
ఈ ఉన్మాదం ఇంకెన్నాళ్లు?
విశ్వాసాలతో ముడిపడిన హింసకు సంబంధించి నెలరోజుల వ్యవధిలో మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడవలసి వచ్చింది. ప్రత్యేకించి హరియాణా, పంజాబ్, ఢిల్లీల్లో భయానక హింస జరగడానికి కారణమైన బాబా గుర్మీత్ సింగ్ ఉదంతంలో ఆయన మూడు రోజుల వ్యవధిలోనే రెండో దఫా మాట్లాడక తప్ప లేదు. విశ్వాసాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదని ‘మన్ కీ బాత్’లో జాతినుద్దేశించి మాట్లాడుతూ హెచ్చరించారు.
ఏ దేశంలోనైనా పౌరు లందరికీ సమానంగా వర్తించే చట్టాలే ఉంటాయి. ఆ చట్టాలను ఎంత ఉన్నతస్థాయి లోని వారైనా, సామాన్యులైనా గౌరవించాల్సిందే. అవి తమకు వర్తించబోవని చెప్పినా, ఆ చట్టాలున్న సంగతే తమకు తెలియదని చెప్పినా అది చెల్లదు. ఒక వ్యక్తి లేదా గుంపు చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉన్నదని సమాచారం అందినప్పుడు దాన్ని నిరోధించడం... అయినా చోటు చేసుకుంటే తగిన విధంగా స్పందించి చర్య లకు ఉపక్రమించడం శాంతిభద్రతల యంత్రాంగం చేయాల్సిన పని. ఇదంతా సవ్యంగా అమలవుతున్న చోట ఎవరూ వికృత పోకడలకు పోయే ప్రయత్నం చేయరు. సాధారణ పౌరుల్లో సైతం ప్రభుత్వాలపట్ల నమ్మకమూ... చట్టాలంటే గౌరవమూ ఏర్పడతాయి. కానీ డేరా సచ్చా సౌదా అధిపతి బాబా గుర్మీత్‌సింగ్ రెండు అత్యాచారం కేసుల్లో, ఒక హత్య కేసులో శిక్షార్హుడని చెప్పిన వెంటనే మూడు రాష్ట్రాలు భగ్గున మండాయి. 38మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా వందలాదిమంది గాయపడ్డారు. భారీయెత్తున ఆస్తులు విధ్వంస మయ్యాయి.
హింసోన్మాదం ఏ స్థాయిలో ఉన్నదంటే నేరస్తుడికి ఎంత శిక్ష పడిందో ప్రకటించడానికి సోమవారం న్యాయస్థానమే జైలుకు తరలవలసి వచ్చింది. పంజాబ్, హరియాణాల్లో ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునివ్వడానికి మూడు రోజుల ముందునుంచే హరియాణా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించడం ప్రారంభించారు. ముందు జాగ్రత్త చర్యలను సూచించారు. కానీ జరి గిందేమిటి? వందలాదిమంది వీధుల్లోకొచ్చి వీరంగం వేస్తుంటే ప్రభుత్వాలు నిస్సహాయమయ్యాయి. పంజాబ్ ఎంతో కొంత నయం.
హరియాణా అయితే పూర్తిగా చేష్టలు డిగిపోయింది. ఇలాంటి దుస్థితి అంతర్జాతీయంగా మన పరువును బజారుకీడుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్రమోదీ అంతగా స్పందిం చారు. హింసాకాండ చెలరేగిన శుక్రవారం రాత్రే ఆయన మూడు ట్వీట్లు చేశారు. హింసను తీవ్రంగా ఖండించడంతోపాటు పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తున్నదని ప్రజలకు హామీ ఇచ్చారు. రెండోసారి ఆదివారం ‘మన్ కీ బాత్’లో ఆయన పరోక్షంగా డేరా విధ్వంసాన్ని ప్రస్తావించారు. తప్పు చేసినవారిని వదిలేది లేదని హెచ్చరించారు. గత నెలలో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో సైతం ఆవు పేరిట వివిధ ప్రాంతాల్లో సాగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీ పుట్టిన గడ్డపై జన్మిం చామన్న స్పృహను కూడా ఈ హింసకు పాల్పడేవారు కోల్పోతున్నారని ఆయన విమర్శించారు.
ప్రభుత్వాలు పకడ్బందీగా ఉన్నచోట, చట్టపాలన సవ్యంగా సాగుతున్నచోట ప్రైవేటు వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సాహసం చేయరు. అది లేకపోబట్టే కొందరు చెలరేగుతున్నారు. సాక్షాత్తూ డిప్యూటీ అడ్వొకేట్ జనరల్ స్థాయిలో ఉన్న వ్యక్తి శిక్షపడిన గుర్మీత్‌తో కలిసి న్యాయస్థానానికి రావడం మాత్రమే కాదు... ఆయనగారి సూట్‌కేసును కూడా మోశారంటే కారణమెవరు? గుర్మీత్‌ను అదుపులోకి తీసుకోవడానికెళ్లిన పోలీసులను ఆయనకు భద్రత కల్పిస్తున్న కమాండోలు ప్రతిఘటించడం దేన్ని సూచిస్తోంది? స్వయంగా కేంద్ర హోంమంత్రి చాలా ముందుగా సీఎంలతో మాట్లాడినా ఫలితం లేకపోవడం ఎందువల్ల? అన్నిటికీ ఒకటే జవాబు... పాలకులు సక్రమంగా లేకపోవడం వల్ల! పదిహేనేళ్ల క్రితం అప్పటి ప్రధాని వాజపేయికి ఇద్దరు మహిళలు రాసిన లేఖ రాస్తే, దానిపై విచారణ జరిపించాలని ఆయన సీబీఐకి ఆదేశాలిస్తే నేరగాడికి శిక్ష పడటానికి ఇన్నేళ్లుపట్టింది.
ఈలోగా ఆ ఇద్దరు మహిళలకూ సాయపడ్డాడన్న అనుమానంతో డేరా సంస్థల వ్యవహారాలు చూసే మేనేజర్ ఒకరిని ‘గుర్తు తెలియని వ్యక్తులు’ హతమార్చారు. ఆ ఉదంతంపై పరిశోధన సాగించే పాత్రికేయుడు సైతం అదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. వీటితోపాటు అనేక ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో గుర్మీత్ నిందితుడు. కానీ పాలకులుగా ఉన్నవారు మాత్రం ఈ పదిహేనేళ్లనుంచీ ఆయన ఆశ్రమం ముందు సాగిలపడ్డారు. నోరారా కీర్తించారు. ఆయనతో వేదికలు పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నరరూప రాక్షసుడు నయీముద్దీన్‌తో అధికారంలో ఉన్నవారు అంటకాగినట్టే ఇదంతా సాగింది. స్వయంగా వాజపేయి స్థాయి నాయకుడే తనకొచ్చిన ఫిర్యాదులు చూసి ఆందో ళనపడి విచారణకు ఆదేశించినా ఆ పార్టీకి చెందిన నేతలకు జ్ఞానోదయం కాలేదు. అప్పట్లో విపక్షంగానూ, ఆ తర్వాత అధికార పక్షంగానూ ఉన్న కాంగ్రెస్ నేతలు సైతం అలాగే ప్రవర్తించారు.
కనీసం శిక్షపడ్డాకైనా గుర్మీత్ ప్రవర్తనను తప్పు బట్టలేకపోయారు సరిగదా...బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఆయన ‘గొప్ప ఆత్మ’ అంటూ పొగిడారు. గోరక్షణ పేరుతో ఏర్పడి, హింసకు పాల్పడే బృందాలకు సైతం ఇలాంటి ప్రశంసలే లభిస్తున్నాయి. అందువల్లే ప్రధాని పదేపదే చెప్పినా ఫలితం ఉండటం లేదు. హింసకు పాల్పడేవారిని వెనువెంటనే అరెస్టు చేయలేక పోవడం, చేసినా కఠినమైన సెక్షన్లకింద కేసులు పెట్టలేకపోవడం చాలాచోట్ల కనబడుతోంది. కనుక ప్రకటనలతో సరిపెట్టకుండా సీఎంల, హోంమంత్రుల సమావేశం ఏర్పాటుచేసి చట్టబద్ధ పాలనపై శ్రద్ధవహించాలన్న సంగతి ప్రధాని గుర్తుచేయాలి. పార్టీలకతీతంగా వ్యవహరించమని హితవుచెప్పాలి. సంతృప్తిక రంగా లేనివారి లోపాలు ఎత్తి చూపాలి. లేనట్టయితే ఇలాంటి ఉదంతాలకు అంతూ పొంతూ ఉండదు.