అంకెల మాయాజాలం | Digital magics in TS, AP budgets | Sakshi
Sakshi News home page

అంకెల మాయాజాలం

Published Thu, Mar 16 2017 1:43 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

అంకెల మాయాజాలం - Sakshi

అంకెల మాయాజాలం

అలవికాని హామీలిచ్చిన పాలకులకు బడ్జెట్‌లు రూపొందించడం తాడుపై నడక లాంటిది. నిరంతర సాధన వల్లా, లక్ష్యంపై ఏకాగ్రతవల్లా తాడుపై నడిచేవారు కూడా ఆ విన్యాసాన్ని సునాయాసంగా పరిపూర్తి చేయగలుగుతారేమోగానీ... అధి కారాన్నాశించి వెనకా ముందూ చూడకుండా హామీలు గుప్పించినవారికి జనాన్ని మభ్యపెట్టడం తప్ప వేరే మార్గం ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాలూ రెండు రోజుల వ్యవధిలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లను గమనిస్తే ఈ సంగతి అవగతమవు తుంది. నేల విడిచి సాము చేసిన వైనం కళ్లకు కడుతుంది.

రెండు రాష్ట్రాలుగా విడిపో యాక బడ్జెట్లు రావడం ఇది నాలుగోసారి. బడ్జెట్ల నిడివి చూస్తేనే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి. తెలంగాణ మొత్తం బడ్జెట్‌ రూ. 1,49,646 కోట్లు అయితే... ఆంధ్ర ప్రదేశ్‌ బడ్జెట్‌ రూ. 1,56,999 కోట్లు! రెండింటి మొత్తమూ రూ. 3,06,000 కోట్ల పైమాటే. విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రం మొత్తం బడ్జెట్‌ లక్షా 40 వేల కోట్లని గుర్తుంచుకుంటే ఈ స్థాయి లాంగ్‌ జంప్‌లు ఎలా సాధ్యమని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని అతిగా చూపిస్తే తప్ప ఇది సాధ్య పడదు. వేర్వేరు పద్దులకు భారీ మొత్తాల్లో ఖర్చు చేస్తామన్నప్పుడు దానికి తగినట్టు ఆదాయం కూడా భారీగా చూపక తప్పదు గనుకే ఈ పాట్లు.

కనీసం తెలంగాణ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలో వనరులున్నాయి. వివిధ పన్నుల ద్వారాగానీ, ఇతరత్రాగానీ వచ్చే ఆదాయాన్ని అంచనా వేసుకోవడంలో అటూ ఇటూగా ఉన్నా ఆక్షేపణ ఉండదు. వేర్వేరు పద్దులకింద ఫలానా మొత్తంలో ఖర్చు చేయబోతున్నామని ఘనంగా చెప్పినా బడాయి కబుర్లనిపించవు. కానీ రాష్ట్రం చాలా ఇబ్బందులెదుర్కొంటున్నదని ఏపీ పాలకులు ఒకపక్క చెబుతూనే రాబడి అంచనాలను భారీగా చూపడం... వివిధ సంక్షేమ పద్దుల కింద దీటుగా ఖర్చుపెట్టబోతున్నట్టు ఊరించడం చిత్రమనిపిస్తుంది. అటు ఆదాయమైనా, ఇటు చేసిన ఖర్చయినా ఎంతో సవరించిన అంచనాలే చెబుతాయి. వాటి ఆధారంగా ఇప్పుడు ఏకరువుపెట్టే బడ్జెట్‌ కబుర్లలోని నిజానిజాలేమిటో, నిజాయితీ ఎంతో ఎవరైనా అంచనాకు రాగలుగుతారు. రైతు రుణమాఫీ గురించి, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ గురించి గొప్పగా చెప్పే ప్రభుత్వాలు బడ్జెట్‌లకొచ్చేసరికి తగిన కేటాయిం పులు చేయడంలో విఫలమవుతున్నాయి. రెండు రాష్ట్రాలూ ఈ విషయంలో ఒకేలా ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల కోర్సులు పూర్తయినా కళా శాల యాజమాన్యాలు వారి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఉద్యోగాల్లో గల్లం తవుతున్నాయి. ఈ సమస్యపై రెండు ప్రభుత్వాలకూ శ్రద్ధలేదు. చేసిన కేటాయిం పులు బకాయిలకు కూడా సరిపోవు.

బడ్జెట్‌లో కేటాయింపులను అమితంగా చూపడం, నిధులు ఖర్చు చేయాల్సి వచ్చేసరికి మాత్రం మితంగా ఉండిపోవడం ప్రభుత్వాలకు రివాజైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుడు బీసీల సంక్షేమానికి రూ. 4,430 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 183.74 కోట్లు ఖర్చు చేయలేదు. బీసీ కులాల స్థితిగతులెలా ఉన్నాయో గమనిస్తే కేటాయించిన నిధులే ఏమూలకూ చాలవని అర్ధమవుతుంది. మరి నిధులు మిగిలి పోవడమేమిటి? వాస్తవానికి బీసీ కులాల్లో వేర్వేరు వర్గాలవారికి టీడీపీ మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కావు. ఆయా వృత్తులను ప్రోత్సహించడానికి ఎన్నెన్నో చేస్తామన్నారు. ఆ వర్గాల వారి ఆశలు తీరకుండానే, మేనిఫెస్టో హామీల్లో అధిక భాగం నెరవేరకుండానే నిధులెలా మిగిలిపోతాయి? కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ. 5,013.50 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇది గతంతో పోలిస్తే రూ. 583.34 కోట్లు ఎక్కువ. పాత అనుభవాలను చూస్తే ఇప్పుడు చేసిన కేటాయింపులను సంపూర్ణంగా వినియోగిస్తారన్న నమ్మకం కలగదు. ఇక ఎస్సీ, ఎస్టీ సంక్షేమం గురించి చెప్పనవసరమే లేదు. నిరుడు షెడ్యూల్‌ కులాలకు కేటాయించిన ఉప ప్రణాళిక నిధులు రూ. 8,724.25 కోట్లయితే అందులో రూ. 291.31 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. వాటిని కాస్తా పంచాయతీరాజ్‌ శాఖకు మళ్లించారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన నిధులదీ ఇదే కథ. అందులో దాదాపు రూ. 15 కోట్లు మిగిలిపోయాయి. ఖర్చయిన నిధులు నిజమైన లబ్ధిదారులకు చేరాయనుకోవడానికి లేదు. టీడీపీ కార్యకర్తలకూ, వారు చెప్పిన వారికీ మాత్రమే అందులో అధిక భాగం అందాయని క్షేత్రస్థాయి వాస్తవాలు చెబు తున్నాయి. షెడ్యూల్‌ కులాల సంక్షేమానికి నిరుడు చేసిన కేటాయింపుల్లో రూ. 491.77 కోట్లు ఖర్చే చేయలేదు. ఎస్టీ సంక్షేమానికి నిరుడు చేసిన కేటాయింపుల్లో కూడా రూ. 149.3 కోట్లు ఖర్చు కాలేదు. పరిస్థితి ఇదైతే ఈసారి బడ్జెట్‌లోని కేటా యింపులన్నీ ఖచ్చితంగా ఖర్చు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నెలకు రూ. 2,000 నిరుద్యోగ భృతి గురించి
ఇన్నాళ్లుగా ఒక్క మాటా మాట్లాడని సర్కారు ఈసారి యువతకు రూ. 500 కోట్లు కేటాయించామంటున్నది. కానీ దాన్ని ఏ పేరిట, ఎలా వెచ్చిస్తారన్న వివరణ లేదు.

సాగునీటి వ్యయం వరకూ... తెలంగాణ సర్కారు నిరుడు రూ. 25,000 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 14,918.19 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. ఆంధ్రప్రదేశ్‌ నిరుడు రూ. సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ఖర్చు రూ. 8,199.70 కోట్లు. ఈసారి రూ. 12,770.26 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో చెప్పింది. వాస్తవానికి అది ఏమూలకూ చాలదు. రూ. 80,000 కోట్లకుపైగా నిధులు అవసరమని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వ్యవసాయం ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదో అందరికీ తెలుసు. అయినా ఆ రంగానికి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ అమలు అంతంతమాత్రం. అమల్లోకి రాబోతున్న జీఎస్‌టీ వల్ల, వనరుల సమర్ధ వినియోగం ద్వారా ఆదాయాన్ని ఇతోధికంగా పెంచుకోగలమన్న విశ్వాసం రెండు రాష్ట్రాలకూ ఉండటం మంచిదే అయినా ఇతరత్రా రంగాలకు సంబంధించి తగిన కార్యాచరణ అవసరం. వృద్ధి రేటు కృత్రిమంగా పెంచి చూపి అంతా బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పడంవల్ల ప్రయోజనం శూన్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement