
ఆత్మహత్యలను ఆపగలిగేది ‘జీరోబడ్జెట్’ సేద్యమే!
వ్యవసాయ సంక్షోభానికి దారితీస్తున్న మౌలిక సమస్యలను పట్టించుకోకుండా.. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎన్ని ప్యాకేజీలు ప్రకటించినా వృథా ప్రయాసేనని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ అంటున్నారు. సామాజిక కార్యకర్తలు, సినీనటులు ప్రజల నుంచి విరాళాలు సేకరించి.. చనిపోయిన రైతుల కుటుంబాల్లో కొందరికి రూ. 10-15 వేల వరకు ఇస్తుండడాన్ని ప్రస్తావిస్తూ.. వ్యవసాయ సంక్షోభం మూల కారణాల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పాలేకర్ సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. రసాయనిక సేద్యంలో ఖర్చు అధికమై రైతులపై పెరుగుతున్న రుణభారం.. సాగునీటి వసతి లేకపోవటం.. ప్రకృతి వైపరీత్యాలు.. తప్పుడు మార్కెట్ విధానాల వల్ల రైతు దోపిడీకి గురికావడం..
రైతు వ్యతిరేక, అమానవీయ ప్రభుత్వ విధానాలు.. తప్పనిసరి అవుతున్న వివాహ వేడుకలు, వరకట్న ఖర్చులు.. ఉపాధి కోసం గ్రామీణ యువత పట్టణాలకు వలస వెళ్లటం... వంటి సమస్యల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మూల కారణాలను నియంత్రించటం ద్వారా రైతు ఆత్మహత్యలను నివారించటమే కాక ప్రజలకు విషరహితమైన ఆహారం అందించడం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమని పాలేకర్ అభిప్రాయపడ్డారు. వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జీరోబడ్జెట్ పద్ధతిలో ఆహార, వాణిజ్య పంటలను సాగు చేస్తున్న ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడలేదని ఆయన తెలిపారు.