Baby Factory
-
‘బేబీ ఫ్యాక్టరీల’పై దాడులు
-
‘బేబీ ఫ్యాక్టరీల’పై దాడులు
హైకోర్టు ఆదేశాలతో ఐవీఎఫ్ కేంద్రాల్లో తనిఖీలు సాక్షి, విశాఖపట్నం: సంచలనం సృష్టించిన ‘సాక్షి’ కథనం బేబీ ఫ్యాక్టరీలపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. విశాఖపట్నంలో పలు ఐవీఎఫ్ కేంద్రాలపై శనివారం దాడులు నిర్వహించింది. ఫ్రీజింగ్ బ్యాంకుల్లో పిండాలతో సరోగసీ ద్వారా పిల్లలను పుట్టించి, విక్రయాలకు పాల్పడుతున్న వైనంపై ‘సాక్షి’ ఇటీవల ‘విశాఖలో బేబీ ఫ్యాక్టరీ’ శీర్షికతో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయవాది అరుణ్‌కుమార్ రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలన్న కోర్టు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ యువరాజ్ నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖ, అనకాపల్లి ఆర్డీవోలు, ఆర్ అండ్ ఆర్ (ఏపీఐఐసీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలోని ఈ బృందాలు నగరంలోని 11 సంతాన సాఫల్య కేంద్రాల్లో శనివారం తనిఖీలు చేశాయి. ఆయా కేంద్రాల్లో ఏడాదిగా ఎంతమంది సంప్రదించారు? ఎంతమందికి సరోగసీ, అండదానం చేశారు? చికిత్సకు ఎందరు వచ్చారు? వంటి అంశాలను ఆరా తీసినట్టు తెలిసింది. ఈ కేంద్రాల ద్వారా బిడ్డలను పొందిన వారితోనూ ఫోన్లో మాట్లాడి వివరాలు రాబట్టినట్లు సమాచారం. అలాగే వీరు ఎవరి ద్వారా ఆయా సెంటర్లకు వచ్చారు? దళారులు ఉన్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు విచారణ వివరాలను రహస్యంగా ఉంచారు. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పలు సంతాన సాఫల్య కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని ఐవీఎఫ్ కేంద్రాల్లో గత ఐదేళ్లుగా సరైన రికార్డులు నిర్వహించడంలేదని సమాచారం. ఇటువంటి అవకతవకలను తనిఖీ అధికారులు నమోదు చేసుకొని, కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. తుది నివేదికను ఆయన ఈ నెల 11 నాటికి హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. అనుమతిలేకుండా సరోగసీ! నగరంలో నడుస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలకు సరోగసి అనుమతుల్లేవని అధికారులే చెబుతున్నారు. తాము సరోగసీ చేయడం లేదని ఈ కేంద్రాల నిర్వాహకులు తనిఖీల సమయంలో బుకాయించారు. అయితే కొన్ని కేంద్రాల ఆవరణలో తమ వద్ద ‘సరోగసీ, ఎగ్ డొనేషన్ సదుపాయం’ ఉందంటూ పెద్దపెద్ద బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. పోలీసుల తనిఖీలు పోలీసులు కూడా పలు సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. మహారాణిపేట పోలీస్‌స్టేషన్ ఎస్ఐ గంగాధర్ శనివారం సాగరతీరంలో శిశు విక్రయాలకు నిలయంగా ఉన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఐవీఎఫ్ కేంద్రాలకు వెళ్లి అక్కడున్న గర్భిణుల నుంచి వివరాలు సేకరించారు. ట్రీట్మెంట్లో భాగంగా మూడు నెలల పాటు కదలకుండా కేంద్రాల్లోనే ఉండాలని వైద్యులు చెప్పడంతో ఇక్కడే ఉంటున్నామని అక్కడి రోగులు పోలీసులకు తెలిపారు. ‘బేబీ ఫ్యాక్టరీ’పై ఎఫ్ఐఆర్ ‘బేబీ ఫ్యాక్టరీ’ల నిర్వాహకులపై తొలి కేసు నమోదైంది. సరోగసీ ద్వారా పిల్లలను విక్రయిస్తున్న ముఠాలపై ‘సాక్షి’ కథనాలకు విశాఖ జిల్లా శిశు సంక్షేమ అధికారి ఎ.సత్యనారాయణ స్పందించారు. బీచ్ రోడ్డు సమీపంలోని భాగ్యసాయి అపార్ట్మెంటులో పిల్ల ల విక్రయాలు సాగుతున్నట్టు ‘సాక్షి’ కథనాల వల్ల తెలుస్తోందని, దాని ఆధారంగా బేబీ ఫ్యాక్టరీ నిర్వాహకులు విజయలక్ష్మి, మూర్తిలపై కేసు నమోదు చేసి తగు చర్యలు చేపట్టాలని విశాఖలోని మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం సీఐ ఆర్ గోవిందరావు కేసు నమోదు చేశారు. ఇంత వరకూ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయడానికి ఆలస్యమైందని, ఫిర్యాదు వచ్చినందున ఇప్పటికే పరారైన నిందితులను పట్టుకోవడానికి చర్యలు చేపడతామని సీఐ వెల్లడించారు. -
‘బేబీ ఫ్యాక్టరీ’పై హైకోర్టు విచారణ
-
‘బేబీ ఫ్యాక్టరీ’పై హైకోర్టు విచారణ
♦ సాక్షి కథనాన్ని పిల్‌గా పరిగణించిన హైకోర్టు ♦ ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సాక్షి, హైదరాబాద్: ఫ్రీజింగ్ బ్యాంకుల్లోని పిండాలతో సరోగసి ద్వారా పిల్లల విక్రయానికి పాల్పడుతున్న ముఠాపై ‘ఇచ్చట ‘పిల్లలు’ అమ్మబడును’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఏపీ సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలను ఒకటి రెండ్రోజుల వరకు రహస్యంగా ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పిల్లల అమ్మకాల వ్యవహారంపై సమగ్ర విచారణకు హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. విచారణ వ్యవహారం బయటకొస్తే అమ్మకాల వెనుక అసలు సూత్రధారులు తప్పించుకునే ప్రమాదం ఉండటంతో హైకోర్టు తమ ఆదేశాలను రహస్యంగా ఉంచినట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలు ఇప్పటికే విశాఖ పోలీసులకు చేరినట్లు తెలిసింది. బేబీ ఫ్యాక్టరీపై ఏసీజేకు లేఖ.. సాక్షిలో వచ్చిన బేబీ ఫ్యాక్టరీ కథనంపై న్యాయవాది పి.అరుణ్‌కుమార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు రిజిస్ట్రీ ఆ లేఖను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. దీన్ని గురువారం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (స్పెషల్ జీపీ) డి.రమేష్‌ను పిలిచి ఈ కేసు గురించి తెలిపింది. ఈ కేసులో తాము ఉత్తర్వులు జారీ చేయదలచామని, అయితే వాటిని బహిరంగంగా చెప్పదలచుకోలేదని రమేష్‌కు కోర్టు హాలులోనే స్పష్టం చేసింది. తాము వెలువరించే ఉత్తర్వులు మీకు అందుతాయని, వాటిని చూసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. విశాఖటపట్నంలోని ఐవీఎఫ్ ఆసుపత్రుల సాయంతో దళారులు పేద మహిళల ద్వారా సరోగసి పద్ధతితో పిల్లలను కనిపించి, ఆడపిల్ల రూ.2.5 లక్షలు, మగ పిల్లపిల్లాడైతే రూ.4.5 లక్షలకు అమ్ముతున్న వైనాన్ని ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. -
సిగ్గు...సిగ్గు!
ప్రతీదీ వ్యాపారమైన చోట మాతృత్వానికి కూడా మినహాయింపు ఉండదు. అమ్మ కడుపు అంగడి సరుకుగా మారడం...పేగుబంధానికి వెలకట్టి కంటి దీపాల్ని సొంతం చేసుకోవడం సాధారణమైనచోట విలువలు మరింత దిగజారి ‘బేబీ ఫ్యాక్టరీ’లు పుట్టుకురావడం వింతేమీ కాదు. పాలనాయంత్రాంగం కళ్లు మూసుకునే చోట ఏమైనా జరగొచ్చు. కాసిన్ని నోట్లు రాలిస్తే కావలసినదేదైనా ఖాయంగా అందుబాటులోకి రావొచ్చు. విశాఖ తీరాన నిత్యం ఒడ్డును తాకే సముద్రానికి బంగాళాఖాతమని పేరు. కానీ ఆకాశాన్నంటే భవంతులతో, అనుక్షణమూ హడా వుడి పడుతున్నట్టు కనబడే ఆ నవ నాగరిక సమాజంలో అంతకన్నా పెద్ద అఖాతా లున్నాయని గురువారం ‘సాక్షి’ వెలువరించిన కథనం వెల్లడించింది. పసి పిల్లలను ఆటబొమ్మల్లా అంగట్లో పెట్టి అమ్ముకుంటున్న వైనాన్ని సజీవ దృశ్యాలతో బట్టబ యలు చేసింది. నవజాత శిశువు మొదలుకొని నెలరోజుల శిశువు వరకూ... అమ్మాయైనా, అబ్బాయైనా- ఎవరినైనా సరే క్షణంలో అందుబాటులోకి తీసు కురాగల ఘనులు అక్కడ నిర్లజ్జగా, నిర్నిరోధంగా వ్యాపారం చేసుకుంటున్నారని సాక్ష్యాధారాలతో తెలిపింది. విశాఖలో సాగుతున్న పిల్లల వ్యాపారం ఇంతవరకూ వెల్లడైన అన్ని రకాల చీకటి వ్యాపారాలనూ తలదన్నింది. సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతిపరిచింది. ఈ వ్యాపారం చాటుమాటునేమీ సాగడం లేదు. ఎవరూ ఆనవాలు కట్టలేనిచోట గుట్టుగా జరగడం లేదు. నగరంలో ఎప్పుడూ హడావుడిగా ఉండే ఆర్కే బీచ్ ఒడ్డున ఉన్న సంతాన సాఫల్య కేంద్రాల పరిసరాల్లో, వాటిని ఆశ్రయించుకుని ఈ వ్యాపారం యథేచ్ఛగా నడిచిపోతోంది. ‘సాక్షి’ ప్రతినిధుల రహస్య కెమెరాలకు చిక్కినవారి కథనాల ప్రకారం ఇదంతా ఏడాదినుంచి అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతోంది. ఇప్పటివరకూ కొన్ని వందలమందికి ఇలా పిల్లల్ని అమ్మానని నర్సుగా చెప్పుకున్న మహిళ వెల్లడిస్తే...నేను 20 మంది బేబీలను అమ్మానని మరో దళారీ అంటున్నాడు. ఇలాంటి వ్యాపారం ఏ ఇద్దరో, ముగ్గురో కలిసి చేయగలిగేది కాదు. సంతాన సాఫల్య కేంద్రాల అండదండలు...వైద్యుల ప్రమేయం...పలుకుబడి కలిగిన బడా వ్యక్తుల ఆశీస్సులూ లేకుండా జరిగేది అసలే కాదు. కోట్లాది రూపాయలు చేతులు మారే ఈ వ్యాపారంలో ఇంకెందరు పాత్రధారులో, ఇంకెన్ని నగరాలు ఇలాంటివారి అడ్డాలుగా ఉన్నాయో తేలవలసి ఉంది. భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యవంతులై, కేవలం పిల్లల్ని కనలేని పరిస్థితులున్నప్పుడు సరోగసీ ప్రక్రియను ఆశ్రయిస్తారు. వారిలో ఒకరికి అనారోగ్యమున్న పక్షంలో అండకణాల్ని లేదా వీర్యాన్ని ఇచ్చే దాతలుంటారు. బీజమొకరిది, అండమొకరిది...బిడ్డ పెరిగే గర్భం వేరొకరిది అయ్యే ఈ ప్రక్రియలోనే నైతికతకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలున్నాయి. దీన్ని కేవలం ఒక వైద్య ప్రక్రియగా, శాస్త్ర రంగం సాధించిన ఘన విజయంగా మాత్రమే చూడటం సాధ్యం కాదు. దీని చుట్టూ ఏటా వేలాది కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. మరెవరికోసమో బిడ్డను కని ఇచ్చేందుకు సిద్ధపడేవారు సర్వసాధారణంగా పేదంటి వారు అయి ఉంటారు. అలాంటివారి నిస్సహాయ స్థితిని ఆసరా చేసుకుని సాగే ఈ వ్యవహారంలో గర్భస్రావమైనా, ప్రసవ సమయంలో అనుకోని ఆపద వచ్చిపడినా వైద్యసాయం ఏమేరకు అందుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాగే నవ జాత శిశువుకు అంగవైకల్యం ఉన్నదని గుర్తించినప్పుడు తీసుకోవడానికి ససేమిరా అనేవారుంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు అనుసరించాల్సిన విధివిధా నాలపై 2010లోనే బిల్లు రూపొందినా అదింకా చట్టరూపం దాల్చలేదు. ఇప్పటికైతే భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) రూపొందించిన కొన్ని మార్గద ర్శకాలకింద ఇదంతా నడుస్తున్నది. అయినా కూడా ఈ మాదిరి ప్రక్రియ పర్యవసా నంగా ఎంతమంది మహిళలు సమస్యలబారిన పడుతున్నారో...ప్రయోగాలు వికటించిన సందర్భాల్లో ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో చెప్పే డేటా లేదు. ఏదో మేరకు పర్యవేక్షణ ఉండే ఈ వ్యవహారమే ఇంత కంగాళీగా ఉంటే...ఏ అజమా యిషీ, పర్యవేక్షణ లేకుండా రహస్యంగా సాగిపోయే విశాఖ ‘బేబీ ఫ్యాక్టరీ’లో ఎన్ని దారుణాలు చోటుచేసుకోవచ్చునో ఊహించడానికే భయం వేస్తుంది. ఏ మార్గదర్శకాలూ లేని ఈ ‘బేబీ ఫ్యాక్టరీలు’ సృష్టించే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఒక వ్యక్తినుంచి సేకరించే వీర్యంతో మూడు అండకణాలను ఫలదీకరించే అవకాశం ఉంటుంది గనుక దాతకుగానీ, తల్లిదండ్రులకుగానీ తెలియకుండా...వారి అనుమతి లేకుండా ఫలదీకరణద్వారా మరో రెండు పిండాలను అభివృద్ధి చేయొ చ్చు. అలా జన్మించే పిల్లలు భవిష్యత్తులో పోలికలనుబట్టో, ఇతరత్రా తెలుసుకునో తాము ఫలానావారికి పుట్టినవారమని...అది నిరూపించడం కోసం డీఎన్ఏ పరీక్ష జరిపించాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తే వారసత్వ హక్కులతోసహా వచ్చే సమ స్యలు కోకొల్లలు. నిషేధించిన లింగ నిర్ధారణ పరీక్షలతోసహా అన్నీ ఈ వ్యాపా రంలో యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇలా చాటుమాటున పిల్లల్ని కొనుక్కుంటున్నవారు పెంచుకోవడానికే తీసుకెళ్తున్నారా లేక తమకు పుట్టిన పిల్లలకు ఏర్పడ్డ లోపాలను ఈ అభాగ్యుల అవయవాలతో సరిచేసుకోవడానికి పట్టుకెళ్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతాయి. ఎందుకంటే 2001లో హైదరాబాద్‌లోని ఒక దత్తత కేంద్రంపై దాడి సందర్భంగా అంధత్వం ఉన్న పసిపాప లభించినప్పుడు ఆ పాప కార్నియాను తొలగించి వేరేవారికి అమర్చి ఉండొచ్చునని నిపుణులు అనుమానించారు. చంద్రబాబు హయాంలో ఇప్పటికి ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ మాఫియా, ల్యాండ్ మాఫియా బయటపడ్డాయి. వాటి సూత్రధారులకు ఇంతవరకూ ఏమీ కాలేదు. ఆంధ్రప్రదేశ్‌కే కాదు...దేశానికే మచ్చతెచ్చే ఈ ‘బేబీ ఫ్యాక్టరీ’ సూత్రధారులకైనా తక్షణం అరదండాలు పడాలని సమాజశ్రేయస్సును కాంక్షించేవారు కోరుకుంటారు. రాష్ట్రంలో, ప్రత్యేకించి విశాఖలో ఈ మాదిరి ఫ్యాక్టరీలు ఇంకెన్ని ఉన్నాయో ఆరాతీసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బాబు సర్కారుపై ఉంది. -
పసిపిల్లల అమ్మకంపై విచారణకు మంత్రి ఆదేశాలు
విజయవాడ: సాక్షి కథనం 'బేబీ ఫ్యాక్టరీ' పై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు స్పందించారు. కృష్ణా జిల్లా విజయవాడలో మీడియాతో కామినేని మాట్లాడారు. విశాఖలో జరుగుతున్న అరాచకంపై విచారణ జరిపించాలని విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. పిల్లల అమ్మకంపై నివేదిక ఇవ్వాలని సీపీ అమిత్ గార్గ్‌ను మంత్రి కామినేని ఆదేశించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఒడ్డున ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు(ఐవీఎఫ్ సెంటర్లు), వాటి పరిసరాల్లోని అపార్ట్మెంట్లలో ప్రతిరోజూ (ఐవీఎఫ్ సెంటర్లు) యథేచ్ఛగా సాగుతున్న అమానవీయ వ్యాపారం.. పిల్లలను అంగడి వస్తువులుగా మార్చేసి అమ్ముతున్న ‘బేబీ ఫ్యాక్టరీ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించి నిజాలను బయటపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. -
బేబీ ఫ్యాక్టరీ
-
అమ్మకు తెలియకుండా పిండం మాయం
► విశాఖ తీరాన బేబీ ఫ్యాక్టరీ ► అంగట్లో ఆట వస్తువులవుతున్న శిశువులు ► అప్పుడే పుట్టిన బిడ్డల్ని సైతం అమ్ముతున్న దారుణం ► అమ్మకు తెలియకుండా పిండాన్ని మాయం చేస్తున్న దారుణమిదీ! ► అపురూపమైన అమ్మతనాన్ని అంగడి సరుకు చేస్తున్న నైచ్యమిదీ!! ► పొత్తిళ్లలోని పసిగుడ్డుకు సైతం వెలకట్టి మరీ అమ్ముతున్న ఘోరమిదీ! ► ఫ్రీజింగ్ బ్యాంకుల్లోని పిండాలతో అమానవీయ వ్యాపారం ► సరోగసీ ద్వారా పిల్లల్ని కనిపించి.. కళ్లు తెరవగానే విక్రయాలు ► ఆడపిల్లకు రూ.2.5 లక్షలు, మగ పిల్లాడికి రూ.4.5 లక్షలు ► ఐవీఎఫ్ చికిత్సకు వచ్చే దంపతులే లక్ష్యంగా దళారుల దందా ► ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగు చూసిన చేదు నిజాలు సాక్షి, హైదరాబాద్: ‘‘మా దగ్గర పిల్లలు అమ్మబడును.. ఆడపిల్లయితే రెండున్నర లక్షలు, మగపిల్లాడైతే నాలుగున్నర లక్షలు. ఒకరోజు బేబీ కావాలా? నాలుగు రోజుల పాప కావాలా? నెలరోజుల బాబు కావాలా? జాతకం.. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా మా వద్దే లభిస్తాయి. అమ్మకానికి ముందు అన్ని రకాల హెల్త్ చెకప్‌లు చేయించే ఇస్తాం..’’ ఈ మాటలు చెబుతున్నప్పుడు వారి మాటలో వణుకు ఉండదు.. వారి చూపులో బెరుకు ఉండదు.. వాళ్ల మనసులో భయం ఉండదు. ఎందుకంటే అది ఏడాది నుంచి యథేచ్ఛగా సాగిపోతున్న వ్యాపారం! వచ్చిన తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పసివాళ్ల అమ్మకాల్లో తమ ప్రతిభను చూపించడం మొదలుపెడతారు. మాతృత్వం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసే తల్లులకు వారి మాటలు అమృతంలా అనిపిస్తాయి. అంతే.. అక్కడ్నుంచి బేరాలు మొదలైపోతాయి. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఒడ్డున ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు(ఐవీఎఫ్ సెంటర్లు), వాటి పరిసరాల్లోని అపార్ట్మెంట్లలో ప్రతిరోజూ (ఐవీఎఫ్ సెంటర్లు) యథేచ్ఛగా సాగుతున్న అమానవీయ వ్యాపారమిదీ! పిల్లలను అంగడి వస్తువులుగా మార్చేసి అమ్ముతున్న ‘బేబీ ఫ్యాక్టరీ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆపరేషన్ సాగిందిలా.. ఈ నెల 27 మధ్యాహ్నం ‘సాక్షి’ ప్రతినిధులు విశాఖపట్నం ఆర్కేబీచ్ను ఆనుకొని ఉన్న నోవటెల్ హోటల్ దారిలోని ఓ అపార్ట్మెంట్కి వెళ్లారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చినట్లు చెప్పి అపార్టుమెంట్లో గది అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇచ్చినవారితో మాట్లాడుతూ.. ‘ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ కావడం లేదు.. దత్తత(అడాప్షన్)కు వెళ్దామనుకుంటున్నాం. ఆ పని మీదే ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు. ఆ మరుసటి రోజు ఉదయం మాటల్లో.. ఆ ఇంటి యజమానులు పిల్లల్ని అమ్మే ఏజెంట్ల గురించి చెప్పారు. వెంటనే పిలిపించమన్నారు. పిలవగానే నిమిషాల్లో ఇద్దరు ఏజెంట్లు ప్రత్యక్షమయ్యారు. అక్కడ్నుంచి మొదలైంది అసలు కథ. ఈ రోజే పుట్టిన పాప ఉంది కావాలా? ‘మీకు ఎన్ని రోజుల పాప కావాలి చెప్పండి మేడమ్..’ అని ఏజెంట్ అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ‘రోజుల పిల్లలు కూడా ఉంటారా..’ అనే ప్రశ్న పూర్తవ్వకుండానే.. ‘ఈ రోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు పుట్టిన అమ్మాయి ఉంది. తీసుకుంటారా...’ అంటూ ఏజెంట్ సమాధానం. ‘ఎక్కడ ఉందండి’ అంటే.....‘ఇక్కడికే తీసుకొస్తాం’ అన్నారు. మధ్నాహ్నం ఒంటి గంటకు అపార్టుమెంట్ కింద తెల్లకారు ఒకటి ఆగింది. అక్కడ్నుంచి ఫ్లాట్ యజమానికి ఫోన్ వచ్చింది. వారు ‘సాక్షి’ ప్రతినిధులను కిందకు వెళ్లి కారులో ఉన్న బిడ్డను చూసుకురమ్మన్నారు. కారు డోర్ తెరిచి చూస్తే ఒక మహిళా ఏజెంట్. ఒళ్లో ఆరు గంటల కిందటే పుట్టిన పసిగుడ్డు! తానున్నది అమ్మ ఒడిలో కాదు.. అమ్మకం ఒళ్లోనని కళ్లు కూడా సరిగ్గా తెరవలేని ఆ పసికందుకు తెలియదు పాపం. లేత గులాబీ రేకులా మెరిసిపోతున్న ఆ పాప వంక చూస్తు ఏజెంట్.. ‘చూశారు క దండీ.. బేబీ ఎంత తెల్లగా ఉందో. మీరు ఓకే అంటే వెంటనే హెల్త్ చెకప్ చేయించేస్తాను. ముందు మీరు ఫొటోలు తీసుకుని మీ ఇంట్లో వాళ్లకి పంపండి. వాళ్లకి నచ్చితే ఒక గంటలో వచ్చి బేరం మాట్లాడుకుందాం’ అన్నాడు. పావుగంటలో బేబీషో ముగించుకుని కారు తిప్పేశాడు. పాప ఓకే అయితే చెప్పండి.. వస్తాను అదే రోజు మధ్నాహ్నం 3 గంటలకు ఫ్లాట్ యజమానికి ఏజెంట్ నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. వెంటనే బేరం గురించి మాట్లాడుకోండి అంటూ ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ ఇచ్చారు. ‘నా పేరు సుజాత అండి. మీకు పాప నచ్చిందా’ అంటూ ఒక మహిళ మాట్లాడింది. ‘నచ్చింది..’ అనగానే.. ‘మీరు ఎంత వరకూ పెట్టగలరు?’ అని ప్రశ్న. ‘మీకు ఎంత కావాలి?’ అని అడగ్గా.. ‘రెండు లక్షలు, ఆపైన మా ఖర్చులకు మరో రూ.20 వేలు, బర్త్ సర్టిఫికెట్‌కి ఇంకో రూ.10 వేలు..’ అని చెప్పుకుంటూపోయింది. ‘ఇవన్నీ ఫోన్లో మాట్లాడుకోవడం దేనికండీ.. మీరు దగ్గరకు వస్తే కూర్చుని మాట్లాడుకోవచ్చుగా’ అనగానే ఎందుకో ఆమె ఇష్టపడలేదు. ‘మీకు పాప ఓకే అయితే చెప్పండి వస్తాను’ అంది. ‘మాట్లాడుకోకుండా ఓకే ఎలా చెప్పగలమండీ..’ అంటూ పాప గురించి నాలుగు సందేహాలు వ్యక్తం చేయడంతో బిడ్డను తీసుకొచ్చిన ఏజెంట్‌తో పాటు వచ్చింది సుజాత అనే నర్సు. వాళ్లంతా సరోగసీ ద్వారా పుట్టినవారు.. ‘నా పేరు సుజాత అండి. నేను ఇక్కడే నర్సుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి మీ సందేహాలు ఏంటి?’ అంటూ ఓ సేల్స్గర్ల్ను తలపించేలా గలగలా మాట్లాడుతోంది ఆమె. ‘పాప ఎవరికి పుట్టిందో తెలుసుకోవచ్చా అంటే ఏం లేదండీ కులం (కాస్ట్) గురించి తెలుసుకోవాలని. నిజానికి మాకు ఏ కాస్ట్ అయినా ఓకే కానీ ఏదో ఆసక్తి కొద్దీ అడుగుతున్నానంతే. అలాగే పాప తల్లిదండ్రులకు ఏమైనా జబ్బులుంటే అవి బేబీకి కూడా వస్తాయి కదా! అలాంటి వివరాలు కనుక్కునే అవకాశం ఏమన్నా ఉందంటారా?’ అని అడిగిన ప్రశ్నలకు ఆ నర్సు చెప్పిన సమాధానంతో దిమ్మదిరిగిపోయింది. ‘మేం అమ్మే ఏ పిల్లల కాస్ట్ మాక్కూడా తెలియదు. ఎందుకంటే వాళ్లేమీ తల్లిదండ్రులకు పుట్టిన వారు కాదు కాబట్టి. సరోగసీ పద్ధతి ద్వారా పుట్టినవారు వీళ్లంతా’’ అంటూ చెప్పుకొచ్చింది. ‘సరోగసీ అంటే తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం జరిగే వ్యవహారం కదా’ అని సందేహం వ్యక్తం చేయగానే ఆ పిల్లల పుట్టుక గుట్టు విప్పింది. ఇలా వందల మందికి పిల్లల్ని అమ్మాను.. పిల్లలను ఎలా తెస్తున్నారో సుజాత పూసగుచ్చినట్టు వివరించింది. ‘మీరు ఇప్పటికే మూడు నాలుగుసార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారని చెప్పారు కదా! ఆ వైద్యం సమయంలో అదనంగా ఓ రెండు మూడు పిండాలను ఫ్రీజర్స్‌లో నిల్వ చేస్తారు కదా! ఒకవేళ మీకు మొదటి పిండంతోనే సక్సెస్ అయిందనుకోండి. మిగతావి ఏం చేస్తారు? మేం వాటిని డాక్టర్ల దగ్గర కొనుక్కుని మా దగ్గరున్న సరోగసీ తల్లుల గర్భంలో పెడతాం. ఎంచక్కా మూడో కంటికి తెలియకుండా బిడ్డ మనచేతిలో ఉంటుంది’ అని ఎంతో ఉత్సాహంగా చె ప్పింది. ‘అంటే ఆ బిడ్డ ఎవరిదో మనకి తెలియడం కుదరదు కదా సుజాత గారూ..’ అని అడగ్గా.. ‘ఎవరి బిడ్డయితే మీకెందుకండీ.. మీకు కావాల్సింది హెల్దీ బేబీ. మా దగ్గర పుట్టేవారంతా నార్మల్‌గా పుట్టేవారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని నేను గట్టిగా చెప్పగలను. నేను ఇప్పటివరకూ కొన్ని వందలమందికి ఇలా పిల్లల్ని అమ్మాను. ఒక్కటంటే ఒక్క కంప్లయింటు కూడా లేదు’ అంటూ ఆ నర్సు చెప్పింది. పక్కనే కూర్చున్న వెంకట్ అనే ఏజెంట్ మాట కలుపుతూ...‘నేను ఇరవై బేబీలను అమ్మానండి. ఇదిగో చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారో..’’ అంటూ సెల్ఫోన్లో పిల్లల ఫొటోలను చూపించాడు. ‘అంతే కాదు మేడమ్ మా క్లయింట్స్ అందరూ మాకు ఇప్పటికీ టచ్‌లో ఉంటారు. ఎందుకంటే వారి ద్వారా కూడా కస్టమర్స్ వస్తుంటారు కదా!’ అంటూ ముగించాడు. ‘ఎందుకు ఒక్క తెలుగు రాష్ట్రాల వారే కాదు. ఒడిశా, మహారాష్ట్ర, మద్రాస్, బెంగళూరు నుంచి కూడా చాలామంది వచ్చి మా దగ్గర పిల్లల్ని కొనుక్కెళ్లారు’ అంటూ ముగించింది సుజాత. ‘మా ఇంట్లో వారికి ఫోన్ చేస్తే అబ్బాయినే అబ్బాయినే తీసుకోమంటున్నారండీ..’ అంటూ ‘సాక్షి’ ప్రతినిధులు అక్కడ్నుంచి బయటపడదామనుకున్నారు. అందుకు మరో ఏజెంట్.. ‘దానిదేముందండీ.. మీకు పదిరోజుల్లో సిద్ధం చేస్తాం’ అన్నాడు. ఐవీఎఫ్ ఆసుపత్రుల అండతో... విశాఖపట్నంలో ఉన్న ఐవిఎఫ్ ఆసుపత్రుల చుట్టుపక్కల ఇలాంటి ఏజెంట్లు పదుల సంఖ్యలో ఉన్నారు. ఇందులో ఒకరిద్దరు పిల్లల కోసం తండాలను, పేదతల్లిదండ్రులను నమ్ముకుంటే మిగతావారంతా ఎవరికి వారు పిండాలను కొనుక్కుని రహస్యంగా సరోగసి తల్లుల సత్రాలను నెలకొల్పుకుంటున్నారు. ఈ మొత్తం రాకెట్లో నర్సులదీ, డాక్టర్ల పాత్రే కీలకం. పిండాన్ని అమ్మడం దగ్గర నుంచి సరోగసి మదర్‌కి డెలివరీ చేసేవరకూ అన్నీ వారే కదా చూసుకోవాల్సింది. ఇక ఏజెంట్ల గురించి చెప్పాలంటే ఆసుపత్రికి ఇద్దరు ముగ్గురు చొప్పున ఉన్నారు. ఇక్కడ మరో ఏజెంట్ మాట్లాడుతూ ‘‘నాకు ఓ ఇరవై ఐవిఎఫ్ ఆసుపత్రుల్లోని డాక్టర్లతో పరిచయాలున్నాయండి. వారికి కావాల్సిన ఎగ్స్, ఎంబ్రియోస్, సరోగసీ మదర్స్...అన్నింటినీ నేనే సరఫరా చేస్తానని చెప్పాడు. పిండాలను నిల్వ చేస్తారిలా.. ఒక వ్యక్తి నుంచి సేకరించిన వీర్యాన్ని మహిళ అండకణాలు ఫలదీకరణం చెందిచేందుకు మూడుసార్లు ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక్కసారి నమూలు సేకరిస్తే మూడు పిండాలకు ఉపయోగపడే అవకాశముంది. వీటిని క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో అయితే నెల నుంచి 2 నెలల వరకూ నిల్వ చేయవచ్చు. అదే ఫ్రోజన్ సీమెన్ పద్ధతిలో అయితే 6 నెలల వరకూ నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది. అయితే వీర్యం ఇచ్చిన దాతతోపాటు అండకణాలు ఇచ్చిన మహిళ నుంచి అనుమతి తీసుకున్న (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తర్వాతే ఫలదీకరణ చేయాలి. ఎన్ని శాంపిళ్లు, ఎందరికి ఇచ్చినా వారి అనుమతి తప్పనిసరి. ఒక శాంపిల్ ద్వారా ఒక పిండాన్ని అభివృద్ధి చేసి.. మిగతా పిండాలకు అనుమతి అక్కర్లేదనుకుంటే పొరపాటు. చట్టప్రకారం ఎవరికి ఎన్ని శాంపిళ్లు, ఎవరి పిండంలో అభివృద్ధి చేసినా దాతల నుంచి అనుమతి లేకుండా చేస్తే అది చట్టరీత్యా నేరం. -
బేబీ ఫ్యాక్టరీ @ విశాఖ!
హైదరాబాద్: 'అమ్మ, నాన్న' అనిపించుకోవడం ప్రతి దంపతుల కోరిక. తమ బిడ్డలు నోరారా పిలిస్తే కడుపు నిండినంత సంతోషం ఏ తల్లిదండ్రులకైనా కలుగుతుంది. అంతెందుకు పెళ్లయిన మూడు నెలల నుంచే ఎక్కడికెళ్లినా.. వధువును అడిగి ప్రశ్న ఒక్కటే విశేషమైమేనా ఉందా అని.. అందుకే సమాజంలో పిల్లలంటే ఎంత ప్రేమో, తల్లితండ్రుల హోదా అంటే అంత పిచ్చి. సరిగ్గా ఇదే బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు రాక్షసులు. అది పసిపిల్లల అమ్మకాల వికృత వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారం చేసిన ఎక్స్‌ప్లోజివ్ ఇన్వెస్టిగేషన్లో ఈ తతంగాన్ని బట్టబయలైంది. విశాఖలో కొనసాగుతున్న పసిపిల్లల అమ్మకాల వ్యవహారం సాక్షి టీవీ పూర్తి వివరాలతో సహా వెలుగులోకి తెచ్చింది. వాస్తవానికి ఇలాంటి పసిపిల్లల అమ్మకం రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతగమే అయినప్పటికీ విశాఖలో ఈ దారుణాలు వెలుగు చూశాయంతే. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి కథనమిది.. వీక్షించండి. -
రెడీ ఫర్ సేల్ - రెడీమేడ్ బేబీస్