డేట్‌లైన్ హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు వైపులా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రదర్శించని సఖ్యత, వ్యాపారాలు పెంచుకోవడంలో ప్రదర్శిస్తేనే అభ్యంతరం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింప చేసుకోవడానికి అజ్ఞాత స్నేహాలు చేస్తేనే అభ్యంతరం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. తన రాజకీయ అవసరాల కోసం రేవంత్‌రెడ్డి కొన్ని వ్యవహారాలు మాత్రం బయట పెట్టి ఉండవచ్చు. బయటికి రానివి ఇంకెన్నో!
యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి. తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా, రామకృష్ణుడినే నంబర్ టూగా పరిగణించాలి. నిజానికి యనమల రామకృష్ణుడు లేకపోతే రాజకీయాల్లో చంద్రబాబునాయుడు లేరు. 1995లో ఎన్టీ రామారావును అన్యాయంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు శాసనసభ స్పీకర్‌గా ఉన్న యనమల కొంచెం భిన్నంగా వ్యవహరించి ఉంటే చంద్రబాబునాయుడి రాజకీయ చరిత్ర అక్కడితో ముగిసి ఉండేది. శాసనసభలో అంతకు ముందురోజు వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న రామారావును తామందరికీ రాజకీయ భిక్ష పెట్టారన్న విషయాన్ని కూడా మరచి కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతించకుండా యనమల ఆరోజు చంద్రబాబు అనుకూల వైఖరి తీసుకుని ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పరిటాల సునీత, అదే తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవి భార్య. ప్రస్తుత మంత్రివర్గ సభ్యురాలు. పయ్యావుల కేశవ్ మాజీ శాసనసభ్యుడు. ప్రస్తుత శాసన మండలి సభ్యుడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో ‘బ్యాక్ రూమ్ మేనేజ్‌మెంట్’ అద్భుతంగా చేసినందుకు చంద్రబాబు చేత ప్రత్యేక సత్కారం అందుకున్న ముఖ్యుడు. రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని, సమీప భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందనే ఆశ కూడా లేని తెలంగాణ రాష్ట్ర విభాగం కార్యాధ్యక్షుడు, శాసనసభ్యుడు. పార్టీ అధినేత, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నిన ఒక తప్పుడు వ్యూహంలో పావుగా మారి, జైలుకు వెళ్లి, తీరని నిందను మోస్తున్నవాడు. ఈ నలుగురి ప్రస్తావనే ఇప్పుడెందుకంటే, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.
ఆనాడేమైందీ ప్రశ్నించే గుణం?
రేవంత్‌రెడ్డి పార్టీ మారబోతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలోని పలువురు ముఖ్య నేతలను, కార్యకర్తలను తీసుకుని కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్త. అందుకోసం ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరితే తన వర్గం వారికి పది పదకొండు లోక్‌సభ స్థానాలు, ఓ 25 శాసనసభ స్థానాలు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీనితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను పిలిచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో వివరణ కోరారు. తెలుగుదేశంలో ఉంటూ నువ్వు రాహుల్ గాంధీని ఎట్లా కలుస్తావు? అందుకు చంద్రబాబునాయుడి అనుమతి తీసుకున్నావా? అని ప్రశ్నిస్తే, మీకెవ్వరికీ నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి వచ్చాక ఆయనకే చెప్తాను అన్నీ అన్నారు రేవంత్‌రెడ్డి. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్‌మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అది నెగ్గకుండా చూడటానికి తెలుగుదేశం పక్షం సభ నుంచి గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్‌తో ఎందుకు కుమ్మక్కు అవుతున్నారని చంద్రబాబును ఈ నాయకులు ప్రశ్నించలేదు.
ఇంతెందుకు, 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను కట్టి కాంగ్రెస్ సహాయంతో కేంద్రంలో పార్టీని చేర్చినప్పుడు మనది కాంగ్రెస్ వ్యతిరేక పునాది మీద పుట్టిన పార్టీ అని మోత్కుపల్లి నర్సింహులు ఎందుకు గుర్తు చెయ్యలేదో మరి! మొన్నటికి మొన్న, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో, నిన్న సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశామని తెలంగాణ టీడీపీ నాయకులు తమను తాము ప్రశ్నించుకుంటే బాగుండేది. అప్పుడు మాట్లాడని నాయకులు రేవంత్ నుంచి వచ్చిన సమాధానంతో సమావేశం నుంచి వాకౌట్ చేస్తే, రేవంత్ మాత్రం దర్జాగా ట్రస్ట్ భవన్‌లోనే కూర్చున్నారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ గాని, ఇంకెవరైనా గాని ఇక్కడ పార్టీ వ్యవహారాల మీద ఏమాత్రం పట్టు లేనివాళ్లని తేలిపోయింది. క్రమశిక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి ఇది. ఆయన కుమారుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌బాబు మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం వేసి కూడా ఎవరినీ కట్టడి చెయ్యలేని స్థితిలో తిరిగి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.
వీరిది పోరాటం, వారిది వ్యాపారం
తాను సభ్యుడిగా ఉన్న రాష్ట్ర పార్టీలో నాయకత్వానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని తలెగరేసిన రేవంత్ పక్క రాష్ట్రంలోని మంత్రుల మీద, నాయకుల మీద కూడా విరుచుకు పడ్డారు. పార్టీ కోసం నేను జైలుకు వెళితే, తెలంగాణ లో ప్రభుత్వంతో కొట్లాడుతుంటే ఆంధ్ర మంత్రులు, నాయకులు తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యంగా వ్యవహరించి వ్యాపారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పయ్యావుల కేశవ్ ఒక్కడే బయటపడి వివరణ ఇచ్చారు తప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత నోరు మెదపలేదు. బహుశా అధినేత ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు. అయినా అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రితో మాట్లాడటం ఈ రోజుల్లో ఏమంతపని! మాట్లాడే ఉంటారు. ఆయన ఏం చెప్పారో అందరూ అర్థం చేసుకోవచ్చు కూడా.
అటు ఆంధ్ర మంత్రులూ నాయకులకయినా, ఇటు తెలంగాణ పార్టీ నేతలకయినా ఈ పరిస్థితిలో చంద్రబాబునాయుడు ఏం చెబుతారు? ఇంకొకరు ఎవరయినా అయితే పార్టీ నుంచి తక్షణం బహిష్కరించి ఉండే వాళ్లం కానీ, ఈయన రేవంత్‌రెడ్డి అయిపోయారు. కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, ఎవరూ తొందర పడకండి అనే చెప్పి ఉంటారు. నిజమే కదా! ఓటుకు కోట్లు కేసులో వ్యూహం రచించింది తానూ, అమలు చేస్తూ దొరికిపోయి జైలుకు వెళ్లింది రేవంత్ రెడ్డి కాబట్టి, ఆ కేసు ఇంకా నెత్తి మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. ఎంత స్నేహహస్తం చాచుతున్నట్టు కనిపిస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అవసరమైతే దాన్ని మళ్లీ తన మీద ప్రయోగించడానికి వెనుకాడరన్న విషయం చంద్రబాబునాయుడుకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చేదాకా ఇటూ అటూ తెలుగుదేశం వారంతా ‘వ్యూహాత్మక మౌనం’పాటించాల్సిందే, తప్పదు.
ఇక యనమల రామకృష్ణుడి సంబంధీకులకు తెలంగాణలో వేల కోట్ల రూపాయలకాంట్రాక్టులు, పరిటాల సునీత కుమారుడికీ,పయ్యావుల కేశవ్ అల్లుడికీ వ్యాపార లైసెన్సుల గురించి రేవంత్ మాట్లాడితే; రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత కలసి వ్యాపారం చెయ్యడం కోసం కంపెనీ రిజిస్టర్ చేయడం గురించి కేశవ్ ప్రస్తావించారు. ఈ విషయానికి వస్తే ఇందులో ఎవరు పులుకడిగిన ముత్యాలు అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులూ; అక్కడివారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కాంట్రాక్ట్‌లు, లైసెన్స్‌లు తెచ్చుకుంటూనే ఉన్నారు. వ్యాపారం చేయవద్దని ఎవరూ చెప్పరు. ఫలానా వర్గం వారే వ్యాపారాలు చెయ్యాలనీ ఎవరూ చెప్పరు. రాజకీయాల్లో ఉన్నవాళ్లు వ్యాపారాలకు అర్హులు కాదు అనే చట్టం ఏమీలేదు.
తమకు ఇష్టమైన వ్యాపారం చేసుకునే హక్కు జీవించే హక్కు వంటి ఇతర హక్కుల వంటిదే. రాజ్యాంగం ప్రసాదించిన హక్కే. అయితే చిక్కంతా ఎవరు ఎటువంటి వ్యాపారాలు ఏ రకంగా చేస్తున్నారు అన్న విషయం దగ్గరనే. పయ్యావుల కేశవ్ చెప్పినట్టు తెలంగాణలో మద్యం వ్యాపారం చేసుకోవడానికి నిబంధనలను అనుసరించి ఆయన మేనల్లుడో, ఇంకొకరో ఆంధ్ర ప్రాంతానికో, రాయలసీమ ప్రాంతానికో చెందినవారు లైసెన్సులు తెచ్చుకుంటే ఆక్షేపించనక్కర లేదు. తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేసుకునే హక్కును ఎవరూ కాదనలేరు. నిజానికి దేశంలో ఈ చివర నుంచి, ఆ చివర దాకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు నిర్మించే కాంట్రాక్టర్‌లు కొంతమంది తెలుగువాళ్లేనన్న విషయం మరిచిపోవద్దు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ఒక సందర్భంలో స్వయంగా తానే చెప్పారు, ఆంధ్రప్రాంతం వారితో తనకున్న వ్యాపార లావాదేవీలను గురించి. రాజకీయాలు, వ్యాపారం కలగాపులగం అయిపోయినందునే సమస్యంతా. ఉదాహరణకు రాజకీయ అవసరాలకారణంగానే అమాయకులయిన విద్యార్థులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక అన్యాయంగా ప్రాణాలు తీసుకుంటుంటే ఏ చర్యా లేకుండా పోయింది, ఇక్కడయినా, అక్కడయినా.
ముందు నుయ్యి వెనుక గొయ్యి
ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు వైపులా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రదర్శించని సఖ్యత, వ్యాపారాలు పెంచుకోవడంలో ప్రదర్శిస్తేనే అభ్యంతరం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింప చేసుకోవడానికి అజ్ఞాత స్నేహాలు చేస్తేనే అభ్యంతరం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. తన రాజకీయ అవసరాల కోసం రేవంత్‌రెడ్డి కొన్ని వ్యవహారాలు మాత్రం బయట పెట్టి ఉండవచ్చు. బయటికి రానివి ఇంకెన్నో! ఏది ఏమైనా రేవంత్‌రెడ్డి వ్యవహారం మాత్రం తెలుగుదేశం పార్టీని అక్కడా ఇక్కడా మరింత అయోమయంలో పడేసిన మాట వాస్తవం. పార్టీ నుంచి బహిష్కరిస్తే ఓటుకు కోట్లు వ్యవహారం ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో, బుజ్జగించి పార్టీలోనే ఉంచుకుందామంటే టీఆర్‌ఎస్ వ్యతిరేక వైఖరి కచ్చితంగా అవలంబించాల్సిందే అన్న రేవంత్ షరతు మింగుడు పడదాయే. ముందునుయ్యి, వెనుక గొయ్యి.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
Comments
Please login to add a commentAdd a comment