
ఆ ప్రభుభక్తితో ప్రమాదమే!
‘నారా లోకేశ్‌బాబుకు తెలంగాణ అధికారులను కూడా శాసించే స్థాయి పదవి ఏదన్నా ఇవ్వండి, అప్పుడు రాష్ట్రంలో మేం పార్టీని బలోపేతం చేస్తాం’ అని తెలుగుదేశం శాసనసభా పక్షానికి కొత్త నాయకుడిగా నియమితుడయిన ఆనందంలో రేవంత్‌రెడ్డి పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని వేడుకున్నారు.
‘నారా లోకేశ్‌బాబుకు తెలంగాణ అధికారులను కూడా శాసించే స్థాయి పదవి ఏదన్నా ఇవ్వండి, అప్పుడు రాష్ట్రంలో మేం పార్టీని బలోపేతం చేస్తాం’ అని తెలుగుదేశం శాసనసభా పక్షానికి కొత్త నాయకుడిగా నియమితుడయిన ఆనందంలో రేవంత్‌రెడ్డి పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని వేడుకున్నారు. ఎవరీ లోకేశ్‌బాబు అంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధినేత కుమారుడు. ఆంధ్రప్రదేశ్‌లో అనధికారికంగానే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నవాడు. అక్కడ తెలుగుదేశం అధికారంలో ఉంది. ప్రాంతీయ పార్టీ కాబట్టి అధినాయకుడికి తిరుగుండదు.
చంద్రబాబు ఈసారి అధికారంలోకి వచ్చాక ఆయన కుమారుడు కూడా రంగప్రవేశం చేశాడు. వారం క్రితమే లోకేశ్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘మేమే నంబర్ వన్’ అని ప్రచారం చేసుకుని, చివరికి ఒకే ఒక్క డివిజన్ గెలుపుతో సరిపెట్టుకుని హుటాహుటిన విజయవాడ బాట పట్టారు. నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికే వెళ్లి మంత్రులతో సమీక్షలు జరిపారు. ఆయన సీనియర్ మంత్రులతో ప్రభుత్వ కార్యకలాపాల మీద సమీక్ష జరుపుతున్నంత సేపూ ముఖ్యమంత్రి అదే భవన సముదాయంలో మరో గదిలో ఉన్నారు. చంద్రబాబునాయుడు నెమ్మదిగా తన బాధ్యతలను కుమారుడికి అప్పగించే ఆలోచనతో ఉన్నారన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది. లోకేశ్‌బాబుకు మాత్రం ఆ నెమ్మది నచ్చినట్టులేదు. ఆయన వేగం పెంచేశారు. రాజకీయాలు, అధికారిక కార్యకలాపాలతో సహా ఆర్థిక లావాదేవీలను కూడా ఆయనే చక్కబెడుతున్నారన్న ప్రచారం బలంగా వినిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులూ, సీనియర్ మంత్రులూ కొందరు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నా మరో మార్గం లేదు కాబట్టి మెదలకుండా ఊరుకుంటున్నారు.
ఇదేమీ కొత్త పరిణామం కాదు
కొడుకులనూ, కూతుళ్లనూ; కొండొకచో భార్యనూ రాజకీయ వారసులను చేయాలని నాయకులు కోరుకోవడం దేశ రాజకీయాలలో కొత్తేమీ కాదు, వింత అంత కన్నాకాదు. నెహ్రూ కుటుంబం నుంచి మొదలు, కింది స్థాయి దాకా బోలెడు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. దేశ రాజకీయాలలో ఇప్పుడు నెహ్రూ కుటుంబంలో నాలుగో తరం నడుస్తున్నది. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో అధికారంలోకి వస్తే కొడుకు స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి ఆలోచిస్తుంటే, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసి, పార్లమెంట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. బిహార్‌లో లాలూప్రసాద్ ఎన్నడో తన భార్యను వారసురాలిని చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తాను వెనక నుంచి చక్రం తిప్పారు. ఇట్లా బడా కాంగ్రెస్ నుంచి, చోటా ప్రాంతీయ పార్టీల దాకా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తెలంగాణ లో టీఆర్‌ఎస్ అధినేత, రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా తన కుమారుడు, రాష్ర్ట మంత్రి కేటీ రామరావును ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం కూడా బలంగా ఉన్నది. మొన్న జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మొత్తం ప్రచార బాధ్యత ఆయనకు అప్పగించి కేసీఆర్ అందుకు వేదిక సిద్ధం చేసేశారని కూడా ప్రచారం జరుగుతున్నది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాజకీయాలలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో బలమయిన రాజకీయశక్తినని నిరూపించుకున్నారు. కాంగ్రెస్‌ను కాదని, సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికలలో పోరాడి ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. కేటీ రామారావు, జగన్‌మోహన్‌రెడ్డిల రాజకీయ ప్రవేశాలని లోకేశ్ రాజకీయ ప్రవేశంతో పోల్చడానికి వీలులేదు. డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత, ఆయనకున్న ప్రజాదరణ కారణంగా వెంటనే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని దాదాపు మంత్రివర్గమంతా సంతకాలు చేసి ఒత్తిడి తెచ్చినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. నిజానికి అధిష్టానం మీద తిరగబడి జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచే మూడ్‌లో వారంతా ఉన్నా, జగన్‌మోహన్‌రెడ్డి ఆ పనిచేయలేదు. ఆ పని ఆయన చేసి ఉంటేఅప్పటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆనాడే ఖాళీ అయ్యి ఉండేది. కానీ ఆయన ఆ పని చేయకుండా కాంగ్రెస్ పదవిని వదిలేసి, సొంత పార్టీ పెట్టి స్వశక్తి మీద ప్రజాబలంతో నెగ్గి ప్రతిపక్ష నాయకుడయ్యారు. తెలంగాణ రాష్ర్టం కోసం జరిగిన తుది విడత సుదీర్ఘ పోరాటంలో భాగస్వామి అయ్యారు కాబట్టే కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకయినా రాజకీయాలలో ప్రజామోదం పొందగలిగారు. ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేశ్ పైలట్, మాధవరావు సింధియాల కుమారులు కూడా తండ్రుల రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని కేంద్ర రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. తండ్రుల ప్రతిష్ట, ప్రజాదరణ కొంత పనిచేసినా వారూ స్వశక్తి మీద రాజకీయాలలో రాణించిన వాళ్లే.
కొంప ముంచుతున్న ప్రభుభక్తి
ఇన్ని ఉదాహరణలు ఉండగా లోకేశ్ రాజకీయాలలోకి రావడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టరు. టీడీపీలో చంద్రబాబునాయుడు ఎంతంటే అంత కాబట్టి ఆయన కుమారుడిని వారసునిగా నిర్ణయిస్తే అది ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఇష్టం. తెలంగాణలో సమస్య అంతా రేవంత్‌రెడ్డి వంటి వారి ప్రభుభక్తి వల్ల వస్తుంది. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఏర్పడిన రాష్ర్టంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇక్కడి అధికారులను శాసించే అధికారాలు లోకేశ్‌కు ఇప్పించండి దేవరా అని చంద్రబాబును ప్రాధేయపడుతున్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో లోకేశ్ అధికారాలు ఎలా సాగుతాయి? అసలు రేవంత్‌రెడ్డి ఏం కోరుకుంటున్నారు? అంటే లోకేశ్‌ను రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రిపదవి కూడా ఇప్పించి తెలంగాణ అధికారులను శాసించే అధికారాలు హక్కు భుక్తం చేయండి అని. లోకేశ్‌ను రాజ్యసభకు పంపడం చంద్రబాబు చేతిలో పని. మరి మిగతా రెండు? కేంద్ర మంత్రిపదవి కూడా ఎన్డీఏ భాగస్వామిగా, వెంకయ్యనాయుడు లాంటి నాయకుల సహకారంతో, ఇప్పుడున్న ఇద్దరిలో ఒకరికి ఉద్వాసన పలికి లోకేశ్‌కు ఇప్పించుకోవచ్చు. అప్పుడయినా ఆయన తెలంగాణ అధికారులను ఎలా శాసిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం రేవంత్‌రెడ్డి మాత్రమే చెప్పగలరు. ఈ ప్రపంచంలో మరెవరికీ అర్థం కాని ప్రశ్న ఇది. రాష్ర్టంలో, కేంద్రంలో కూడా ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర మంత్రుల హవా రాష్ట్రాలలో అంతంత మాత్రమేనని మనకు తెలుసు. లోక్‌సభకు ప్రజల చేత ఎన్నికయి కేంద్ర మంత్రులయిన వారి అధికారాలు కూడా పరిమితమే. ఇంకా చెప్పాలంటే, కేంద్రంలో ఒక పార్టీ, రాష్ర్టంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రమంత్రుల హవా ఇంకా పరిమితం. అట్లాంటిది తెలంగాణ లో జెండా పీకేసిన తెలుగుదేశం పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి లోకే శ్‌ను ఎన్‌డీఏలో మంత్రిని చెయ్యండి అని రేవంత్‌రెడ్డి అడుగుతున్నారు. దీన్ని రాజకీయ పరిణతి అందామా? ఇటువంటి రాజకీయ పరిణతి కారణంగా చేసిన ఓటుకు కోట్లు నిర్వాకం తెలంగాణ లో టీడీపీ పతనానికి నాంది అనీ, ఆ నిర్వాకం ఇదే రాజకీయ ధురంధరుడు రేవంత్‌రెడ్డిదేననీ మనందరికీ తెలుసు. ప్రస్తుతానికయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం ఖాళీ అయింది. గెలిచిన పదిహేనుమందిలో పదిమంది అధికార పార్టీలోకి వలసపోయారు, ఇంకో ఇద్దరు సిద్ధంగా ఉన్నారట, రేపో మాపో గోడ దూకడానికి.
అసాధ్యాలు సుసాధ్యాలవుతాయా?
లోకేశ్‌బాబు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ ైవైభవం పొందడం రెండూ వేర్వేరు అంశాలన్న విషయం రేవంత్‌రెడ్డి వంటి ప్రభుభక్తి పరాయణులు గుర్తిస్తే మంచిది. లోకేశ్ రాజకీయాలలో రాణిస్తాడా లేదా అన్నది ఆయన మీదే ఆధారపడి ఉంటుంది. సహజంగా ఆ లక్షణాలు లేకుండా బలవంతంగా ఎవరూ నాయకులు కాలేరు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి లోకేశ్ వంటి యువకుడి అవసరం ఉండి ఉండవచ్చు. అయితే రాజకీయాలలో ఆయన ఏ మాత్రం రాణిస్తారో ముందు ముందు తెలుస్తుంది. తెలంగాణలో టీడీపీ బలోపేతం కావడం మాత్రం నిజాయితీ గల నాయకత్వంతో, సమస్యల మీద పోరాటం చేసి మళ్లీ ప్రజాదరణ పొందితే తప్ప తేరగా వచ్చిన డబ్బు గుప్పించి ఎమ్మెల్యేలను కొనుగోలు చే స్తేనో, లోకేశ్‌ను దొడ్డిదారిన కేంద్రమంత్రిని చేస్తేనో సాధ్యం కాదు.
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com