మానవత్వం చాటుకున్న వైఎస్‌ఆర్ సీపీ కువైట్
కువైట్: ఇటీవల కువైట్‌లో మృతి చెందిన వైఎస్‌ఆర్ జిల్లా వాసి కుటుంబానికి అక్కడి వైఎస్‌ఆర్ సీపీ విభాగం అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది. వివరాలు.. వైయస్ ఆర్ జిల్లా రాజంపేట మండలం హస్తవరం పంచాయతి చెర్లోపల్లికి చెందిన దానసి వెంకటేష్(42) తన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం 16నెలలు క్రితం కువైట్ వెళ్లారు. ఈ నెల 26న గుండెపోటు రావడంతో వెంకటేష్ ఆకస్మికంగా మరణించారు. అతడికి భార్య రేణుక, కుమార్తె(13), కుమారుడు(11) ఉన్నారు.
వెంకటేష్ మృతి విషయాన్ని తెలుసుకున్న వైఎస్‌ఆర్ సీపీ కువైట్ కన్వీనర్ ఎం. బాలిరెడ్డి .. కమిటీ సేవాదళ్ సభ్యులు, వైస్ ఇంచార్జ్ కె. నాగ సుబ్బారెడ్డి ద్వారా ఇమిగ్రేషన్ పనులు పూర్తి చేసి.. భౌతికకాయాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా.. విదేశాలలో మరణించే వారి భౌతికకాయాన్ని ఆఖరి చూపు కొరకు తపన పడే వారి కొరకు తమ దృష్టికి తీసుకోని వస్తే కుల మత ప్రాంతాలకు అతీతంగా భౌతికకాయాన్ని స్వస్ధలానికి పంపిస్తున్న కువైట్ వైకాపా కన్వీనర్ బాలిరెడ్డిని, కమిటీ సభ్యులకు పార్టీ తరపున గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అభినందించారు.
బాలిరెడ్డి అభ్యర్థన మేరకు దానసి వెంకటేష్ మృతి దేహాన్ని చెన్నై నుండి స్వస్ధలం వరకు తీసుకురావడానికి రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంబులెన్స్‌ను ఎర్పాటు చేశారు. కువైట్ వైఎస్‌ఆర్ సీపీకి అన్నివిధాలుగా సహాయసహకారాలు అందిస్తున్న మిథున్ రెడ్డికి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కో- కన్వీనరు గోవిందు నాగరాజు, యూత్ ఇంచార్జ్ మర్రి కళ్యాణ్, సయ్యద్ సజ్జాద్, షేక్ సద్దార్, షేక్ ఖాదర్ భాష తదితరులు దానసి వెంకటేష్ పార్ధివ శరీరాన్ని సందర్శించి ఘననివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.