మైడియర్ షేక్‌స్పియర్
విలియం షేక్‌స్పియర్ (ఏప్రిల్ 1564-ఏప్రిల్ 23, 1616) ఇంగ్లిష్ మహా నాటకకర్త, కవి. ఏప్రిల్ 23న 400వ వర్ధంతి. ఈ సందర్భంగా బ్రిటిష్ కౌన్సిల్ అనే సంస్థ యూగవ్ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. పదిహేను దేశాలలో 18 వేల మంది ఇందులో పాల్గొన్నారు. చిత్రం ఏమిటంటే ఆయనని అర్థం చేసుకోవడంలో, ఇష్టపడడంలో, ఆయన రచనలు నేటి కాలానికి వర్తిస్తాయని నమ్మడంలో ఇంగ్లిష్‌వాళ్లు వెనకపడిపోయారని తేలింది.
షేక్ స్పియర్‌ని అర్థం చేసుకోగలిగామని చెప్పిన భారతీయులు 83 శాతం. ఆ మాట ఇంగ్లండ్‌లో చెప్పినవాళ్లు 58 శాతం. ఆయనంటే మేము చాలా ఇష్టపడతామని 88 శాతం మెక్సికన్లు చెబితే, ఆ మాట ఇంగ్లండ్‌లో 59 శాతమే చెప్పారట. ఆయన రచనలలో నేటికీ ప్రాసంగికత ఉందని 84 శాతం బ్రెజిల్ జాతీయులు చెప్పారు. ఆ మాట ఇంగ్లండ్‌లో 57 శాతం మంది మాత్రమే చెప్పారు. మొత్తంగా చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలోనే షేక్‌స్పియర్‌కు అపారమైన అభిమానులు ఉన్నారు.
నిజానికి మన తెలుగువాళ్లకి కూడా షేక్‌స్పియర్ అంటే బాగా అభిమానమే. గురజాడ అయితే గిరీశం చేతే ఏమివాయ్ మైడియర్ షేక్‌స్పియర్ అనిపించాడు. ఆ పాత్ర నోటి నుంచే రెండుమూడు సార్లు మహాకవి ప్రస్తావన చేయించాడు మన మహాకవి. ఆయన రాసిన విషాదాంత నాటకాలు, సుఖాంతాలు ఈనాటికీ ప్రపంచ రంగస్థలం మీద దర్శనమిస్తూనే ఉన్నాయి. వెండితెర మీద నర్తిస్తూనే ఉన్నాయి. నమ్మకద్రోహానికి ప్రత్యామ్నాయ వ్యక్తీకరణగా ‘యూ టూ బ్రూటస్’ అన్న షేక్‌స్పియర్ సంభాషణా శకలాన్ని ఉపయోగించడం పరిపాటి. అలాగే డోలాయమాన స్థితిలో ఉండేవారి గురించి చెప్పే ‘టుబి ఆర్ నాట్ టుబీ’ కూడా అలాంటిదే. ఇంకా ఎన్నో!