‘ఉచితం! ఉచితం!’
ఈ మధ్య మన దినపత్రికలు రంగు రంగుల ‘జాకెట్ల’తో కళకళలాడుతూ పాఠకులకు కనువిందునూ, పత్రికాధిపతులకు కోశ పుష్టినీ కలిగిస్తు న్నాయి. కారణం వ్యాపార ప్రకటనల పండుగ హడా వుడి. ఈ హడావుడీ, కళ కళా ఆర్థిక వ్యవస్థ చురుకు దనాన్ని సూచిస్తాయి కనుక ఇది ఒక రకంగా క్షేమక రమే. ప్రకటన కర్తలు ఎంత ప్రతిభ చూపినా, ఎన్ని కలల లోకాలను కళ్లకు కట్టినా, పాఠకులను అన్నిటి కంటే ఎక్కువ ఆకర్షించేది మాత్రం ‘ఉచితం!’ మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారు లను ఆకర్షించే అయస్కాంతం ‘ఉచితం!’ అనే తారక మంత్రం. ‘అది కొంటే, ఇది ఉచితం!’ ‘రెండు కొంటే ఒకటి ఉచితం!’ లాంటి ఆకర్షణలు లేకపోతే ఎంత గొప్ప ప్రకటనలైనా సీదా సాదాగా కనిపిస్తాయి. కన్ను ఆగదు.
ఈ ప్రకటనలలో ‘ఉచితం’ అంటే ప్రకటన కర్తలు చెప్పేదీ, పాఠకులకు అర్థమయ్యేదీ డబ్బు ఇవ్వనక్కర లేకుండా లభించేది, ఊరికే దొరికేదనే. చిత్రమేమిటంటే, ‘ఉచితం’ అంటే ఈ అర్థం మొన్న మొన్నటి దాకా, అంటే వ్యాపార ప్రక టనలు వ్యాప్తిలోకి వచ్చేదాకా ఉన్నట్టు కనిపించదు. ప్రముఖ నిఘంటువులలో, ‘ఉచితం’ అనే మాటకు ‘ఫ్రీ’ అనే అర్థం కనపడదు. ‘ఉచితం’ అనే సంస్కృత పదా నికి తగినది, సరైనది, సంప్రదాయ సిద్ధమైనది, హేతుబద్ధమైనది అనే అర్థాలే కనిపిస్తాయి. ‘ఉచితజ్ఞు’ డయిన మహాకవి కాళిదాసు, ‘ఉచిత’ పదాన్ని తర చుగా ఉపయోగిస్తాడు. కానీ ‘రెండు కొంటే ఒకటి ఉచితం’ లాంటి అర్థంలో కాదు. ‘శుభ సమయంలో ఇలా రోదించటం నీకు ఉచితం కాదు’ అని శకుంత లను ఊరడించటం శాకుంతలం నాటకంలో కనిపి స్తుంది. రఘు వంశ కావ్యంలో, వశిష్ఠాశ్రమంలో లేడి పిల్లలు ‘నీవార భాగదేయ ఉచితాలు’– ఋషుల ఇళ్ల లోని నివ్వరి ధాన్యంలో తమదైన భాగం పొందేందుకు అర్హత కలిగినవి. ‘రక్త చందనోచితు’డైన ఈ వృకోద రుడు ఇలా అడవిలో దుమ్ము కొట్టుకొని ఉంటే చూస్తున్న నీకు బాధ కలగటం లేదా?’ అంటుంది భారవి కావ్యంలో ద్రౌపది, ధర్మరాజుతో.
తెలుగు నిఘంటువులలో కూడా ‘ఉచితం’ అనే మాటకు, తగినది, అలవాటుపడినది, పరిచితం, మితం లాంటి అర్థాలు మాత్రమే కనిపిస్తాయి. ‘ఉచితా హారము వల్లనె,/ఉచితంబుగ బుద్ధి స్థిరత ఒప్పుట వలనే,/ఉచిత గురు బోధ వల్లనె,/సుచరితుడై పరము గాంచు సుమ్ముర వేమా!’ అనే వేమన పద్యంలో, ఉచితం అనే మాటకు, ‘డబ్బివ్వకుండా లభించేది’ అని అర్థం చెప్పటం అనుచితం.
శ్రీ కృష్ణ పరమాత్మ శిరస్సును, సత్యభామ తన ఎడమకాలితో తొలగదోస్తే, ‘అట్లయగు! పేరలుకన్ చెందినయట్టి కాంతలు ఉచిత వ్యాపారముల్ నేర్తురే!’ అని ప్రశ్నించి. సమర్థిస్తాడు ముక్కు తిమ్మన. పట్టరానంత కోపం వచ్చిన మానినీ మణుల మాటేమో కానీ, మామూలు మహిళలకు మాత్రం ‘ఉచిత’ వ్యాపా రాల గురించిన అవగాహన మగవారితో సమానం గానే ఉంటుందంటారు అనుభవజ్ఞులైన వ్యాపారులు.
(వ్యాసకర్త : ఎం. మారుతి శాస్త్రి )