హక్కుల కోసమే ఈ పోరు
సందర్భం
కార్మిక సంఘాలను కలవడం, వారితో మాట్లాడటమంటేనే చంద్రబాబుకు పరమ చికాకుగా ఉంది. రోజూ విదేశీ వ్యాపార ప్రతినిధులతో మాట్లాడటానికి, వారికి రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానం పలకడానికి మాత్రం బోలెడంత తీరికసమయం ఉంది.
తమ హక్కుల సాధన కోసం కార్మికులు దేశవ్యాప్తంగా రోడ్డెక్కి సమ్మెచేసి సెప్టెంబర్ 2వ తేదీ నాటికి సరిగ్గా ఏడాది కాలం పూర్తవుతుంది. నిరంతర ధరల పెరుగుదల, తీవ్రమవుతున్న నిరుద్యోగం, ఉపాధి కోల్పో వడం, నిజవేతనాల తగ్గుదల, పరిశ్రమల మూసివేత, వ్యవ సాయ సంక్షోభాల యొక్క వ్యక్తీకరణే సెప్టెంబర్ 2 సమ్మె.
కేంద్రంలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడి రెండేళ్ల కాలం దాటింది. ఎన్నికల ముందు దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా కార్మిక వర్గానికి ఎన్నో వరాలు ప్రకటిం చారు. వాటిని తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని తమతమ ఎన్నికల ప్రణాళికల్లోనూ పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టగానే తమ కర్కశమైన మొదటి దాడిని కార్మిక వర్గంపైనే ప్రారంభించారు. నరేంద్రమోదీ అధికారంలోకి రాగానే జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గతంలో యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టిన కీలకమైన డిమాండ్లతోపాటు.. కార్మిక చట్టాలకు చేయదల్చిన సవరణ లను వెంటనే విరమించాలని విన్నవించడమైంది. కానీ కార్మిక సంఘాలతో సంప్రదించకుండా, పార్లమెంటుతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్‌లతో ఎఫ్‌డీఐలకు తలుపులు తెరిచి భారత ఆర్థిక వ్యవస్ధను పరాధీనం చేశారు.
ఇది చాలదన్నట్లు కేంద్రప్రభుత్వం ఆలోచనలకు అను గుణంగా, వారి చెప్పుచేతల్లో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్న కార్మిక చట్టాలను నీరుగార్చడానికి సవరణలు తెచ్చి 100కు 70 మందికిపైగా కార్మికులను చట్టపరిధిలోకి రాకుండా యజమానుల దయా దాక్షిణ్యాలకు కార్మికులను బలిపెట్టే విధంగా ఆయా రాష్ట్రాల్లో ఆమోదం పొందారు. విశాఖ జిల్లా బ్రాండెక్స్, అనంతపురం జిల్లా రావతార్, నెల్లూరు లోని కృష్ణపట్నం పోర్టు, శ్రీకాళహస్తిలోని ల్యాంకో, శ్రీకాకుళం జిల్లాలోని అరబిందో, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని సిమెంటు ఫ్యాక్టరీలు తదితర పరిశ్రమల్లో కార్మికులపై, కార్మిక సంఘాలపై జరుగుతున్న దాడులకు, కక్ష సాధింపు చర్యలకు స్ఫూర్తి ఇక్కడినుంచే ప్రారంభం అవుతోంది. ధర్నాల్లో పాల్గొంటే ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా స్కీం వర్కర్లకు వ్యతిరేకంగా నేరుగా ఆదేశాలు ఇవ్వడం బాబు నిరంకుశ విధానానికి పరాకాష్టగా అభివర్ణించవచ్చు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్సును తమ రాజకీయ ప్రచారానికి విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. చంద్రన్న చలవ పందిళ్ళు, ప్రజలంద రికీ వేసవిలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, మేడే సందర్భంగా పారిశ్రామికవేత్త లకు సన్మానాలు, ట్రాన్స్‌పోర్టు కార్మి కుల భీమా పథకం కోసం చెల్లించిన ప్రీమియం, చంద్రన్న భీమా పథకం ప్రీమియంతో సహా ప్రభుత్వం తన రాజ కీయ ప్రచారానికి చేపడుతున్న అన్ని పథకాలకు భవన నిర్మాణ కార్మికుల సెస్సు నిధిని వాడేస్తున్నారు.
బాబువస్తే జాబు వస్తుందని ఆశించిన యువతకు ఈ పాలన తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అంతే కాకుండా ప్రభుత్వమే తన శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. గృహ నిర్మాణ శాఖ లోని వేలాదిమంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఉపాధి హామీ శాఖ లోని ఫీల్డ్ అసిస్టెంట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖలోని వేలాది మంది చిరుద్యోగులు, ఆరోగ్యమిత్ర, ఐకేపీ రంగాల్లోని వేలాదిమంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఫెర్రో ఎల్లాయిస్, జూట్, కో ఆపరేటివ్ షుగర్స్, పేపర్ తదితర రంగాల్లో అనేక పరిశ్రమలు మూతపడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు, కార్మికులకు తగిన నష్టపరిహారం ఇప్పించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యా తీసుకోలేకపోవడం దారుణం.
రాష్ట్ర ప్రభుత్వం యజమానుల తొత్తుగా, పెట్టుబడికి తివాచీ పరిచే దళారీగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నాం. తక్షణమే ఈ క్రింది న్యాయమైన కోర్కెలు ఆమో దించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
1. రాష్ట్రంలోని కార్మికులందరికి రూ.18,000 కనీస వేతనం ఉండేట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 2. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 3. అసంఘటితరంగ కార్మికులందరికీ సమగ్ర చట్టం చేయాలి. 4. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలన్నింటినీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేయాలి. 5. ఆశా, ఐకేపీ మధ్యాహ్న భోజన కార్మికులకు తక్షణం నెలకు రూ.5 వేలు చెల్లించాలి. 6. మూతపడిన పరిశ్రమలను తెరిపించడానికి తక్షణం చర్యలు తీసుకుని అవసరమైన రాయితీలు ఇవ్వాలి. 7. మున్సిపాలిటీల్లో 279 జీవో అమలును నిలిపి వేయాలి. రాత్రి షిప్టుల్లో మహిళలచే పనిచే యించడం నిలిపివేయాలి. 8. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధిని దారి మళ్లించ కుండా తగు చర్యలు చేపట్టాలి.
కార్మిక వర్గంపై కత్తులు దూస్తున్న పాలకుల నిరంకుశ ఏకపక్ష ప్రజా వ్యతిరేక విధానాలపై మరోమారు సమర శంఖం పూరించాలని 50 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత, సర్వీసు రంగ కార్మికుల పక్షాన అన్ని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సెప్టెంబర్ 2న జరుపతలపెట్టిన సార్వత్రిక సమ్మెకు వై.యస్.ఆర్. ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.
(సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల, ఫెడరేషన్ల సార్వత్రిక సమ్మె సందర్భంగా)
వ్యాసకర్త డా. పి.గౌతమ్ రెడ్డి, ఏపీ రాష్ర్ట అధ్యక్షులు, వై.యస్.ఆర్. ట్రేడ్ యూనియన్ 98481 05455