ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష
హోదా అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించండి
►ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు ఇది
► విభజన చట్టంలో హామీలు అమలు జరిపించండ
► విభజన చట్టాన్ని తెలంగాణ ధిక్కరిస్తోంది
► రాయలసీమ కష్టాలు చూడండి
► ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయండి
► రాష్ట్రపతికి ఐదుపేజీల విన్నపం ఇచ్చిన జగన్
ఏపీకి ప్రత్యేక హోదా అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని, ఐదు కోట్ల ఆంధ్రుల భవితతో ముడివడి ఉన్న అతి ముఖ్యమైన అంశమని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సోమవారం రాత్రి పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, బుట్టా రేణుకలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఐదు పేజీల వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ఇవీ..
ఆంధ్రప్రదేశ్ విభజన మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిం దని గతంలో అనేక సందర్భాల్లో మీ దృష్టికి తెచ్చాం. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలను సస్పెండ్ చేసి, లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలుపుదల చేసి బిల్లును ఆమోదింపజేసుకున్నారు.
→ హైదరాబాద్ కేవలం రాజకీయ రాజధానిగా మాత్రమే కాకుండా అనేక పబ్లిక్ రంగ సంస్థలతో ఆర్థికపరంగా శక్తిమంతమైన కేంద్రంగా అభి వృద్ధి చెందింది. 60 ఏళ్లుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోవడంతో నూతన ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా అన్యాయం జరిగింది.
→రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు జరిగిన ఉద్యమంలో మా పార్టీ ముందు వరసలో ఉంది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, అన్ని రాజకీయ పార్టీ లకు మేం విజ్ఞప్తిచేశాం. హైదరాబాద్ నగరం, నీళ్ల పంపకాలు, రెవెన్యూ పంపిణీ, కొత్త రాజధాని వ్యయం, సామాజిక, పారిశ్రామిక మౌలిక వసతుల ఏర్పాటు వంటి అనేక సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపకుండా విభజన తగదని చెప్పాం. అయినా రాష్ట్రాన్ని విభజించారు.
→ప్రత్యేక ప్యాకేజీ, ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా అన్న నాటి ప్రధాన మంత్రి హామీ కారణంగా బీజేపీ విభజన బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక హోదాను తాము పదేళ్లకు వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. నూతన పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే మూడేళ్లు పడు తుందని, పదేళ్లు వర్తింపజేస్తేనే ఆయా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహ కాలు అందుతాయని చెబుతూ తాము అధికారంలో వచ్చాక పదేళ్లు ఇస్తా మంది.
→ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ, బీజేపీ ఈ అంశాన్ని పెట్టి ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నాయి. విద్యావంతుల్లో మెజారిటీ ప్రజలు బీజేపీ, టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని నమ్మారు. రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు కేంద్రం 2 మార్చి 2014న కేబినెట్ తీర్మానం కూడా చేసింది. ఐదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని కేబినెట్ ప్రణాళిక సంఘానికి మార్గదర్శనం చేసింది.
→అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం సాకులు చూపుతూ వచ్చింది. యూపీఏ ప్రభుత్వం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఈ అంశాన్ని పొందుపరచనందున ప్రస్తుతం కష్టంగా మారిందని చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తోందని మరికొందరు చెబు తున్నారు.
→గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏనాడూ పార్లమెం టులో చట్టం చేయలేదు. అది కేవలం కేబినెట్ ద్వారా తీసుకున్న నిర్ణయమే. ఒకవేళ అలా ఏదైనా చట్టం చేసి ఉంటే ప్రభుత్వం చూపాలి.
→14వ ఆర్థిక సంఘం స్పెషల్ కేటగిరీ స్టేటస్‌కు వ్యతిరేకమని చెప్పడం సరికాదు. ఆ సంఘం ఇచ్చిన నివేదిక ప్రత్యేక హోదా అమలుపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. వాళ్లకు ఆ అధికారం కూడా లేదు. పైగా ఆ సంఘం సభ్యులు కూడా ఈ సంగతి చెప్పారు. ఆ 11 రాష్ట్రాలకు అంతకుముందూ ప్రత్యేక హోదా ఉంది. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలవు తున్న కాలంలోనూ ఉంది.
→ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన మాట మేరకు ప్రత్యేక హోదా అమలుచేయాలని ఇటీవల ఈ అంశంపై రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు అన్ని రాజ కీయ పార్టీలు డిమాండ్ చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం సానుకూ లంగా నిర్ణయం తీసుకోవడం లేదు.
→ బిల్లు ఆమోదానికి షరతుగా పార్లమెంటులో చేసిన హామీలను పాలకులు తమకు సౌకర్యవంతంగా మరిచిపోతే ప్రజలు పార్లమెంటరీ ప్రజాస్వా మ్యంలో నమ్మకం కోల్పోతారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న షరతుతో విభజన బిల్లు ఆమోదం పొందింది. ఈ షరతు నెరవేరకపోతే ఆ బిల్లుకు కూడా విలువ లేదు.
→ ఇది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుతో ముడివడి ఉన్న అతిముఖ్యమైన అంశం ఇది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వండి.
హామీలు అమలయ్యేలా చూడండి...
→ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇతర హామీలు కూడా ఉన్నాయి. పోలవరం సత్వర నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, తెలంగాణలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ-చెన్నై పారిశ్రామి కారిడార్, ఖమ్మంలో స్టీల్ ప్లాంటు, వైఎస్సార్ జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు, వైజాగ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, తెలం గాణలో రోడ్డు ప్రాజెక్టుల ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. కానీ ఏవీ అమలు కాలేదు. ప్రభుత్వం అన్ని హామీలు అమలుచేసేలా మీరు జోక్యం చేసుకోండి.
→ ఏడు వెనకబడిన జిల్లాలకు ఏటా కేవలం రూ.50 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఈ నిధులతో ఏం అభివృద్ధి జరుగుతుంది? పైగా వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చి బీఆర్‌జీఎఫ్ నిధులను రద్దు చేశారు. పోల వరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ఎలాంటి ప్రగతి లేదు. 2016-17 బడ్జెట్‌లో కేవలం రూ. 100 కోట్లు కేటాయించారు. ఈతీరును చూస్తే కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుపై ఇతర ఆలోచనలు ఉన్నట్టు అనుమా నించాల్సి వస్తోంది. అందువల్ల పోలవరం ప్రాజెక్టును ఒక కాలపరిమితితో కనీసం వచ్చే మూడేళ్లలోనైనా పూర్తిచేసేలా కేంద్రాన్ని ఆదేశించండి.
తెలంగాణ చట్టాన్ని ధిక్కరిస్తోంది..
→ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84(3) నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ధిక్కరిస్తూ కృష్ణా, గోదావరి నదుల మీద అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టేందుకు చర్యలు చేపడుతోంది. ఇవి దీర్ఘకాలంలో దిగువ రాష్ట్రమైన ఏపీని బలహీన పరిచే చర్యలు. ఇప్పటికే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ప్రాంతం పూర్తిగా ఎండిపోయిన పరిస్థితిలో అక్కడి రైతులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. గోదావరి ద్వారా కూడా నీళ్లు తక్కువగా రావడంతో ఇటీవలికాలంలో తొలిసారిగా ఏపీలో రైతులు రబీ పంట నష్టపోయారు.
→ఏళ్లకు ఏళ్లు కరువును ఎదుర్కొనే రాయలసీమ ప్రాంతం అనేక ఏళ్లుగా తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. అనంతపురం జిల్లా దేశంలో రాజస్థాన్ లోని జైసల్మేర్ తరువాత రెండో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా. ‘దేశంలోని ఫెమైన్(క్షామం) పటంలో రాయలసీమ జిల్లాలు ఒక నల్లని మచ్చగా ఉన్నాయి. తరచుగా వచ్చే ఈ క్షామం(కరువు)తో రైతులు చితికిపోయి పేదరికంలో మగ్గే దుస్థితికి చేరుకున్నారు. ఒక కరువు నుంచి బయటపడేలోపే ఇంకో కరువులో మగ్గే పరిస్థితి దాపురించింది..’ అని ‘ఫెమైన్స్ ఇన్ ఇండియా’ అన్న పుస్తకంలో బి.ఎన్.గంగూలీ పేర్కొన్నారు.
→వరుస కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని 1952లోనే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సందర్శించారు. గంజి కేంద్రాల్లో భూస్వాములు కూడా వరసలో నిల్చోవడం చూసి నెహ్రూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.
→ ఏడాదిలో ఒక పంటకైనా నీళ్లిస్తే రాయలసీమ ప్రాంత సమస్య కొంతమేర పరిష్కారమవుతుంది. ఏపీ విభజన అనంతరం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల నీటి అవసరాలను గుర్తించేలా, ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమ అవసరాలను చూసేలా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిశీలించేందుకు దాని కాలపరిమితిని పెంచాలి.
→విభిన్న రాష్ట్రాలకు జరిపిన కేటాయింపుల ఆధారంగా వార ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు చట్టబద్ధంగా నీటిని విడుదల చేసేలా చర్యలు తీసు కోవాలి. లేదంటే వరద వస్తే తప్ప అన్ని ప్రాంతాలకు నీళ్లు రావు.
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయండి
→1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తెచ్చుకున్నాం. 2003లో మళ్లీ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూలును సవరించుకున్నాం. ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ద్వారా ఒక పార్టీ నుంచి నెగ్గి మరో పార్టీలో చేరితో ఆ చట్టసభ సభ్యుడు అనర్హతకు గురవుతాడు.
→ టీడీపీ అనైతికంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వైఎస్సార్‌సీపీ నుంచి ఆ పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. పదవులు, డబ్బు ఆశ చూపి 20 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుంది. వీటిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ వద్ద ఫిర్యాదులు చేసినా స్పందించలేదు. అనర్హతకు సంబంధించిన పిటిషన్ల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడంతో అధికార పార్టీకే చెందిన స్పీకర్ ఎలాంటి చర్యలు తీసు కోరు. కోర్టులు స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోవడం లేదు. అందువల్ల ప్రజాస్వామ్య పరిరక్షణకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలి. అనర్హత వేటు వేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెట్టాలి. ఏపీలో జరిగిన ఫిరాయింపుల వెనక ఉన్న అవినీతిపై విచారణ జరిపించాలి.
సాక్షి, న్యూఢిల్లీ