
కులాన్ని మరచి దారి విడిచి..?
కొత్త కోణం
ఒక సామాజిక వ్యవస్థగా కులాన్ని అర్థం చేసుకుంటేనే దాన్ని నిర్మూలించగలం. ఈ అవగాహనా రాహిత్యం వల్లనే కమ్యూనిస్టులు కులవ్యవస్థకు వ్యతిరేకంగా సమగ్ర కార్యాచరణ కు దిగలేకపోయారు. కలిసివచ్చే శక్తులన్నిటితో ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో విఫలమయ్యారు. భారత దేశ చరిత్రంతా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల చరిత్రేనన్న అంబేద్కర్ విశ్లేషణను సైతం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో గత చరిత్రను విస్మరించి, భవిత కోసం చీకట్లో వెతుకులాట సాగించాల్సి వస్తోంది.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి తొమ్మిది దశాబ్దాలు దాటింది, నూరేళ్ళ పండుగకు చేరువవుతున్న ఈ సమయంలో మన దేశంలో కమ్యూ నిస్టు ఉద్యమ గమనాన్ని, పురోగమనాన్ని ఒక్కసారి పునరావలోకనం చేసుకో వడం అవసరం. తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎన్నో మలుపులను, మరెన్నో అనుభవాలను చవిచూసింది. మహాప్రవా హంగా ప్రారంభమైన ఉద్యమం అనేక పాయలుగా విడిపోయింది. అయినా అన్నిటి తల్లి వేరు మార్క్సిజమే. కమ్యూనిస్టు, మార్క్సిస్టు, మార్క్సిస్టు- లెనినిస్టు పార్టీలపైనా, వాటి కార్యాచరణపైనా రకరకాల అభిప్రాయాలు న్నాయి. ఏది ఏమైనా, భారత రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలపై కమ్యూనిస్టు ఉద్యమం ప్రభావం గణనీయంగా ఉంది. 1925లో ప్రారంభమైన కమ్యూనిస్టు ధార ఎన్నో ప్రవాహాలను సృష్టించింది. ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ మహా ప్రవాహంలోని ఒక జలపాతమే.
సైద్ధాంతిక అవగాహనే తప్పు
1970లలో మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం పేరుతో నూతన శక్తిగా ఆవిర్భవించిన నక్సలైటు పార్టీలు సైతం అన్ని రంగాల్లో తమదైన ముద్రను వేసి, మార్క్సిజానికి నూతన జవసత్వాలనందించాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలలో పలువాటిపై కమ్యూనిస్టు, మార్క్సిస్టు భావజాలం చెరగని ముద్ర ఉన్నదనడం నిస్సందేహం. కమ్యూనిస్టు పార్టీలను అంటిపెట్టుకొని ఉంటూ వచ్చిన ప్రజానీకంలో తొంభై శాతం అట్టడుగు వర్గాల నుంచి వచ్చినవారే... ప్రధానంగా దళితులు, ఆదివాసులు. అయితే కులం విషయంలో కమ్యూనిస్టులు అనుసరించిన విధానం సైద్ధాంతికంగా సరైనది కాదు.
ఫలితంగా ఈ శక్తులన్నీ క్రమేణా కమ్యూనిస్టు పార్టీలకు దూర మవుతూ వచ్చాయి. సీపీఐ, సీపీఎం నుంచి విప్లవ పార్టీల దాకా అందిరిదీ కులాన్ని ఒక సామాజిక సమస్యగా చూసే ధోరణే. కానీ ఒక సామాజిక వ్యవస్థగా కులాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటేనే దాన్ని నిర్మూలించే మార్గాలను కనుగొనగలం. కమ్యూనిస్టులు కులాన్ని వ్యవస్థగా గుర్తించి ఉంటే, వారి కార్యాచరణే వేరుగా ఉండేది. ఈ అవగాహనా రాహిత్యం ఫలితంగా.. కులవ్యవస్థకు వ్యతిరేకంగా సమగ్ర కార్యాచరణను రూపొందించుకోలేకపోయాయి. ఈ పోరాటంలో కలిసివచ్చే శక్తులన్నిటినీ గుర్తించి, ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో విఫలం చెందాయి. ఇక్కడే భారతదేశ సామా జిక వ్యవస్థను అర్థం చేసుకోవడంలో మన కమ్యూనిస్టు పార్టీలన్నీ విఫలమ య్యాయి. ‘ప్రపంచ చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే’ అని మార్క్స్ అన్నాడంటారే గానీ, భారత దేశ చరిత్ర అంతా కుల వ్యవస్థకు, ప్రత్యేకించి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల చరిత్రేనంటూ అంబేద్కర్ చేసిన విశ్లేషణను పరిగణనలోకైనా తీసుకోం. పర్యవసానంగా గత చరిత్రను విస్మరించి, భవిత కోసం చీకట్లో వెతుకులాట సాగిస్తున్నాం.
కుల వ్యతిరేక పోరాటల చరిత్రే
ఈ దేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవం 2,500 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుని నాయకత్వంలో జరిగింది. అశోకుడి పాలనలో అది వ్యవస్థీకృత మైంది. ప్రతీఘాతుక విప్లవం ద్వారా బ్రాహ్మణిజం లేదా నేటి హిందూ మతం తిరిగి ఆధిపత్యాన్ని సాధించింది. వర్ణ వ్యవస్థగా ప్రారంభమైన అంత రాల వ్యవస్థ కుల వ్యవస్థగా స్థిరపడింది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిరం తర పోరాటాలు జరిగాయి. మత సంస్కరణ ఉద్యమాలుగా కనిపించే అవి... బ్రాహ్మణిజాన్ని సవాలు చేసి, కుల వ్యవస్థ పునాదులనే ప్రశ్నించాయి.
క్రీస్తు శకం ఒకటవ శతాబ్దినాటి అశ్వఘోషుడి ‘వజ్రసూచి’ నుంచి, ఆ తర్వాతి కాలంలో బసవేశ్వరుడు, రామానుజుడు, కబీర్, నానక్, వేమన, బ్రహ్మం గారు, ఆధునిక కాలంలో ఫూలే, అయోతీదాస్, అయ్యంకాళి. నారాయణ గురు, భాగ్యరెడ్డి వర్మ, రామస్వామి నాయకర్, సాహు మహారాజ్‌ల ప్రతిఘటనోద్యమాలు ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. వీటి పునాదుల మీదనే, ప్రజాస్వామ్య వ్యవస్థ లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ సాగించిన పోరాటాలు కులవ్యవస్థను నైతికంగా దెబ్బతీయగలిగాయి. తరతరాలుగా సమాజంపై ఆధిపత్యం వహించిన మనుస్మృతిని పాతరేసి, సమానత్వ ప్రాతిపదికపై రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన నిర్వహించిన పాత్ర చిరస్మరణీయమైనది.
కుల వ్యవస్థను కూల్చే దారి ఇదే
కమ్యూనిస్టు, విప్లవ పార్టీలు సమస్యల ప్రాతిపదికపై కులానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాయి. పలు విజయాలను సైతం సాధించాయి. భూమి సమస్య, అంటరానితనం, వెట్టిచాకిరీ, కూలి రేట్ల సమస్యలపై ఆధిపత్య కులా లకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాయి. వాటినే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలన్నారు. అయితే ఇవేవీ హిందూ మతం పునాదులపై ఏర్పడిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలని అవి గుర్తించలేకపోవడం ఒక విషాదం. కాగా, సమాజాన్ని వ్యాఖ్యానించడం కాదు, దాన్ని మార్చడమెట్లా అనేదే ముఖ్యమని మార్క్స్ చెప్పినట్టే... కులవ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలను శోధించి, దాన్ని నిర్మూలించే కార్యక్రమాన్ని అందించినది అంబేద్కర్. కులవ్యవస్థ ప్రభావం, పరిణామాలపై ఆయన సవివరమైన వ్యాఖ్యానాలు చేశారు.
ఆధిపత్యం కొనసాగింపుగానే కులవ్యవస్థ ఉనికిలో ఉన్నదనీ, అది శ్రమ విభజనకు గాక, శ్రామికుల విభజనకు పూనుకున్నదనీ ఆయన తెలిపారు. ప్రజల మధ్య అది అంతరాల దొంతరలను తయారు చేసింది. వాటికి హెచ్చుతగ్గులను ఆపాదించి, ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయిం చడానికి అవసరమైన నియమాలనే ధర్మంగా చలామణి చేసింది. హిందూ మతం అందుకు తాత్విక భూమికను అందించింది. ఫలితంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో నిచ్చెన మెట్లలాంటి కులవ్యవస్థ పై మెట్టున ఉన్న కులాలకు ఆస్తి, అధికారం, హోదా, స్థాయి, జ్ఞానం మీద గుత్తాధిపత్యం లభించాయి.
సేవలు చేయడం, అట్టడుగున పడి ఉండడమే తమ పూర్వజన్మ కర్మగా భావించేట్టుగా కింది కులాల మెదళ్లను తయారు చేశారు. అందుకే మన దేశంలో కులాలను బట్టే పేదరికం, నిరక్షరాస్యత, నిరు ద్యోగం, అణచివేత, అనారోగ్యం, పంపిణీ జరిగింది. కులం అన్ని రంగా లనూ ప్రభావితం చేస్తున్నది. రాజకీయ రంగంలో సైతం కులాలను బట్టే హోదాలు లభిస్తున్నాయి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కొన్ని కులాల గుత్త సొత్తుగా మారాయి. జ్ఞానం కూడా కులం ప్రాతిపదికపైనే అందుబాటులోకి వస్తున్నది. ఒకరకంగా చెప్పాలంటే, కుల వివక్ష, అణచివేతలే మన దేశ ప్రాథమిక సమస్యలన్నిటి కీ కారణాలని చెప్పాల్సి ఉంటుంది. కులాన్ని సమాజంలో వేళ్లూనుకున్న ఒక వ్యవస్థగా అర్థం చేసు కోవాలి. అప్పుడు మాత్రమే కుల వ్యతిరేక పోరాటం బహుముఖంగా సాగాల్సి ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించగలుగుతాం.
కులాన్ని ఒక చిన్న సమస్యగా చూడడం వల్లనే విస్తృతంగా, లోతుగా పాతుకుపోయిన దాని వేళ్ళను గుర్తించడంలో విఫలం అవుతున్నాం. దీని నుంచి బయటపడాలి. ఇందుకు అంబేద్కర్ సిద్ధాంతాలే మార్గదర్శకాలు. ‘‘అధికారం అంటే ఆర్థికాధికారం ఒక్కటే అనే సిద్ధాంతాన్ని మానవ సమాజ చరిత్ర పరిశోధకులెవ్వరూ ఒప్పుకోరు. భారతదేశంలో పైసాలేని సాధువులకు కోటీశ్వరులు విధేయులై ఉండడమే దీనికి నిదర్శనం. మతం సమస్తాధికా రాలకు మూలాధారమనే సత్యాన్ని భారత చరిత్ర అంతా నిరూపిస్తూనే ఉంది’’ అన్న అంబేద్కర్ మాట అక్షర సత్యం.
అంబేద్కర్ ఆదర్శ సమాజమే మార్గం
కులాన్ని ఒక సమస్యగా భావించి, కుల వివక్ష, అణచివేతలను రాజకీయా ధికారం ద్వారా పరిష్కరించుకోవచ్చనే అభిప్రాయంతోనే కమ్యూనిస్టులు ఇంతవరకూ ఉన్నారు. అంబేద్కర్ దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ‘‘విప్లవానికి ముందే కుల వ్యవస్థతో కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఢీ కొనక పోతే, విప్లవం తరువాతయినా వారు దానితో తలపడక తప్పదు. మరొక విధంగా చెప్పాలంటే, నువ్వు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికడ్డంగా నిలబడే పెనుభూతం కులవ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారేస్తే తప్ప రాజకీయ సంస్కరణనుగానీ, ఆర్థిక విప్లవాన్నిగానీ సాధించలేవు’’ అంటూ ఆయన కుల వ్యవస్థ నిర్మూలన ప్రాధాన్యతను వివరించారు. అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక వర్గాలూ, సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులు, విప్లవకారులు కుల వ్యవస్థ నిర్మూలన ప్రాతిపదికపై ఉద్యమించాల్సిన అవసరమున్నది. అంబేద్కర్ ప్రతిపాదించిన ఆదర్శ సమాజం దానికి ఉమ్మడి ప్రాతిపదిక కాగలిగితే బాగుంటుంది.
‘‘కులం అక్కరలేదనుకుంటే మరి మీరు చెప్పే ఆదర్శ సమాజం ఎలాంటిదని ఎవరైనా అడిగితే, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు లక్ష్యాల మీద ఆధారపడిన సమాజమని నేనంటాను. ఆదర్శ సమాజం మార్పునకు అనుకూలమైనదిగా ఉండాలి. స్తబ్దుగా ఉండకూడదు. ఒక చోట మార్పు జరిగితే, ఆ మార్పు మిగతా విషయాలపైన ప్రభావం కలిగించాలి’’ అని ఆయన వివరించారు. ఆ ఆదర్శ సమాజం ప్రాతిపదికగా, కమ్యూనిస్టులూ, సామాజిక ఉద్యమాలూ, సంస్థలూ ఐక్యం కావాల్సిన అవసరమున్నది. ఈ తొంభై సంవత్సరాల కమ్యూనిస్టు అనుభవం నుంచి ఈ గుణపాఠాన్ని నే ర్వగలిగితే భారతదేశం దశ, దిశ మారుతాయి.
(వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213)