పాలనారంగ కాణాచి సీఎస్ | jwala narasimharao article on ex cs ramachandran | Sakshi
Sakshi News home page

పాలనారంగ కాణాచి సీఎస్

Published Fri, Dec 9 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

పాలనారంగ కాణాచి సీఎస్

పాలనారంగ కాణాచి సీఎస్

అభిప్రాయం
 పాలనా పరంగా సొంత తమ్ముడిని కూడా జైలుపాలుచేసిన నిజాయితీకి పూర్వ ఐసీఎస్ అధికారి సీఎస్ రామచంద్రన్ మారుపేరు. దేశ పారిశ్రామిక విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు.
 
స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తర్వాత భారతీయ పాలనారంగంలో ఎనలేని సేవలందించిన సివిల్ సర్వెం ట్‌గా, మానవతావాదిగా, ఆధ్యాత్మికవాదిగా, దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి సీఎస్‌ఆర్.  డిసెంబర్ 13, 2016న సాయంత్రం జరిగే దివంగత సీఎస్ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 102 ఏళ్లు పైబడిన వీకే రావుగా ప్రసిద్ధులైన వల్లూరి కామేశ్వరరావు (1937 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ (ఇండియన్ సివిల్ సర్వీస్) ఐసీఎస్ అధికారి), సీఎస్‌ఆర్‌పై వారి కూతురు, మాజీ ఐఏఎస్ అధికారిణి, గాయత్రి రామచంద్రన్ రాసిన పుస్తకాన్ని హైదరాబాద్ నగరంలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించనున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పూర్వ ఐఏఎస్ అధికారులు ఎం. గోపాలకృష్ణ, ఎస్. పార్థసారథి, టీఎల్ శంకర్, ప్రఖ్యాత వైద్యులు డా. ఏపీ రంగారావు ప్రసంగించనున్నారు.
 
తమిళనాడుకు చెందిన దివంగత సీఎస్ సుబ్రమణియన్, ఐసీఎస్ అధికారి కావలసి ఉన్నప్పటికీ, వామపక్ష భావాల ప్రభావంతో, స్వాతంత్య్ర సమరం జరిగే రోజుల్లో, కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్నప్పటికీ, ఉద్యమాలలో పాల్గొనేవారు. ఆ నేపథ్యంలో ఒక పర్యాయం స్వయానా ఆయన తమ్ముడి ఉత్తర్వులకు లోబడి జైలు పాలవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వులను జారీ చేసిన వ్యక్తి నాటి హోం సెక్రటరీ (అంతర్గత భద్రతా అధికారి) ఐసీఎస్ అధికారి, దివంగత సీఎస్ రామచంద్రన్ కావటం విశేషం. ఆ విధంగా అన్నదమ్ముల్లో పెద్దవాడైన సీఎస్ సుబ్రమణియన్ ఐసీఎస్ చదవడానికి ఇంగ్లండ్ దేశం వెళ్లినప్పటికీ, మధ్యలోనే ఇండియాకి వచ్చి, నాటి మద్రాసు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించడానికి, నిర్మాణాత్మకంగా ఎదగడానికి మూల కారణం అయ్యారు. తమ్ముడు సీఎస్ రామచంద్రన్ మాత్రం ఫిజిక్స్‌లో బిఎస్సీ ఆనర్స్ పూర్తి చేశారు. 1940 సివిల్ సర్వీసుల పోటీ పరీక్షకు హాజరై ఉత్తమ శ్రేణిలో సఫలీకృతులయ్యారు.
 
సీఎస్ రామచంద్రన్ ఐసీఎస్‌కు ఎంపికైన తర్వాత అప్పట్లో మధ్య భారత్‌గా పిలువబడే బేరార్-సెంట్రల్ ప్రావిన్సెస్ కేడర్‌కు కేటాయించడంతో, 1942లో అక్కడ ఉద్యోగిగా చేరారు. 1942 నుండి 1948 వరకు సెంట్రల్ ప్రావిన్సిస్‌లో పని చేసి, తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీకి కేడర్‌ను బదలాయించుకున్నారు. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో డిప్యుటేషన్‌పైన పనిచేశారు. ఆయన లాల్ బహదూర్‌శాస్త్రి వద్ద కూడా పని చేశారు. శాస్త్రి నిరాడంబరత సీఎస్‌కు ఆదర్శప్రాయమయింది.

దేశ పారిశ్రామిక విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటంలో ఇరువురు కలిసి పనిచేశారు. అందుకే, నేటికీ సీఎస్ గారి సేవలు భారతదేశ పారిశ్రామిక పటిష్టతకు పునాదులు వేయటంలో దోహదపడ్డారుు అని విశ్వసించే వారు లేకపోలేదు.  తర్వాత కాలంలో అనేక ప్రముఖ పదవులను భారత ప్రభుత్వంలో చేపట్టిన రామచంద్రన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో అదనపు కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సలహాదారునిగా, కుటుంబ నియంత్రణ, వైద్యశాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు. దేశాన్ని పరిపాలనాపరంగా తీర్చిదిద్దటంలో అందెవేసిన చేరుుగా అంతర్జాతీయంగా కూడా పలు కీలక పదవులు సీఎస్‌ఆర్‌కు కట్టబెట్టారు.
 
రామచంద్రన్ ఆధ్యాత్మిక విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలపై అపారమైన విశ్వాసం ఉండేది. ఈయన కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శంకరాచార్యుల వారికి అనుంగు శిష్యులు.  కంచి మఠాలు, సంస్థల స్థాపనలో పరిరక్షణలో కాలం గడిపేవారు. ఎన్నో దేవాలయాల స్థాపనలో భాగస్వాముల య్యారు. ఉత్తర భారతదేశంలోని బదరీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో అధ్యక్షులుగా నియమించారు. భారతదేశంలో ఆదిశంకరుని సంప్రదాయాలు కొనసాగటంలో బదరీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాలను ఉన్నత స్థానంలో నిలపటంలో వీరి కృషి ఎనలేనిది. సీఎస్ రామచంద్రన్ ఢిల్లీలోని ‘‘సౌత్ ఇండియన్ సమాజ్’’ అధ్యక్షులుగా దక్షిణ భారతదేశంలోని సాంస్కృతిక సంస్థల అభివృద్ధ్దిలో పాలుపంచుకున్నారు. కేరళ నుంచి ఆంధ్ర వరకు అన్ని సంప్రదాయాల మేలు కలరుుకగా దీనిని తీర్చిదిద్దటంలో సీఎస్‌ఆర్ సఫలీకృతులయ్యారు. దక్షిణ భారతీయులను ఒక్కతాటిపైకి తెచ్చి సంప్రదాయాల కాణాచిగా తీర్చిదిద్దటంలో వీరిది అందె వేసిన చేయి.
 
(డిసెంబర్ 13, 2016 సాయంత్రం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో జరగనున్న దివంగత ఐసీఎస్ అధికారి సీఎస్ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలలో.. ఆయన కుమార్తె మాజీ ఐఏఎస్ అధికారిణి, గాయత్రి రామచంద్రన్ తన తండ్రిపై రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా)

వనం జ్వాలా నరసింహరావు
వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో ప్రధాన పౌర సంబంధాల అధికారి
 మొబైల్ : 80081 37012

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement