గవర్నర్‌ల పాలి‘ట్రిక్స్’
విపక్షాల ఏలుబడిలో ఉండే రాష్ట్రాల్లో గవర్నర్‌కూ, ముఖ్యమంత్రికీ మధ్య విభేదాలు రావడం, వారు ఘర్షణ పడటం చాలా పాత వార్త. అందువల్లే ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ మధ్య... పుదుచ్చేరిలో సీఎం వి. నారాయణస్వామి, గవర్నర్ కిరణ్ బేడీల మధ్య ఏర్పడిన విభేదాల గురించి ఎవరూ ఆశ్చర్యపోవడం లేదు. కాకపోతే మన గవర్నర్ల వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందా అన్న నిరాశ మాత్రం అందరి లోనూ ఏర్పడుతోంది.
ఇటీవలకాలంలో గోవా గవర్నర్ మృదులా సిన్హా, మణి పూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్‌లు... ఇంతక్రితం ఢిల్లీ గవర్నర్‌గా పనిచేసిన నవాబ్ జంగ్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా చేసిన రాజ్‌ఖోవా ఈ మాదిరే వివాదాస్పదులుగా ముద్రపడ్డారు. నిజానికి రాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ పక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న రాజ్‌నాథ్ కోవింద్ వివిధ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నది ఇలాంటి వ్యవహారశైలికి దూరంగా ఉండటం వల్లనే. బిహార్ గవర్నర్‌గా నియమితులైనప్పుడూ, రాష్ట్రపతి పదవికి ఎంపికైననాడూ తప్ప మధ్యలో ఎప్పుడూ ఆయన వార్తల్లో లేరు. ఏనాడూ బిహార్ సీఎం, జేడీ(యూ) నేత నితీష్‌కుమార్‌తో ఘర్షణపడింది లేదు. చిత్రమేమంటే కోవింద్‌లాగే కేసరినాథ్ త్రిపాఠీ, కిరణ్‌బేడీ తదితరులను గవర్నర్లుగా ఎంపిక చేసింది కూడా బీజేపీయే.
ఇప్పుడు పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ గవర్నర్లు తప్పుకోవాలి లేదా రాష్ట్రపతి వారిద్దరినీ తొలగించాలి అంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వీరిద్దరూ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ ఆదేశానుసారం నడుచుకుంటూ రాజ్యాంగ విధులను అతిక్రమిస్తున్నారన్నది ఆ పార్టీ ఆరోపణ. నిజానికి గవర్నర్ల వ్యవస్థను ఈ స్థాయిలో భ్రష్టుపట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉండటం వల్ల అందరికన్నా ఎక్కువగా ఆ వ్యవస్థను ధ్వంసం చేయడం కాంగ్రెస్‌కే సాధ్యపడింది. ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఎన్నో మార్గదర్శకాలివ్వడం వల్ల రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను చీటికీ మాటికీ కూల దోయడం సాధ్యపడటం లేదు గానీ... ఆ ప్రభుత్వాలను ఎలా తిప్పలు పెట్టాలన్న విషయంలో ప్రయత్నలోపం ఉండటం లేదు. అలా జరిగే ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించాల్సింది గవర్నర్లే. అందువల్లే ఆ వ్యవస్థ వివాదాస్పదమైనంతగా మరేదీ కాలేదు. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి రాజ్‌భవన్‌లు బ్రాంచి ఆఫీసులుగా మారుతున్నాయని, వారు కేంద్రం ఏజెంట్లుగా పనిచేస్తున్నారని తరచు ఆరోపణలొచ్చేది అందువల్లే. సీఎంగా ఉన్నప్పుడు తాను రుచి చూసిన చేదు అనుభవాల కారణంగా స్వర్గీయ ఎన్టీ రామారావు అసలు గవర్నర్ల వ్యవస్థే నిరర్ధకమని అనేవారు. దాన్ని రద్దు చేయాలనేవారు.
పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో ఏర్పడ్డ మత ఉద్రిక్తతల విష యంలో గవర్నర్ త్రిపాఠీ ఫోన్ చేసి తనను అవమానించారని, బెదిరించారని సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇదంతా అబద్ధమని కొట్టిపారేస్తూ శాంతి భద్రతలను కాపాడలేని ప్రభుత్వ అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఆరోపి స్తున్నారని త్రిపాఠీ జవాబిచ్చారు. అక్కడేర్పడిన ఉద్రిక్తతలను చల్లార్చడంలో ప్రభుత్వం విఫలం కావడం సంగతలా ఉంచి, గుజరాత్‌లో ఎప్పుడో జరిగిన విధ్వంసకాండ ఫొటోలను, ఒక చలనచిత్రంలోని సన్నివేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి అవి ఉద్రిక్తతలున్న ప్రాంతంలో జరిగినట్టుగా చిత్రీకరించి బీజేపీ చేసిన పొరపాటు గవర్నర్ దృష్టికి వచ్చినట్టు లేదు. ఒకపక్క డార్జిలింగ్ గూర్ఖా ఉద్యమంతో... 24 పరగణాల జిల్లా మత ఉద్రిక్తతలతో అట్టుడుకుతుంటే బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు వాగ్యుద్ధానికి దిగడంఎలాంటి సంకేతాలు పంపుతుంది? పుదుచ్చేరిలో కిరణ్‌బేడీ వ్యవహారశైలి కూడా ఇలాగే ఉంది. ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల ఎంపికలో నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి నారాయణస్వామిని సంప్రదించాల్సి ఉండగా తానే సొంతంగా నిర్ణయం తీసుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయడం, అక్కడినుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే వారితో రాత్రికి రాత్రి తానే ప్రమాణస్వీకారం చేయించడం విమర్శలకు తావిచ్చింది. గవర్నర్‌గా తాను చేయాల్సిందేమిటో చేయకపోవడం, స్పీకర్ చేయా ల్సిన పనిని తన నెత్తినేసుకోవడం రాజ్యాంగ మర్యాదలను అతిక్రమించడమే అవుతుందని ఆమెకు తెలియదనుకోలేం. పీజీ మెడికల్ అడ్మిషన్ల వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలని పదిరోజులక్రితం కేంద్రానికి లేఖ రాయడంపై వచ్చిన దుమారం చల్లారకముందే ఆమె కొత్త వివాదాన్ని రేపారు. ఆమధ్య ఢిల్లీ మున్సి పల్ ఎన్నికల సమయంలోనూ బీజేపీకి ఓటేయమని పరోక్షంగా కోరుతూ ఆమె చేసిన ట్వీట్లు సంచలనం కలిగించాయి.
కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ గవర్నర్ల నియా మకాలపై కొన్ని సూచనలు చేసింది. ఆ పదవికి ఎంపికయ్యేవారు రాజకీయాలకు సంబంధంలేనివారు అయి ఉండాలని చెప్పింది. ఆ పదవుల్ని రాజకీయ పున రావాసంగా మార్చవద్దని సూచించింది. త్రిపాఠీ సంగతలా ఉంచి కిరణ్‌బేడీ తీరు గమనిస్తే ఆ కమిషన్ తన వైఖరిని మార్చుకోకతప్పదు. కిరణ్‌బేడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అభ్యర్థి కావొచ్చుగానీ ఆ పార్టీ పూర్తికాలం నాయకురాలిగా ఎప్పుడూ లేరు. పైగా ఆమెకు ఐపీఎస్ అధికారిగా అపారమైన పాలనానుభవం ఉంది. అందుకు భిన్నంగా కోవింద్ బీజేపీ ఎంపీగా రెండు దఫాలు పనిచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. కానీ వివాదాస్పద గవర్నర్ అనిపించుకోలేదు. గవర్నర్లుగా పనిచేస్తున్నవారు అత్యు త్సాహం ప్రదర్శిస్తే, అతిగా వ్యవహరిస్తే అది ఆ వ్యవస్థకు మచ్చ తీసుకురావడం మాత్రమే కాదు...వారిని ఎంపిక చేసిన తమపై కూడా నింద పడుతుందని ఎన్‌డీఏ పెద్దలు గ్రహించాలి. కాంగ్రెస్ చరిత్ర చూపి స్వీయ సమర్ధనకు దిగి ప్రయోజనం లేదు.