క్వెట్టా దాడి స్వయంకృతం
ఉగ్రవాదం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. తరతమ భేదాలతో దాదాపు అన్ని దేశాలూ దాంతో సతమతమవుతున్నాయి. ఏం చేసినా అదుపులోనికి రాక... ఇంకేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నామని, ఈసారి దాడులు జరిగే అవకాశం లేనేలేదని అనుకుం టున్న ప్రతిసారీ ఉగ్రవాదులు కొత్త మార్గాల్లో, కొత్త వ్యూహాలతో దాడులు చేస్తున్నారు. క్వెట్టాలో జరిగిన దాడి దాన్నే నిరూపిస్తున్నది. ఈసారి దాడి తమ పనేనని పాకిస్తాన్ తాలిబన్‌కు చెందిన ఒక అనుబంధ సంస్థ అల్–అలామి ప్రకటించుకోగా, ఉగ్రవాద సంస్థ ఐఎస్ తామే చేశామంటున్నది. వీటితోపాటు మరో మూడు సంస్థలు సైతం అది తమ ఘనతేనని చెప్పుకుంటున్నాయి. క్వెట్టాపై దాడి జరగొచ్చునన్న సమాచారం అందడంతో నగరమంతా భద్రత పెంచామని, అయితే పోలీసు శిక్షణ కేంద్రంపై దాడి చేస్తారని మాత్రం ఊహించలేదని బలూ చిస్తాన్ ముఖ్యమంత్రి సనావుల్లా జెహ్రీ అన్నారంటే ప్రభుత్వం ఎంత అయో మయంలో ఉన్నదో అర్ధమవుతుంది.
బలూచిస్తాన్‌లో ప్రత్యేక పరిస్థితులున్నాయంటూ ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల బాధ్యతలను దశాబ్దం క్రితం సైన్యమే తీసుకుంది. అక్కడి పోలీసులు దాని కను సన్నల్లోనే పనిచేస్తారు. అయితే క్వెట్టా దాడితో ఆ భద్రతలోని డొల్లతనమెంతో నిరూపణ అయింది. విసిరేసినట్టు ఓ మూలన ఉండే బలూచిస్తాన్‌కు సాధారణ పాక్ పౌరుల రాకపోకలు బాగా తక్కువ. షియా తెగకు చెందినవారు అధికంగా నివసించే ఆ రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన దాడి వెనుక తెగల వైషమ్యాలు కూడా ఉండొచ్చు. దాడి జరిగిన వెంటనే బాధ్యులం తామంటే తామని ప్రకటించిన లష్కరే జంఘ్వీ, అల్–అలామీవంటి రెండు, మూడు మిలిటెంట్ సంస్థలు షియా వ్యతిరేక ఉన్మాదంతో ఉండేవే. ఈ సంస్థలు ఐఎస్‌తో చేతులు కలుపుతున్నాయన్న సమాచారం అందడంతో నిరుడు పాక్ సైన్యం వరస దాడులు చేసి అనేకమంది మిలిటెంట్లను అదుపులో తీసుకుంది. వారిలో 15మందిని ఎన్‌కౌంటర్ పేరిట హత మార్చింది. ఆ తర్వాత తగ్గినట్టే కనబడిన మిలిటెంట్ ముఠాలు ఇప్పుడు పంజా విసిరాయి.
ఏ సంస్థ అయినా గాల్లోంచి ఊడిపడదు. జనరల్ జియా ఉల్ హక్ పాలన సమయంలో అఫ్ఘాన్‌లో సోవియెట్ ప్రాబల్యాన్ని తగ్గించడానికంటూ మిలి టెంట్ సంస్థలను ఏర్పాటు చేసి, వాటికి సైనిక శిక్షణనిప్పించి, ఆయుధాలిచ్చిన పాపం దశాబ్దాలుగా పాకిస్తాన్‌ను వెన్నాడుతోంది. ఇప్పుడు దేశంలోని మారు మూల ప్రాంతాల్లో సైతం ప్రాబల్యం సంపాదించిన అనేక మిలిటెంట్ సంస్థలు వాటినుంచి పుట్టుకొచ్చినవే. చిత్రమేమంటే సమస్యగా మారాయని గుర్తించాక వాటిని రద్దు చేసి సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి కృషి చేయాల్సిన ప్రభు త్వాలు, సైన్యం ఆ సంస్థలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుందామన్న దురా లోచన చేశాయి. భారత్‌పైకి ఉసిగొల్పాయి. అటు తర్వాత అఫ్ఘాన్‌లోనూ ఈ పాచిక పారుతుందనుకున్నాయి. తమకు మిలిటెంట్ ముఠాల సమస్య తీరడంతో పాటు భారత్, అప్ఘాన్‌లు ఇబ్బందుల్లో పడతాయని అంచనా వేశాయి.
ఉగ్రవాదులకు పాక్ సహాయసహకారాల గురించి బయటి ప్రపంచానికి తెలిసేలా వివిధ వేదికలపై భారత్ ప్రచారం చేయకపోయి ఉంటే, పాకిస్తాన్‌పై ఒత్తిడి రాకపోయి ఉంటే ఎన్నేళ్లయినా ఇది ఇలాగే కొనసాగేది. తమ దేశంలో తాలిబన్‌లు పాల్పడుతున్న దాడుల వెనక పాకిస్తాన్ హస్తం ఉన్నదని అఫ్ఘాన్ తరచు ఆరోపించడం కూడా ఫలితాలనిచ్చింది. అందువల్లే ఇటీవలికాలంలో ఉగ్రవాద ముఠాలకు దాని సాయం తగ్గింది. పైగా అఫ్ఘాన్ ప్రభుత్వంతో చర్చలు జరపా లంటూ తాలిబన్‌లపై ఒత్తిడి తీసుకురాక తప్పలేదు. తాలిబన్‌లలో కొందరు నేతలు ఈ చర్చల ప్రతిపాదనను తీవ్రంగా తప్పుబట్టి దానికి దూరంగా ఉన్నారు. అఫ్ఘాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన వర్గాలు సైతం ఏమంత సంతృప్తిగా లేవు. తిరిగి అఫ్ఘాన్‌ను చేజిక్కించుకోవాలన్న తమ లక్ష్యానికి పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని కక్ష పెంచుకున్న తాలిబన్ చీలిక వర్గాలు... ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న వివిధ మిలిటెంట్ సంస్థలను చేరదీసి దాడులు చేయిస్తున్నాయి.
క్వెట్టా దాడి కూడా ఈ నేపథ్యంలో జరిగిందే. అయితే ఈ స్థితిలో కూడా పాక్ ప్రభుత్వం వివిధ మిలిటెంట్ సంస్థల విషయంలో తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. జైషే మహమ్మద్(జెఈఎం) అధినేత మసూద్ అజర్ బ్యాంకు ఖాతాలను స్తంభింప జేస్తూ తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణ. నిన్నమొన్నటి ఉడీ దాడి వరకూ వివిధ ఉగ్రవాద దాడుల వెనక మసూద్ అజర్ హస్తమున్నదని మన దేశం గతంలో అనేక సాక్ష్యాధారాలను అందజేసినా అతడిని ఇన్నేళ్లుగా పాక్ వెనకేసుకొస్తున్నది. ఉడీ దాడి తమ ఘనతేనని ఈమధ్యే అతడు ప్రకటించాడు. అయినా అతన్ని అరెస్టు చేయడానికి సిద్ధపడని పాక్...ఇప్పుడు అమెరికా ఒత్తిడి కారణంగా ఈ మాత్రం చర్యనైనా తీసుకుంది. ఇలా రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తుండటం వల్లే క్వెట్టా దాడి జరిగిందని ఇప్పటికైనా పాక్ గ్రహించకపోతే, అవసరమైన కఠిన చర్యలు తీసుకొనకపోతే దాన్నెవరూ కాపాడలేరు.