చేయడం వల్ల నీరు వృథాగా భూమిలోకి ఇంకదు. వరి చేలో 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీరు ఉన్నట్లయితే భూమ్యాకర్షణ శక్తి వల్ల ఇంకిపోతుం ది. పైగా మనం వేసిన నత్రజని ఎరువు కూడా వృథా అవుతుంది. కాబట్టి చేలో ఎప్పుడూ 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీరు ఉండకూడదు. పంటకు అవసరాన్ని బట్టి రోజు విడిచి రోజు నీరు పెట్టాలి. ఎరువులు పూర్తి స్థాయిలో పైరుకు ఉపయోగపడాలన్నా, పిలకలు ఎక్కువ సంఖ్యలో రావాలన్నా సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి.