
‘బేబీ ఫ్యాక్టరీ’పై హైకోర్టు విచారణ
♦ సాక్షి కథనాన్ని పిల్‌గా పరిగణించిన హైకోర్టు
♦ ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫ్రీజింగ్ బ్యాంకుల్లోని పిండాలతో సరోగసి ద్వారా పిల్లల విక్రయానికి పాల్పడుతున్న ముఠాపై ‘ఇచ్చట ‘పిల్లలు’ అమ్మబడును’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఏపీ సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలను ఒకటి రెండ్రోజుల వరకు రహస్యంగా ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పిల్లల అమ్మకాల వ్యవహారంపై సమగ్ర విచారణకు హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. విచారణ వ్యవహారం బయటకొస్తే అమ్మకాల వెనుక అసలు సూత్రధారులు తప్పించుకునే ప్రమాదం ఉండటంతో హైకోర్టు తమ ఆదేశాలను రహస్యంగా ఉంచినట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలు ఇప్పటికే విశాఖ పోలీసులకు చేరినట్లు తెలిసింది.
బేబీ ఫ్యాక్టరీపై ఏసీజేకు లేఖ..
సాక్షిలో వచ్చిన బేబీ ఫ్యాక్టరీ కథనంపై న్యాయవాది పి.అరుణ్‌కుమార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు రిజిస్ట్రీ ఆ లేఖను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. దీన్ని గురువారం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (స్పెషల్ జీపీ) డి.రమేష్‌ను పిలిచి ఈ కేసు గురించి తెలిపింది. ఈ కేసులో తాము ఉత్తర్వులు జారీ చేయదలచామని, అయితే వాటిని బహిరంగంగా చెప్పదలచుకోలేదని రమేష్‌కు కోర్టు హాలులోనే స్పష్టం చేసింది.
తాము వెలువరించే ఉత్తర్వులు మీకు అందుతాయని, వాటిని చూసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. విశాఖటపట్నంలోని ఐవీఎఫ్ ఆసుపత్రుల సాయంతో దళారులు పేద మహిళల ద్వారా సరోగసి పద్ధతితో పిల్లలను కనిపించి, ఆడపిల్ల రూ.2.5 లక్షలు, మగ పిల్లపిల్లాడైతే రూ.4.5 లక్షలకు అమ్ముతున్న వైనాన్ని ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.