సిగ్గు...సిగ్గు! | editorial on visakha patnam baby factory | Sakshi
Sakshi News home page

సిగ్గు...సిగ్గు!

Published Fri, Jan 1 2016 1:39 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

editorial on visakha patnam baby factory

ప్రతీదీ వ్యాపారమైన చోట మాతృత్వానికి కూడా మినహాయింపు ఉండదు. అమ్మ కడుపు అంగడి సరుకుగా మారడం...పేగుబంధానికి వెలకట్టి కంటి దీపాల్ని సొంతం చేసుకోవడం సాధారణమైనచోట విలువలు మరింత దిగజారి ‘బేబీ ఫ్యాక్టరీ’లు పుట్టుకురావడం వింతేమీ కాదు. పాలనాయంత్రాంగం కళ్లు మూసుకునే చోట ఏమైనా జరగొచ్చు. కాసిన్ని నోట్లు రాలిస్తే కావలసినదేదైనా ఖాయంగా అందుబాటులోకి రావొచ్చు. విశాఖ తీరాన నిత్యం ఒడ్డును తాకే సముద్రానికి బంగాళాఖాతమని పేరు. కానీ ఆకాశాన్నంటే భవంతులతో, అనుక్షణమూ హడా వుడి పడుతున్నట్టు కనబడే ఆ నవ నాగరిక సమాజంలో అంతకన్నా పెద్ద అఖాతా లున్నాయని గురువారం ‘సాక్షి’ వెలువరించిన కథనం వెల్లడించింది.

పసి పిల్లలను ఆటబొమ్మల్లా అంగట్లో పెట్టి అమ్ముకుంటున్న వైనాన్ని సజీవ దృశ్యాలతో బట్టబ యలు చేసింది. నవజాత శిశువు మొదలుకొని నెలరోజుల శిశువు వరకూ... అమ్మాయైనా, అబ్బాయైనా- ఎవరినైనా సరే క్షణంలో అందుబాటులోకి తీసు కురాగల ఘనులు అక్కడ నిర్లజ్జగా, నిర్నిరోధంగా వ్యాపారం చేసుకుంటున్నారని సాక్ష్యాధారాలతో తెలిపింది. విశాఖలో సాగుతున్న పిల్లల వ్యాపారం ఇంతవరకూ వెల్లడైన అన్ని రకాల చీకటి వ్యాపారాలనూ తలదన్నింది. సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతిపరిచింది. ఈ వ్యాపారం చాటుమాటునేమీ సాగడం లేదు. ఎవరూ ఆనవాలు కట్టలేనిచోట గుట్టుగా జరగడం లేదు. నగరంలో ఎప్పుడూ హడావుడిగా ఉండే ఆర్కే బీచ్ ఒడ్డున ఉన్న సంతాన సాఫల్య కేంద్రాల పరిసరాల్లో, వాటిని ఆశ్రయించుకుని ఈ వ్యాపారం యథేచ్ఛగా నడిచిపోతోంది. ‘సాక్షి’ ప్రతినిధుల రహస్య కెమెరాలకు చిక్కినవారి కథనాల ప్రకారం ఇదంతా ఏడాదినుంచి అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతోంది. ఇప్పటివరకూ కొన్ని వందలమందికి ఇలా పిల్లల్ని అమ్మానని నర్సుగా చెప్పుకున్న మహిళ వెల్లడిస్తే...నేను 20 మంది బేబీలను అమ్మానని మరో దళారీ అంటున్నాడు.

ఇలాంటి వ్యాపారం ఏ ఇద్దరో, ముగ్గురో కలిసి చేయగలిగేది కాదు. సంతాన సాఫల్య కేంద్రాల అండదండలు...వైద్యుల ప్రమేయం...పలుకుబడి కలిగిన బడా వ్యక్తుల ఆశీస్సులూ లేకుండా జరిగేది అసలే కాదు. కోట్లాది రూపాయలు చేతులు మారే ఈ వ్యాపారంలో ఇంకెందరు పాత్రధారులో, ఇంకెన్ని నగరాలు ఇలాంటివారి అడ్డాలుగా ఉన్నాయో తేలవలసి ఉంది. భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యవంతులై, కేవలం పిల్లల్ని కనలేని పరిస్థితులున్నప్పుడు సరోగసీ ప్రక్రియను ఆశ్రయిస్తారు. వారిలో ఒకరికి అనారోగ్యమున్న పక్షంలో అండకణాల్ని లేదా వీర్యాన్ని ఇచ్చే దాతలుంటారు. బీజమొకరిది, అండమొకరిది...బిడ్డ పెరిగే గర్భం వేరొకరిది అయ్యే ఈ ప్రక్రియలోనే నైతికతకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలున్నాయి.

దీన్ని కేవలం ఒక వైద్య ప్రక్రియగా, శాస్త్ర రంగం సాధించిన ఘన విజయంగా మాత్రమే చూడటం సాధ్యం కాదు. దీని చుట్టూ ఏటా వేలాది కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. మరెవరికోసమో బిడ్డను కని ఇచ్చేందుకు సిద్ధపడేవారు సర్వసాధారణంగా పేదంటి వారు అయి ఉంటారు. అలాంటివారి నిస్సహాయ స్థితిని ఆసరా చేసుకుని సాగే ఈ వ్యవహారంలో గర్భస్రావమైనా, ప్రసవ సమయంలో అనుకోని ఆపద వచ్చిపడినా వైద్యసాయం ఏమేరకు అందుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాగే నవ జాత శిశువుకు అంగవైకల్యం ఉన్నదని గుర్తించినప్పుడు తీసుకోవడానికి ససేమిరా అనేవారుంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు అనుసరించాల్సిన విధివిధా నాలపై 2010లోనే బిల్లు రూపొందినా అదింకా చట్టరూపం దాల్చలేదు.

ఇప్పటికైతే భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) రూపొందించిన కొన్ని మార్గద ర్శకాలకింద ఇదంతా నడుస్తున్నది. అయినా కూడా ఈ మాదిరి ప్రక్రియ పర్యవసా నంగా ఎంతమంది మహిళలు సమస్యలబారిన పడుతున్నారో...ప్రయోగాలు వికటించిన సందర్భాల్లో ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో చెప్పే డేటా లేదు. ఏదో మేరకు పర్యవేక్షణ ఉండే ఈ వ్యవహారమే ఇంత కంగాళీగా ఉంటే...ఏ అజమా యిషీ, పర్యవేక్షణ లేకుండా రహస్యంగా సాగిపోయే విశాఖ ‘బేబీ ఫ్యాక్టరీ’లో ఎన్ని దారుణాలు చోటుచేసుకోవచ్చునో ఊహించడానికే భయం వేస్తుంది.

ఏ మార్గదర్శకాలూ లేని ఈ ‘బేబీ ఫ్యాక్టరీలు’ సృష్టించే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఒక వ్యక్తినుంచి సేకరించే వీర్యంతో మూడు అండకణాలను ఫలదీకరించే అవకాశం ఉంటుంది గనుక దాతకుగానీ, తల్లిదండ్రులకుగానీ తెలియకుండా...వారి అనుమతి లేకుండా ఫలదీకరణద్వారా మరో రెండు పిండాలను అభివృద్ధి చేయొ చ్చు. అలా జన్మించే పిల్లలు భవిష్యత్తులో పోలికలనుబట్టో, ఇతరత్రా తెలుసుకునో తాము ఫలానావారికి పుట్టినవారమని...అది నిరూపించడం కోసం డీఎన్‌ఏ పరీక్ష జరిపించాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తే వారసత్వ హక్కులతోసహా వచ్చే సమ స్యలు కోకొల్లలు. నిషేధించిన లింగ నిర్ధారణ పరీక్షలతోసహా అన్నీ ఈ వ్యాపా రంలో యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇలా చాటుమాటున పిల్లల్ని కొనుక్కుంటున్నవారు పెంచుకోవడానికే తీసుకెళ్తున్నారా లేక తమకు పుట్టిన పిల్లలకు ఏర్పడ్డ లోపాలను ఈ అభాగ్యుల అవయవాలతో సరిచేసుకోవడానికి పట్టుకెళ్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతాయి. ఎందుకంటే 2001లో హైదరాబాద్‌లోని ఒక దత్తత కేంద్రంపై దాడి సందర్భంగా అంధత్వం ఉన్న పసిపాప లభించినప్పుడు ఆ పాప కార్నియాను తొలగించి వేరేవారికి అమర్చి ఉండొచ్చునని నిపుణులు అనుమానించారు.

చంద్రబాబు హయాంలో ఇప్పటికి ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ మాఫియా, ల్యాండ్ మాఫియా బయటపడ్డాయి. వాటి సూత్రధారులకు ఇంతవరకూ ఏమీ కాలేదు. ఆంధ్రప్రదేశ్‌కే కాదు...దేశానికే మచ్చతెచ్చే ఈ ‘బేబీ ఫ్యాక్టరీ’ సూత్రధారులకైనా తక్షణం అరదండాలు పడాలని సమాజశ్రేయస్సును కాంక్షించేవారు కోరుకుంటారు. రాష్ట్రంలో, ప్రత్యేకించి విశాఖలో ఈ మాదిరి ఫ్యాక్టరీలు ఇంకెన్ని ఉన్నాయో ఆరాతీసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బాబు సర్కారుపై ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement