
ఆ నేతలకు ఇది నిషిద్ధాక్షరి
ప్రజాక్షేత్రంలో పోటీకి నిలబడి గెలిచి, రాజకీయాల్లో కొనసాగేవారే ఎక్కువ. కొందరు ఆ నమ్మకం లేక దొడ్డిదారిన కూడా ప్రవేశిస్తుంటారు. ఇప్పుడు నారా లోకేశ్ కూడా అదే దారిలో రాజకీయ ప్రవేశం చెయ్యబోతున్నారు.
డేట్‌లైన్ హైదరాబాద్
చాలా రాష్ట్రాల్లో అధినేతల పిల్లలు రాజకీయాల్లోకి వచ్చి తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించడం మామూలే. అయితే ప్రజాక్షేత్రంలో పోటీకి నిలబడి గెలిచి, రాజకీయాల్లో కొనసాగేవారే ఎక్కువ. కొందరు ఆ నమ్మకం లేక దొడ్డిదారిన కూడా ప్రవేశిస్తుంటారు. ఇప్పుడు నారా లోకేశ్ కూడా అదే దారిలో రాజకీయ ప్రవేశం చెయ్యబోతున్నారు. యువ కులు రాజకీయాల్లోకి రావాలి. లోకేశ్ కూడా యువకుడే. తొలి అడుగే దొడ్డి దారిన పడటం ఏ మాత్రం శోభ తెచ్చిపెడుతుందో ఆయనే ఆలోచించుకోవాలి.
‘రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడేది ఎవరు?’ అంటారు మహేశ్ విజాపృకర్. మహారాష్ట్రలో ఇటీవల స్థానిక సంస్థలు, కార్పొరేషన్‌లకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత భారతీయ జనతాపార్టీ, శివసేన మధ్య సాగుతున్న రగడ గురించి విశ్లేషిస్తూ మహేశ్ ఈమాట అన్నారు. ‘నగర పాలక సంస్థలో అసలు ప్రతిపక్షమే లేకుండా చెయ్యడం కోసం బీజేపీ, శివ సేన చేతులు కలుపుతాయి. అట్లా కాకుండా బీజేపీ మేయర్ పదవి కోరుకో కుండా ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతిపక్షంలో కూర్చోవడానికే సిద్ధ మైతే ప్రతిపక్షం బలంగా ఉండి పారదర్శకత కోసం ప్రయత్నించే వీలవు తుంది. కానీ ప్రతిపక్షం అనేదే లేకుండా చెయ్యాలన్న ఆలోచన ఉన్న వాళ్లు రాజకీయాల్లో గౌరవం గురించి ఎందుకు ఆలోచిస్తారు?’ అంటారు మహేశ్. సీనియర్ పాత్రికేయుడు మహేశ్ విజాపృకర్ తెలుగువాడు కాకపోయినా ఆయన జర్నలిజం తొలిరోజులు ఆంధ్రప్రదేశ్‌లోనే గడిచాయి. ఎమర్జెన్సీ రోజుల్లో హైదరాబాద్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో, వరంగల్‌లో హిందూ దిన పత్రిక విలేకరిగా పని చేసి అంతిమంగా ముంబైలో హిందూ విలేకరిగా సుదీర్ఘ కాలం పనిచేసి ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నారు. అయినా మహేశ్ కొన్ని దశాబ్దాలుగా భారత దేశ రాజకీయాలను రిపోర్ట్ చెయ్యడంతో బాటు విశ్లేషిస్తూనే ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన నాటి రాజకీయాలు కావు ఇప్పుడు నడుస్తున్నవి. వెనుకటి రాజకీయాలు కూడా చూసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో గౌరవం గురించి ఎవరు పాకులాడుతారు అని ప్రశ్నించారాయన.
నేతలు మార్చేసిన రాజకీయ చిత్రం
ఇప్పుడు రాజకీయాల్లో ‘గౌరవం’ అనే అంశం గురించి ఎవరికి పట్టింది? 1970 దశకంలోనే ఈ దేశ రాజకీయాల రూపు, రంగు, రుచి మారడం ప్రారం భమైంది. ఆ సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన నాయకులలో చాలామంది అంతకుముందు ఉన్న విలువలు, ఆదర్శాలు, నీతి వంటి వాటిని వెనకే వదిలేసి కొత్త సిద్ధాంతాలతో ముందుకు సాగారు. రాజకీయాలు మారిపో యాయి. నాయకులూ తదనుగుణంగా మారిపోయారు. నిజం చెప్పాలంటే రాజకీయాలు కాదు మారింది, పదవీ కాంక్ష అవధులు దాటి, మంచీచెడు విచక్షణ మరిచి నాయకులే వాటిని మార్చేశారు. ప్రజాస్వామ్యం అనే మాటకు అర్ధం లేకుండా పోయింది. తమను వ్యతిరేకించేవాడు కనిపించకూడదు. వారే శాశ్వతంగా అధికారంలో ఉండాలి. తాము కాకపోతే తమ సంతానం అధి కారం చేపట్టాలి. సృష్టి ఉన్నంత కాలం తమ ఏలుబడిలోనే ప్రజలు జీవిం చాలి. అట్లా ఉండటం కోసం ఎన్ని అక్రమాలకయినా పాల్పడటానికి సిద్ధం. బోలెడంత డబ్బు, సంపద ఎన్ని తప్పుడు పనులు చేసి అయినా సంపా దించాలి. అసత్యాలు చెప్పాలి, ప్రజలకు ఇచ్చిన మాట ఎప్పటికప్పుడు తప్పాలి. ఏమన్నా అంటే మేమెప్పుడు ఇచ్చాం హామీ? అని బుకాయించాలి. ఇదీ నేటి రాజకీయం. అధికారంలో ఉన్న వాళ్లకు ఇటువంటి లక్షణాలు ఉంటే, ఇంక రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడే తీరిక ఎక్కడ ఉంటుంది? ఆ సమయంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి, ఆ మాట అనడం కంటే ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించిన నాయకుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఇంకా చాలామంది లాగే ఆయన కూడా పైన పేర్కొన్న నాయకత్వ లక్షణాలన్నిటికి ప్రతినిధిగా నిలుస్తారనడానికి ఆ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే సాక్ష్యం.
భారతీయ జనతాపార్టీ, శివసేన రాజకీయాల్లో సహజ మిత్రులు, వాళ్ల ఆలోచన, భావజాలం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఆ రెండూ రాజ కీయాల్లో చిరకాలం మిత్రత్వం నెరిపిన పార్టీలే. కాలక్రమేణ విభేదాలు ఏర్ప డ్డాయి. ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో వారు కలసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసినా పెద్దగా చర్చించుకోడానికి ఏమీలేదు. పాలకవర్గం మాత్రమే మిగిలి, ప్రతిపక్షం లేకుండా పోతే ప్రశ్నించే వాళ్లు ఉండరు, పార దర్శకత మృగ్యమవుతుందని మహేశ్ విజాపృకర్ లాంటి పెద్దలు బాధపడు తున్నారు తప్ప, ఆ రెండు పార్టీల కలయికను వారు కొత్తగా ఏమీ చూడటం లేదు. చంద్రబాబునాయుడు కూడా శివసేన వలెనే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ లో భాగస్వామి. కానీ ఆయన రాజకీయాల్లో ఎవరికీ సహజ మిత్రుడు కారు, నమ్మదగ్గ మిత్రుడు అసలే కాదని బీజేపీ పెద్దలే చెపుతుంటారు. ఈ సంగతి అందరికంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే బాగా తెలుసు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు తన విషయంలో తీసుకున్న వైఖరి మోదీ మరిచిపోయి ఉండరు. అధికారంలో లేనప్పుడు ద్వేషించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే స్నేహం చేసే కోవకు చెందిన రాజకీయ నాయకుడు చంద్రబాబు.
వారసత్వ రాజకీయాల కొనసాగింపు
ఇక ప్రస్తుతానికి వస్తే మొన్న సోమవారం నాడు వెలగపూడిలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల సభ్యులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి జరగనున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక మీద కూడా చర్చించి శాసనసభ నుంచి ముఖ్యమంత్రి కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మండలికి ఎన్నిక చేయించుకోవడం మొదలుకుని ఇతర అభ్యర్ధుల ఎంపిక వరకూ అధి కారాన్ని పొలిట్ బ్యూరో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుకు అప్పగించింది. శాసనసభ సమావేశాల ముహూర్తాన్ని నిర్ణయించడంతో బాటు పక్క రాష్ట్రం తెలంగాణ రాజకీయ పరిస్థితులను కూడా ఈ సమావేశంలో చర్చించారు. రాజకీయాల్లో, అందునా ప్రాంతీయ రాజకీయాల్లో కొడుకులూ కూతుళ్లు తమ తండ్రుల బాట పట్టడం కొత్తేమీ కాదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిల్లలు ఇద్దరూ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. కూతురు పార్లమెంట్ సభ్యురాలు, కాగా కొడుకు ఆయన క్యాబినెట్‌లోనే మంత్రి. దానికీ విమర్శలు వస్తు న్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన సుదీర్ఘ తుది విడత పోరాటంలో ఆ ఇద్దరు పిల్లలూ చురుకయిన పాత్ర పోషించారు. ప్రజా మోదం పొంది గెలిచి వచ్చారు. కాబట్టి చంద్రశేఖరరావు ఆ విమర్శలను తట్టుకోగలుగుతున్నారు. ఇట్లా చాలా రాష్ట్రాల్లో అధినేతల పిల్లలు రాజకీయా ల్లోకి వచ్చి తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించడం భారతదేశ ప్రాంతీయ రాజకీయాల్లో మామూలే. అయితే చాలా వరకు ప్రజాక్షేత్రంలో పోటీకి నిలబడి గెలిచి, రాజకీయాల్లో కొనసాగేవారే ఎక్కువ. కొందరు ఆ నమ్మకం లేక దొడ్డిదారిన కూడా ప్రవేశిస్తుంటారు. ఇప్పుడు నారా లోకేశ్ కూడా అదే దారిలో రాజకీయ ప్రవేశం చెయ్యబోతున్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో కొత్త ఒరవడికి దోహదపడాలి. లోకేశ్ కూడా యువకుడే. రాజకీయాల్లో కొనసాగడానికి సుదీర్ఘ జీవితం ముందు ఉన్నది. తొలి అడుగే దొడ్డి దారిన పడటం ఆయనకు ఏ మాత్రం శోభ తెచ్చి పెడుతుందో ఆయనే ఆలోచించుకోవాలి. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, కానీ ఎట్లా వచ్చాం, ఎంత కాలం ఉన్నాం, ఎటువంటి పేరు తెచ్చుకున్నాం అన్నది ముఖ్యం. సరే అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి మాట్లాడాల్సింది పెద్దగా ఏమీలేదు. కానీ రాజకీయాల్లో తనను వ్యతిరేకించే వాళ్లే ఉండకూడదు, ప్రతిపక్షం లేకుండా చేసేయాలన్న ఆలోచన గల చంద్ర బాబునాయుడు సొంత కొడుకునే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించి గెలి పించుకోలేక దొడ్డి దారిన అధికారంలో భాగస్వామిని చేయబూనుకోవడం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు రాజకీయాల్లో గౌరవం గురించి ఆలోచించ కపోవడం కిందికే వస్తుంది.
గౌరవం కోసం తపన పడేవాళ్లయితే...
నిజమే రాజకీయాల్లో గౌరవం గురించి పాకులాడేవాళ్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల శాసన సభాపతుల ధోరణి ఇట్లా ఎందుకు ఉంటుంది? రెండు రాష్ట్రాల్లోనూ పదవులకు రాజీనామా చెయ్యకుండా పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఏళ్లూపూళ్లూ గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడం, అనర్హత వేటు వెయ్యకపోవడం రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడేవాళ్లు ఆ పదవిలో లేనందువల్లనే జరుగుతుందని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిలోని తాత్కాలిక శాసన సభా భవన సముదాయంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి జరగనున్న తొలి సమా వేశాల్లోకి దొంగసొత్తుతో జనస్వామ్య దేవాలయం అయిన అసెంబ్లీలోకి ప్రవేశిస్తారా అని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌కు రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించడాన్ని ఎట్లా తప్పుపడతారు? తాను ఎంపీగా, తన తల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయిన పార్టీ నుంచి వైదొలగాలనుకున్న ప్పుడు, కొత్త పార్టీ పెట్టాలనుకున్నప్పుడు పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలిచి వచ్చిన చరిత్ర, తన పార్టీలోకి రావాలనుకున్న వారి చేత రాజీనామాలు చేయించి తిరిగి పోటీ చేయించిన చరిత్ర ఆయనది.
కాబట్టి ఇవాళ స్పీకర్‌ను ఆ డిమాండ్ చేసే పూర్తి అర్హత ఆయనకే ఉంది. మిగిలిన వారు కూడా రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడకపోయినా కొంచెం ప్రయత్నం అయినా చేస్తే బాగుండేది.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com