‘స్వచ్ఛంద’ నియంత్రణ | Editorial on Supreme court Action over Non-Governmental organization | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛంద’ నియంత్రణ

Published Wed, Jan 11 2017 11:44 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

‘స్వచ్ఛంద’ నియంత్రణ - Sakshi

‘స్వచ్ఛంద’ నియంత్రణ

గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ)లకు సాగుతున్న లడాయి కొత్త మలుపు తిరిగింది. ఈసారి సుప్రీంకోర్టే ఆ సంస్థల ఖాతాలను తనిఖీ చేయించి అక్రమాలకు పాల్పడుతున్న వాటిపై చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో వచ్చే మార్చి 31కల్లా నివేదిక సమర్పిం చమని కూడా కోరింది. దేశంలో స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలు కొన్ని దశా బ్దాలుగా విస్తృతమవుతూ వస్తున్నాయి. వాటి పనితీరుపై నిజానికి ప్రభుత్వాలకంటే ముందు కొన్ని వామపక్ష ఉద్యమ సంస్థలే తొలినాళ్లలో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రజల ఆగ్రహావేశాలను దారి మళ్లించడానికి, నీరుగార్చడానికి వాటిని నెలకొల్పి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించాయి. తమిళనాడులోని కూదంకుళం అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమైనప్పుడు యూపీఏ ప్రభుత్వం సైతం ఎన్‌జీఓలపై కన్నెర్ర జేసింది. రష్యా సహకారంతో నిర్మాణమవుతున్న అణు విద్యుత్‌ ప్రాజెక్టు గనుక అమెరికా నుంచి నిధులు స్వీకరించే సంస్థలు ఈ ఆందో ళనకు పూనుకున్నాయని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నిందించారు. ఆ తర్వాత అభివృద్ధి ప్రాజెక్టులకు ఎన్‌జీఓలు ఆటంకం కల్పించడం వల్ల జీడీపీ 2 నుంచి 3 శాతం పడిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదిక ఆరోపించింది.

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 31 లక్షల కుపైగా ఎన్‌జీఓలు ఉన్నాయని 2015లో సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ తెలిపింది. దేశంలో సగటున 709మందికి ఒక పోలీసు కాని స్టేబుల్‌ ఉండగా ఈ ఎన్‌జీఓలు ప్రతి 400మందికి ఒకటి ఉన్నాయి! అయితే అన్నిటా ఉన్నట్టే స్వచ్ఛంద సంస్థల్లోనూ మంచి, చెడూ ఉంటాయి. ప్రకటిత లక్ష్యా లకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసిన సంస్థల వల్లే దేశంలో ఎవరికీ పట్టని అనేక అంశాలు వెలుగులోకొచ్చాయి. బాల కార్మిక వ్యవస్థ మొదలుకొని పర్యా వరణం వరకూ... ఎయిడ్స్‌ బాధితుల సంక్షేమం నుంచి రోడ్డు ప్రమాద బాధితు లకు అత్యవసర వైద్య సదుపాయం అందించే వరకూ... వీధి బాలలకు ఆవాసం కల్పించి వారికి చదువు చెప్పించడం దగ్గర్నుంచి గ్రామ సీమల్లో కౌమార బాలికల, మహిళల ఆరోగ్య సమస్యలను తీర్చడం వరకూ ఎన్నో అంశాల్లో విశేష కృషి చేసి అద్భుత ఫలితాలు సాధిస్తున్న సంస్థలున్నాయి. వీటి కృషి ఫలితంగా లక్షలాది మంది మహిళలు, దళితులు, అనాథ బాలబాలికలు స్వశక్తితో ఎదిగి మెరుగైన స్థితికి చేరుకుంటున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనపైనా, పోలీసు నిర్బంధంలో పెట్టే చిత్రహింసలపైనా పోరాడే సంస్థలున్నాయి. వివిధ అంశాల్లో ఆ సంస్థలు చేయిం చిన పరిశోధనలు, సర్వేలు అంతవరకూ ఎవరికీ తెలియని అనేక నిజాలను వెలికి తీశాయి. ఫలితంగా సమాజంలో ఆయా అంశాల పట్ల అవగాహన, సున్నితత్వం పెరిగాయి. ప్రభుత్వాలు సైతం వాటిపై దృష్టి పెట్టడం ప్రారంభించాయి.

అయితే స్వచ్ఛంద సేవ ముసుగులో డబ్బులు వెనకేసుకుంటున్నవారూ, ఇత రేతర కార్యకలాపాలకు పాల్పడుతున్నవారు లేకపోలేదు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక స్వచ్ఛంద సంస్థలపై అప్పటికే ఉన్న నిఘా మరింత పెరిగింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు తమ గుర్తింపు పునరుద్ధరణకు కొత్తగా దరఖాస్తు చేసుకోనట్టయితే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద వాటి లైసెన్స్‌లను రద్దు చేస్తామని 2015లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాఖీదులు పంపింది. ఆ తర్వాత గ్రీన్‌పీస్‌తో సహా దాదాపు 10,000 సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయడంతోపాటు వాటి ఖాతాలను కూడా స్తంభింపజేసింది. ఫోర్డ్‌ ఫౌండేషన్‌ వంటి కొన్ని సంస్థలను ‘ముందస్తు అనుమతి’ అవసరమయ్యే సంస్థల జాబితాలో చేర్చింది. అయితే అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఇక్కడి అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ జోక్యంతో మరికొన్ని వారాలకు ఫోర్డ్‌ ఫౌండేషన్‌ను ఆ జాబితా నుంచి తొలగించడంతోపాటు నిరుడు మార్చిలో ఆ సంస్థపై ఉన్న ఆంక్షలన్నీ తొలగిం చారు. ఫోర్డ్‌ ఫౌండేషన్‌ చిన్న సంస్థేమీ కాదు. నెహ్రూ కాలం నుంచి అది ఈ దేశంలో అమలైన అనేక పథకాల రూపకల్పనలో, వాటి అమలులో పాలుపంచు కుంది. ప్రణాళికా సంఘాన్ని పటిష్టపరచడం, ఐఐఎంల ఏర్పాటు వగైరాల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసింది. గుజరాత్‌ మారణకాండపై న్యాయస్థానాల్లో పోరాడుతున్న తీస్తా సెతల్వాద్‌ ఆధ్వర్యంలోని సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌ (సీపీజే) సంస్థతో సహా అనేక సంస్థలకు ఈ ఫోర్డ్‌ ఫౌండేషనే నిధులు సమకూర్చేది. తన విధానాలను ప్రశ్నిస్తున్న సంస్థలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నదని పలువురు పౌర సమాజ కార్యకర్తలు ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సైతం ఈ విషయంలో కేంద్రానికి నోటీసులు జారీచేసింది.

కేంద్రం లోగడ తీసుకున్న చర్యలకూ, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలకూ మౌలికంగా భేదం ఉంది. కేంద్రం ఆయా సంస్థలకు విదేశీ నిధులు రాకుండా మాత్రమే ఆపింది. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం మరో అడుగు ముందుకేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడే సంస్థలపై క్రిమినల్‌ కేసులు పెట్ట డంతోపాటు లెక్క చెప్పని నిధులను వాటినుంచి రాబట్టాలని కూడా చెప్పింది. చిత్రమేమంటే స్వచ్ఛంద సంస్థలపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్టు కనబడిన కేంద్ర ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలోనూ ఆ సంస్థల ఆర్ధిక కార్యకలాపాలకు సంబం ధించిన నియంత్రణ వ్యవస్థనే ఏర్పాటు చేయలేదు. ఎన్నడో 2005లోనే అలాంటి యంత్రాంగం ఉండాలన్న నియమం పెట్టుకున్నా ఇంతవరకూ ఆ పని జరగక పోవడమే కాదు... కనీసం ప్రభుత్వ గుర్తింపు లభించడానికి లేదా ఆ సంస్థల ఖాతాల నిర్వహణకు, అవి సరిగా లేని పక్షంలో తీసుకునే చర్యలకూ సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలూ రూపొందలేదు. విస్తృత స్థాయిలో కార్యకలాపాలు సాగించే ఎన్‌జీఓలకు ఒక నియంత్రణ వ్యవస్థ అవసరమే. అదే సమయంలో చిత్త శుద్ధితో, ఉత్కృష్టమైన లక్ష్యంతో పనిచేసే సంస్థలపై అవాంఛనీయమైన ఆంక్షలు విధించడం, వాటి కార్యకలాపాలను అడ్డుకోవడం సబబు కాదు. ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement