లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలో అయిదు దశాబ్దాల పైబడి అవిచ్ఛి న్నంగా కొనసాగుతున్న నెత్తుటి పర్వానికి తెర పడనున్నదని కొండంత ఆశతో ఎదురుచూస్తున్న శాంతికాముకులకు నిరాశ కలిగించే పరిణామమిది. దేశంలో అంతర్యుద్ధాన్ని సాగిస్తున్న వామపక్ష కొలంబియా విప్లవ సాయుధ సైన్యం(ఎఫ్‌ఏఆర్‌సీ-ఫార్క్)తో ప్రభుత్వం నాలుగేళ్లనుంచి సాగిస్తున్న ఎడతెగని సంప్రదింపులు ఫలించి కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఈ నెల 2న జరిగిన రెఫరెండంలో ఆ దేశ ప్రజలు తిరస్కరించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ సమక్షంలో గత నెల 26న సంతకాలైన ఆ ఒప్పందం తమకు సమ్మతం కాదని పౌరులు తేల్చిచెప్పారు. ఇది ఏక వాక్య రెఫరెండం.
నిజానికి ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించినవారికీ, సమర్ధించినవారికీ మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. వద్దన్నవారు 50.21 శాతం ఉండగా, దాన్ని సమర్ధించినవారి శాతం 49.78. ఒప్పందాన్ని మెజారిటీ పౌరులు సమర్ధిస్తున్నారని రెఫరెండానికి ముందు జరిగిన సర్వేలన్నీ చెప్పాయి. తీరా తుది ఫలితం మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది. ఇది విజయం సాధించి ఉంటే అనిశ్చితి ఆవరించిన ఇతర లాటిన్ అమెరికా దేశాలకు మార్గదర్శకమయ్యేది. గత దశాబ్దమంతా వామపక్షాలకు పట్టంగట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన లాటిన్ అమెరికా దేశాల్లో మితవాదుల ప్రాబల్యం ఇటీవల విస్తరించడాన్ని గమనిస్తున్నవారు కొలంబియా పౌరులు సైతం ఆ బాటే పట్టారని తేల్చిచెబుతున్నారు. అయితే అది అర్ధసత్యమే.
ఎందుకంటే ఈ రెఫరెండంలో పాల్గొన్న ఓటర్లు కేవలం 37 శాతం మాత్రమే! దేశ మాజీ అధ్యక్షుడు అల్వారో యురిబే నేతృత్వంలోని మితవాద కొలంబియా ఫస్ట్ పార్టీ ఒప్పందాన్ని నిరసిస్తూ చురుగ్గా ప్రచారం చేసింది. ఆ మాటకొస్తే దేశాధ్యక్షుడు జువాన్ శాంటోజ్ సొంత పార్టీ నేషనల్ యూనిటీలోనే ఒప్పందంపై అసమ్మతి ఉంది. కొలంబియా నెత్తుటి చరిత్ర తెలిసినవారెవరైనా శాంతి ఒప్పందం అవసరాన్ని గుర్తిస్తారు. దాన్ని మనస్ఫూర్తిగా సమర్ధిస్తారు. కొలంబియాలో 52 ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధానికి ఇంతవరకూ రెండున్నర లక్షలమంది బలయ్యారు. దాదాపు 60 లక్షలమంది కొంపా గోడూ వదిలి పరారుకావలసి వచ్చింది. స్వస్థలంలో ఇంత పెద్దయెత్తున ప్రజానీకం నిర్వాసితులు కావడం మరే దేశంలోనూ చూడలేం.
మిగిలిన లాటిన్ అమెరికా దేశాల తరహాలోనే కొలంబియాలో పేదరికం, నిరుద్యోగం, అవిద్య, అసమానతలు ఎక్కువ. ఇలాంటి రుగ్మతలే అనేక దేశాల్లో వామపక్ష అనుకూల పార్టీలను గతంలో గద్దెనెక్కించాయి. కొలంబియాలో ఫార్క్ గెరిల్లా పక్షానికి ఊపిరిపోశాయి. అక్కడ కేవలం ఒక శాతంగా ఉన్న సంపన్నుల చేతిలో దాదాపు 60 శాతం సాగు భూములున్నట్టు సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. జానెడు భూమి లేని పేదలున్న దేశంలో బహుళజాతి సంస్థలు అడ్డా వేసి లక్షల హెక్టార్ల భూమిని సొంతం చేసుకున్నాయి.
కొద్దో గొప్పో భూమి ఉన్న బక్క రైతులను కూడా అవి బతకనివ్వలేదు. మాఫియా ముఠాలు, ప్రైవేటు సైన్యాలు బెదిరించి వారినుంచి భూముల్ని స్వాధీనం చేసుకునేవారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ఫార్క్ ఆవిర్భవించింది. దేశం తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఆ సంస్థ ప్రాబల్యం అధికం. వారి నేతృత్వంలోని ప్రభుత్వం అక్కడి పల్లె సీమలకు సమకూర్చిన మౌలిక సదుపాయాలు తక్కువేమీ కాదు. విద్య, వైద్యం, విద్యుత్, పారిశుద్ధ్యం, నీటిపారుదల సౌకర్యం వంటివి కల్పించింది.
వాస్తవానికి 1984లో ఫార్క్ అస్త్ర సన్యాసం చేసి ఎన్నికల్లో పాల్గొంది. మరో రెండేళ్లకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ అప్పటి క్యుర్తాస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ తీర్పును వమ్ము చేసి వారికి అధికారం అప్పగించకుండా హింసాకాండ సృష్టించింది. పర్యవసానంగా ఫార్క్ మళ్లీ అడవి బాట పట్టింది. అధికారం చేజిక్కలేదన్న మాటేగానీ ఫార్క్ ప్రాబల్యం పెరిగింది. దాన్ని కట్టడి చేయడం కోసం 2002లో అమెరికా ప్రత్యక్ష పర్యవేక్షణలో తిరుగుబాటుపై పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది.
ఇన్ని దశాబ్దాల అంతర్యుద్ధం పర్యవసానంగా సాధారణ పౌరులు చెప్పనలవికాని ఇబ్బందులు పడ్డారు. తిరుగుబాటుదార్లు, సైన్యం సాగించిన పరస్పర హనన కాండలో సామాన్యులు సమిధలయ్యారు. ఎవర్ని నమ్మాలో, నమ్మొద్దో...ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారో తెలియని అయోమయ పరిస్థితులు రాజ్యమేలాయి. చట్టం, న్యాయం వగైరాలకు అక్కడ తావులేదు. సైన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించి ఫార్క్...తిరుగుబాటుదార్లకు వత్తాసు పలుకుతున్నారని సైన్యమూ సాధారణ పౌరుల్ని ఇబ్బందులపాలు చేశాయి. ఇప్పుడు శాంతి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ అధ్యక్షుడు యురిబె హయాంలో తిరుగుబాటుదార్లు చాలా బలహీనపడ్డారు.
ఒకరకంగా అందువల్లే 2012లో ప్రభుత్వంతో చర్చలకు ఫార్క్ అంగీకరించింది. శాంటోజ్ సర్కారు చర్చల ప్రక్రియను ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న యురిబె అవి కాస్తా ఫలవంతం కావడంతో కంగారుపడ్డారు. అంతర్యుద్ధ కాలంలో ఇరువైపులా సాగిన హత్యాకాండపై దర్యాప్తు ప్రారంభమైన పక్షంలో అది తన మెడకు చుట్టుకోవచ్చునన్న భయం ఆయనను వెన్నాడింది. అందువల్లే తిరుగుబాటుదార్లను మట్టుబెట్టడం లేదా పట్టి బంధించడం తప్ప వేరే మార్గం లేదని ఆయన ప్రచారం చేశారు.
శాంటోజ్ ప్రభుత్వం శాంతి చర్చల విషయంలో పాటించిన గోప్యత కూడా తుది ఫలితాన్ని ప్రభావితం చేసిందని చెప్పాలి. అదేదో తమ సొంత వ్యవహారంలా ఇరుపక్షాలూ దేన్నీ బయటకు పొక్కనివ్వలేదు. దేనిపైనా చర్చ సాగలేదు. ఆన్‌లైన్‌లో ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినా అదంతా మొక్కుబడి వ్యవహారంగా సాగింది. తిరుగుబాటుదార్లు కోరుతున్నదేమిటో, ప్రభుత్వ ప్రతిపాదనలేమిటో ఎవరికీ తెలియదు. అందువల్లే రెఫరెండానికి అత్యధికులు దూరంగా ఉండి పోయారు. ఈ ఫలితం ఒప్పందంలో ఎలాంటి సవరణలకు కారణమవుతుందో, అది ఏ పర్యవసానాలకు దారితీస్తుందో చూడాల్సిఉంది. ప్రజల ప్రమేయంలేని ఏ కార్యక్రమమైనా, అది ఎంత గొప్పదైనా విఫలమవుతుందని చెప్పడానికి కొలంబియా శాంతి ఒప్పందమే తార్కాణం.
కొలంబియా షాక్!
Published Thu, Oct 6 2016 6:16 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement