‘ఆన్‌ఫ్రాంక్’ పేరు ఎపుడైనా విన్నారా? | march 12th ann frank 71 death anniversary | Sakshi
Sakshi News home page

‘ఆన్‌ఫ్రాంక్’ పేరు ఎపుడైనా విన్నారా?

Published Thu, Mar 10 2016 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

‘ఆన్‌ఫ్రాంక్’ పేరు ఎపుడైనా విన్నారా?

‘ఆన్‌ఫ్రాంక్’ పేరు ఎపుడైనా విన్నారా?

కొత్త కోణం
 ఆన్‌ఫ్రాంక్  డైరీని చదివినప్పుడల్లా రెండవ ప్రపంచయుద్ధం సందర్భంగా జరిగిన నరమేధానికి కారణమైన జాత్యహంకారం వికృతరూపం గుర్తుకొస్తుంది. జాతి, వర్ణ, మత, కులపరమైన దురహంకారం ఎన్ని దారుణాలకు ఒడిగడుతుందో, ఎంతటి మారణహోమం సృష్టించగలదో అవగతమవుతుంది. ఈ నాటికీ ప్రపంచంలో ఇటువంటి ఆధిపత్య ధోరణులు, దురహంకారాలు ఇంకా బతికే ఉన్నాయన్నది వాస్తవం. దురహంకారం వివక్షకు, వివక్ష విద్వేషానికి, విద్వేషం వినాశనానికి దారితీస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం.

 ‘ఆన్‌ఫ్రాంక్’ పేరు ఎపుడైనా విన్నారా? అప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న చిన్న వయస్సులోనే ఆమె ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని చూడాల్సి వచ్చింది. జర్మన్ నాజీల జాత్యహంకారాన్ని, యూదుల ఊచకోతను, ఫాసిస్టు నిరంకుశత్వాన్ని అర్థం చేసుకోవాల్సిరావడమే కాదు... స్వయంగా తాను, తన కుటుంబం గురికావాల్సి వచ్చింది. ఆటపాటలతో సాగాల్సిన ప్రాయంలో  యుద్ధం మధ్య, చిన్న బ్రెడ్డు ముక్క కరువై పేగులు లుంగలు చుట్టుకుపోతుండగా... నాజీల నరమేధానికి ఏరులై పారిన యూదుల నెత్తుటి ప్రవాహాలు, శవాల గుట్టలను, నాజీల ఇనుప బూట్ల కింద నలిగిపోతున్న మాన వత్వాన్ని చూస్తూ కూడా స్వేచ్ఛా కాంక్షను, జీవితేచ్ఛను, రేపటిపై ఆశను గానం చేసింది.

 అందుకే ఆ చిన్నారి పసి హృదయంపై ఆ చీకటి రోజుల ముద్రలను నమోదు చేసిన ఆమె  జీవితం, ప్రత్యేకించి ఆమె ‘డైరీ’ దశాబ్దాలుగా ఎందరినో ప్రభావితం చేస్తోంది. నల్ల సూరీడు నెల్సన్ మండేలా వారిలో ఒకరు. ఆయన  ‘‘ఆన్‌ఫ్రాంక్ డైరీని నాతో పాటు చాలా మందిమి చదివాం. ఈ పుస్తకాన్ని నేను జైలుకు వెళ్లక ముందు చదివాను. మళ్ళీ దక్షిణాఫ్రికాలోని రాబెన్ దీవిలోని జైల్లో చదివాను. బయట చదివిన దానికి, జైల్లో ఖైదీగా చదివిన దానికి ఎంతో తేడా ఉంది. ఆ పుస్తకం నిండా మా జీవితాలే ఉన్నట్టు భావించి, దానితో మేమూ మమేకమయ్యాం. అతి చిన్న వయస్సులో ఆ అమ్మాయి చూపిన ఆత్మ విశ్వాసం నన్ను నిబ్బరంగా నిలిచేట్టు చేయగలిగింది. జర్మనీలో నాజీ జాత్యహంకారం మైనారిటీలుగా ఉన్న యూదులతో సహా లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నది. ఆన్‌ఫ్రాంక్ ప్రదర్శించిన ధైర్యం మానవ హక్కుల ఉద్యమానికి అజరామరమైన స్ఫూర్తిని అందించింది.’’

 చీకటి రోజుల్లోకి...
 జర్మనీకి చెందిన ఆన్ ఫ్రాంక్ పదమూడో పుట్టిన రోజు (1942 జూన్ 12) కానుకగా లభించిన చిన్న నోట్ బుక్... ఆన్ ఫ్రాంక్ డైరీగా 70 భాషల్లో కోట్లలో ప్రతులు అమ్ముడుపోయి చరిత్రను సృష్టించింది. యుద్ధం, జాత్యహంకారం పదిహేనేళ్లకే చిదిమేసిన ఆ చిన్నారి 1929లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌లో జన్మించింది. 1933 సార్వత్రిక ఎన్నికల్లో అడాల్ఫ్ హిట్లర్ నేషనలిస్టు సోషలిస్టు జర్మన్ వ ర్కర్స్ పార్టీ (నాజీ)అధికారంలోకి వచ్చింది. ఆర్యన్ జాతి మాత్రమే సంకరం కానిదని, అన్ని జాతులకన్నా అదే పవిత్ర మైనదని, పాలించే హక్కు దానిదేనని నాజీలు బహిరంగంగానే ప్రకటిం చింది. అందుకనుగుణంగా పాఠ్యాంశాలను, పుస్తకాలను, చరిత్రను తిరగ రాయించారు. ప్రత్యేకించి మైనారిటీలుగా ఉన్న యూదులపట్ల విష పూరిత ద్వేషాన్ని నింపారు, అన్ని కళలలోనూ, సంస్కృతిలోనూ జర్మన్ జాత్య హంకారాన్ని నింపారు.   

జర్మన్ యువతకు  విపరీత జాత్యహంకారాన్ని నూరిపోసి, ఎంతటి క్రూరత్వానికైనా పాల్పడేలా వారి మనసులను కలుషితం చేశారు. వారితో హిట్లర్ ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి... శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులపై హింసను, హత్యాకాండను ప్రేరేపించాడు. 1933లోనే మొట్టమొదటి నిర్బంధ శిబిరం ప్రారంభమైంది. సరిగ్గా ఆ సమయంలోనే కుటుంబ వ్యాపారం జీవనాధారంగా బతికే యూదులైన ఆన్ ఫ్రాంక్ కుటుంబం జర్మనీ నుంచి నెదర్లాండ్స్‌కు పారిపోయింది. ఆమ్‌స్టర్‌డాంలో మళ్లీ వ్యాపారం మొదలు పెట్టిన ఆ కుటుంబం ఎంతో కాలం ప్రశాంతంగా బతికింది లేదు. 1940లో నాజీ జర్మనీ, నెదర్లాండ్స్‌ను ఆక్రమించింది.

 

ఆన్‌ఫ్రాంక్ తండ్రి అమెరికాకు వలస వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ 1941 జూన్ నాటికే అమెరికా  వలసలను నిలిపివేసింది. దీంతో ఆన్‌ఫ్రాంక్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ తన కుటుంబం అజ్ఞాతంలో బతికే ఏర్పాట్లు చేశాడు. ఒట్టో ఫ్రాంక్ పెద్ద కూతురు మార్గట్‌ను నాజీ నిర్బంధ శ్రమ శిబిరానికి పంపాలని 1942 జూలైలో సైనిక ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. దీంతో తల్లిదండ్రులు, అక్కలతో కలిసి ఆన్ 1942, జూలై 6 నుంచి 1944, ఆగష్టు 4న అరెస్టయ్యేవరకు అదే పట్టణం లోని ఒక చిన్న ఇంటిలోని రహస్యమైన అటకలాంటి ప్రదేశంలో అజ్ఞాత జీవితం గడిపారు. ఆన్ ఫ్రాంక్ డైరీ అక్కడే రూపుదిద్దుకున్నది.

 పసి హృదయంపై జాత్యహంకారం గురుతులు
 నాటి పరిస్థితులు నిష్కల్మషమైన ఒక అమాయకపు పసి హృదయంపై వేసిన ముద్రలకు మించిన సజీవ చరిత్ర రచన మరేముంటుంది? ‘‘జర్మన్లు ఆక్రమించుకోవడంతో మా బాధలు మొదలయ్యాయి. యూదులను హింసించే చట్టాలు కూడా చేశారు. యూదులు ప్రత్యేకంగా కనిపించాలి. పసుపు నక్షత్రాలు ధరించాలి. యూదులు సైకిళ్ళపైనే తిరగాలి. ట్రాములు ఎక్కకూడదు. కార్లు ఉన్నా వాటిలో తిరగరాదు. సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యనే షాపింగ్ చేయాలి. అదీ వారికి కేటాయించిన షాపుల్లోని వస్తువులనే కొనుగోలు చేయాలి. మంగలి షాపులు, బ్యూటీ క్లినిక్‌లు కూడా అంతే. రాత్రి 8 నుంచి పొద్దున ఆరు వరకు ఇండ్ల నుంచి బయటకు రాకూడదు.

సినిమాలు, నాటకాల లాంటి వినోదాలకు వెళ్ళకూడదు. ఎటువంటి క్రీడల్లో పాల్గొనరాదు. స్వంత తోటలలోనైనా, స్నేహితుల తోటలలోనైనా రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎటువంటి గోష్టులు, సమావేశాలు జరపకూడదు. యూదుల ఇళ్ళలోకి క్రైస్తవులను రానివ్వరాదు. యూదుల పిల్లలు వాళ్ళు నడిపే పాఠశాలల్లోనే చదవాలి. మీరు ఇది చెయ్య కూడదు. అది చెయ్యకూడదు. అడుగడుగునా ఆంక్షలే మమ్మల్ని వెంటాడు తున్నాయి. కానీ జీవితం సాగుతూనే ఉన్నది.’’ కిట్టీని ఉద్దేశిస్తూ ఆన్ ఫ్రాంక్ రాసింది. ఎవరో ఒకరితో మాట్లాడినట్లు రాయకపోతే తనకు బాగుండదని అభిప్రాయపడిన ఆన్ ఫ్రాంక్  ‘కిట్టీ’గా తనని తానే సంబోధించుకుంది.  

 ‘‘కింద పెద్ద షాపుంది. దాన్ని స్టోర్‌గా వాడతారు. ఇంటి ముఖద్వారం పక్కనే ఆ షాపు తలుపుంది. ప్రవేశానికి ఎదురుగా నిటారుగా ఉన్న మెట్ల వరుస ఉంది. ఎడమవైపున్న సన్నని వరండా ఒక గదిలోకి తీసుకెళుతుంది. అదే ఫ్రాంక్ కుటుంబం బెడ్‌రూం. మూలనున్న తలుపు తీస్తే మరుగుదొడ్డి, మరో తలుపుతీస్తే, నేనూ, మార్గెట్ ఉండే గది. భవనానికి ముందు వైపు ఒక అటక, ఒక కొట్టు. అదీ మేముండే రహస్యమైన గృహానుబంధ భాగం (ఎనెక్స్)’’ అంటూ ఆన్ ఫ్రాంక్ తమ రహస్య నివాస స్థలాన్ని వివరించింది. ఆ ఇరుకు స్టోర్ రూంలోనే దాదాపు మూడేళ్లు ఫ్రాంక్ కుటుంబం సహా ఎనిమిది మంది ఉన్నారు. మరుగుదొడ్డి, బాత్‌రూంలు కూడా తాత్కాలికంగా ఏర్పర్చుకున్నవే. తిండికి, మందులకు ఎంతో అవస్థ పడ్డారు.

 

అదే సమయంలో జర్మనీలో, నెదర్లాండ్‌లో, ఇతర యూరప్ దేశాల్లో యూదులు, ఇతర మైనారిటీ జాతులు, మతస్తులు, రాజకీయ ప్రత్యర్థులు లక్షలాది మంది జైళ్ళల్లో, నిర్బంధ శిబిరాల్లో బందీలయ్యారు. అప్పట్లో భార్యల నుంచి భర్తలను, తల్లిదండ్రుల నుంచి పిల్లలను, అక్కచెల్లెళ్ళను,  అన్నదమ్ములను వేరు చేసి నిర్దాక్షిణ్యంగా, అత్యంత కిరాతకంగా హత్య చేసిన వైనం ఆ డైరీలో ఉంది. 1945లో జర్మనీ ఓటమి పొందే నాటికి దాదాపు 90 లక్షల మంది యూదులు ఊచకోతకు గురైనట్టు అంచనా. పోలండ్‌లో 1939లో 33 లక్షలుగా ఉన్న యూదు జనాభా యుద్ధం ముగిసేనాటికి 20 వేలకు పడిపో యిందంటే నాటి జాత్యహంకార విద్వేషం ఎంతటి నరమేధాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

 నాజీ నరమేధంలో రాలిన శాంతి కపోతం
 జాత్యహంకారానికి బలైన ఐదు లక్షల మంది యూదు బాలలలో ఆన్‌ఫ్రాంక్, ఆమె అక్క మార్గెట్ ఫ్రాంక్ కూడా ఉన్నారు. రహస్య జీవితంలో ఉండగానే ఎవరో ద్రోహులు ఇచ్చిన సమాచారం వల్ల పోలీసులు, జర్మన్ సైనికులు 1944, ఆగస్టు 4న  వాళ్ళు తల దాచుకున్న ఇంటిని చుట్టుముట్టి వారిని అరెస్టు చేశారు. ఆన్ ఫ్రాంక్ తల్లిదండ్రులను వేర్వేరు నిర్బంధ శిబిరాలకు తర లించారు.  మార్గట్, ఆన్‌లను మరొక శిబిరంలో నిర్బంధించారు. ఆరు నెలల తర్వాత తల్లి, ఇద్దరు అక్కాచెల్లెళ్ళు టైఫస్ వ్యాధితో చనిపోయారు. 1945 సెప్టెంబర్‌లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి ఆన్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ మాత్రమే సజీవంగా మిగిలాడు. 1947లో డచ్ భాషలో ఆయన ఆన్ ఫ్రాంక్  డైరీని ప్రచురించారు. అది 1952లో ఇంగ్లిష్‌లో వచ్చింది. అందులోని ఈ వాక్యాలు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి: ‘‘నేను నా తల్లి లాగా, మిగతా అందరు ఆడవాళ్ళలాగా భర్త పిల్లల కోసం మాత్రమే బతకాలను కోవడం లేదు. ఇంకా ఏదో చేయాలని ఉంది. వృధాగా బతకడం నాకిష్టం లేదు. నేను అందరికీ ఉపయోగపడాలి. సంతోషపెట్టాలి. నేను నా చావు తర్వాత కూడా బతకాలి.’’ ఆమె రాసుకున్నట్టే ఆన్ ఫ్రాంక్ ఎప్పటికీ సజీవంగానే నిలిచింది.  

 ఆన్‌ఫ్రాంక్  డైరీని చదివినప్పుడల్లా రెండవ ప్రపంచయుద్ధం సంద ర్భంగా జరిగిన నరమేధానికి కారణమైన జాత్యహంకారం వికృతరూపం గుర్తు కొస్తుంది. జాతి, వర్ణ, మత, కుల పరమైన దురహంకారం ఎన్ని దారు ణాలకు ఒడిగడుతుందో, ఎంతటి నరమేధానికి కారణం కాగలదో అవ గతమ వుతుంది. ఈ నాటికీ ప్రపంచంలో ఇటువంటి ఆధిపత్య ధోరణులు, దురహం కారాలు ఇంకా బతికే ఉన్నాయన్నది వాస్తవం. దురహంకారం వివక్షకు, వివక్ష విద్వేషానికి, విద్వేషం వినాశనానికి దారితీస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం. ఆన్‌ఫ్రాంక్ స్ఫూర్తిగా ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా మనిషి... మానవత్వం, సత్యం కోసం నిరంతరం పోరాడాల్సిన సమయమిది.

మార్చి 12 ఆన్ ఫ్రాంక్ 71వ వర్ధంతి
http://img.sakshi.net/images/cms/2015-02/71423684436_295x200.jpg

 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య 
మొబైల్: 97055 66213
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement