ఆ ‘రాక్షస’ వధతోనే నిత్య దీపావళి | opinion on Deepavali festival history by dileep reddy | Sakshi
Sakshi News home page

ఆ ‘రాక్షస’ వధతోనే నిత్య దీపావళి

Published Fri, Oct 28 2016 12:42 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

ఆ ‘రాక్షస’ వధతోనే నిత్య దీపావళి - Sakshi

ఆ ‘రాక్షస’ వధతోనే నిత్య దీపావళి

సమకాలీనం
కాలుష్యమైనా, మహిళలపై నేరాలయినా, సంపద ప్రదర్శనాతత్వమైనా... ప్రభుత్వం చట్టా నికి లోబడి చర్యలు తీసుకుంటుంది. అలా ఒత్తిడి తీసుకురావడం పౌరుల బాధ్యత. అదొక్కటే సరిపోదు. ఎవరికి వారు, ఇందుకు కారణమవుతున్న తమలోని రాక్షసుడ్ని వెతికి, తుదముట్టించాలి. స్వార్థంతో పర్యావరణానికి భంగం కలిగించేలా భూమిని చెరబట్టిన హిరణ్యాక్ష హననం జరగాలి. పరకాంతను చెడు దృష్టితో చూసే కీచక సంహారం జరగాలి. సంపద ప్రదర్శనాతత్వం మితిమీరిన రావణాసుర హతం జరగాలి. అప్పుడే నిత్య దీపావళి.
 
దీపావళి అంటేనే వెలుగుల వెల్లువ. ఆనందం వెల్లివిరిసే సంబురాల పండుగ. చీకటిపై వెలుగు, చెడుపైన మంచి, అజ్ఞానమ్మీద జ్ఞానం సాధించిన గెలుపునకు ప్రతీకగా జరుపుకునే విజయానందం. ఇది ఇంటింటా, ఇంటిల్లి పాదీ జరుపుకొనే విజయోత్సవ వేడుక! భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతీ, సంప్రదాయాల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జగతిని పట్టి పీడిస్తున్న నరకాసురుడ్ని వధించిన రోజు నరకచతుర్థి అని, తర్వాతి రోజు వేడుకే దీపావళి పండుగని పురాణాలు చెబుతున్నాయి. రాక్షసరాజు రావణాసురుడ్ని వధించి శ్రీరాముడు లంక నుంచి సీతా–లక్ష్మణ సమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చిన సంబరమే దీపావళి అంటారు. పద్మపురాణం, స్కంధ పురాణంలో ఇటువంటి పలు ప్రస్తావనలున్నాయి. అది ఏ రూపంలో అయితేనేం! రాక్షస (చెడు) సంహారం జరిగి, లక్ష్య శుద్ధితో శ్రమించిన (మంచి) వారికి విజయం చేకూరితే అదే దీపావళి. ఇలా ఎంత కాలం పురాణ గాథలు చెబుతూ–వింటూ గడుపుతాం? మనం కూడా చెడుపై మంచిని గెలిపించి విజయోత్సవ వేడు కగా దీపావళి జరుపుకోవాలనే భావన ఆధునిక తరానికి రావడం సహజం! మరిప్పుడు రాక్షసులు లేరు కదా! అనే సందేహమూ రావచ్చు. ఎందుకు లేరు! రాక్షసులు ఇప్పుడూ ఉన్నారు. కాకపోతే... వేరెక్కడో దూరంగా కాదు, మనలోనే ఉన్నారు. అందుకు, విజ్ఞులు ఒక మంచి పరిణామ క్రమాన్ని చెబుతారు. యుగ క్రమంలో... మొదటిదైన కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల సాగింది కనుక అంతా మంచివారే తప్ప రాక్షసులు లేరు. తర్వాతిదైన త్రేతా యుగంలో రావణాది రాక్షసులు వేరు, దేవత్వా స్వభావంతో రాముడి వంటి నరులు, ఆంజనేయుడి వంటి వానరులు వేరు వేరు జాతులుగా ఉన్నారు. ఆ తర్వాతి ద్వాపర యుగానికి వచ్చేసరికి మనుషుల్లోనే దైవాంశ కలిగిన కృష్ణుడు, వ్యాసుడు, భీష్ముడు వంటి వారు, రాక్షసాంశ కలిగిన కంసుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు వంటి వారూ ఉన్నారు. ఇక చివరిదైన ప్రస్తుత కలియుగంలో పరిస్థితి మరింతగా మారింది. ఒక మనిషిలోనే దైవ స్వభావం, రాక్షస స్వభావం వేర్వేరు పాళ్లలో ఉన్నాయి. ఆయా స్వభావాల హెచ్చు తగ్గుల్ని బట్టి మంచివారు, చెడ్డవారు. అందుకే స్వామీ వివేకా నందుడంటారు, ‘విద్య అంటే వేరేదో కాదు, మనిషిలో ఉండే దైవత్వాన్ని వివిధ రూపాల్లో వెలికితీయడమే’ అని. మరో రకంగా, మనిషిలోని రాక్షస  త్వాన్ని సంహరించడమే నిత్యదీపావళి అనుకోవచ్చు. ఎంపిక చేసిన లక్ష్యా లపై దాడుల (సర్జికల్‌ స్రై్టక్స్‌)తో ఆ రాక్షస సంహారమే జరగాలిప్పుడు. ఇది కొత్త మాట కాదు... కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలని మనలోనే ఉన్న ఆరుగురు అంతశ్శత్రువులని, వాటిని జయించాలన్ని ఆర్ష సంస్కృతి చెబుతోంది.

కాలుష్యకాసారంలో బతుకు దుర్భరం
దేశంలోని మహానగరాల్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంటే ఆ ప్రభావం హైదరాబాద్‌ మీద కూడా తక్కువేం లేదు. తీవ్రంగా ఈ సమస్య నెదుర్కొంటున్న నాలుగో మెట్రో నగరంగా రికార్డులకెక్కింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబాయి తర్వాత స్థానం మనదే! వాహనాల పొగ, దుమ్ము–దూళీ, పరి శ్రమలు వెలువరించే వ్యర్థాలు కలిసి ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీనికి తోడు రోజురోజుకు చెట్టు చేమలు, మొత్తంగా హరితమే హరించిపోతూ నగరం కాంక్రీట్‌ వనంగా విస్తరిస్తోంది. ఆక్సిజన్‌–ఆక్సిజనేతర వాయువుల నిష్పత్తి మారి ప్రమాదకరంగా తయారవుతోంది. పదేళ్ల కాలంలో ఎన్నో రెట్లు పెరిగిన వాహనాల సంఖ్య, కాలం చెల్లిన వాహనాలు నిరాటంకంగా విడుదల చేసే పొగ వల్ల కూడా వాయు కాలుష్యం హెచ్చుతోంది. ఐటీ రంగం విస్తరి స్తున్న నగరం కావడంతో పెద్ద సంఖ్యలో వాడే ఎలక్ట్రిక్‌–ఎలక్ట్రానిక్‌ ఉపకర ణాలు, ఏసీల వినియోగం నగరం సగటు ఉష్ణతాపాన్నే కాక కాలుష్యాన్నీ పెంచుతోందని ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ (ఐజేఐఆర్‌సెట్‌) జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. ఫలితంగా ఛాతీ, శ్వాస సంబంధ వ్యాధులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి అంతకన్నా ప్రమాదకరంగా ముదిరే పరిస్థితులున్నాయి. నగర వాసులు మైగ్రేన్‌ వంటి తలనొప్పులు, సొరియాసిస్‌ వంటి చర్మవ్యాధులు, ఆస్తమా, క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.  కాలుష్య నివారణకు ప్రభుత్వాలు నిర్దిష్ట కార్యాచరణను ఆమలు పరచడమే కాదు, వ్యక్తులుగా అందరూ తమ వంతు పాత్ర నిర్వహించాల్సి ఉంది. ఉదాహ రణకు దీపావళి వేడుకల్నే తీసుకుందాం, విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యం జరుగుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. కిందటి ఏడాది లెక్కలు చూస్తే, బాణాసంచాతో వాయు కాలుష్యానికి లెక్కేలేదు. సగటున 96 నుంచి 105 డెసిబుల్స్‌ వరకు శబ్దకాలుష్యం వెలువడింది. దీంతో చిన్నారులు, వృద్ధులు, నవజాత శిశువులు, పెంపుడు జంతువులు ఎన్ని అవస్థల పాల య్యారో! సాధారణంగా 50 డెసిబుల్స్‌ దాటిన శబ్దాలు వీరిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని,  నవజాత శిశువులు వినికిడి శక్తి కోల్పోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తడం తథ్యం. కుక్క, పిల్లి వంటివి 50 డెసిబుల్స్‌ దాటిన శబ్దాలు వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయంటున్నారు. వాటి కర్ణభేరీ బద్దలయ్యే ప్రమాదమూ ఉంది. గాయాలు సమీప భవిష్యత్‌లో వాటి మనుగడకు  ముప్పుగా పరిణమిస్తాయి. టపాసులు కాల్చినపుడు వెలువడే పొగలో సల్ఫర్‌డై ఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, ధూళి రేణువులు రేగి పర్యా వరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ముఖ్యంగా సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ క్యూబిక్‌ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ టపాసులు అధికంగా కాల్చినపుడు ఈ స్థాయి 450–500 మైక్రోగ్రాములకు చేరుతుంది. దీంతోlఊపిరితిత్తులకు హాని. బ్రాంకైటిస్‌ (తీవ్రమైన దగ్గు) తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఇక నైట్రోజన్‌ ఆక్సైడ్‌ పెరుగుదల కూడా ఇదే స్థాయిలో ఉంటుంది. దీంతో కళ్లు, ముక్కు మండుతాయి. శ్వాసకోశాలకు తీవ్ర చికాకు కలుగుతుంది. ఇక ధూళి రేణువులు (ఎస్‌పీఎం) క్యూబిక్‌ మీటరు గాలిలో 100 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, వీటి మొతాదు క్యూబిక్‌ మీటరు గాలిలో 300 మైక్రో గ్రాములకు మించే పరిస్థితి ఉండటం వల్ల తీవ్ర మైన శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులంటున్నారు.

మహిళలంటే మర్యాదలేనితనం
చదవేస్తే ఉన్న మతి పోయిందని మొరటు సామెత! దీన్ని నిజం చేస్తున్నామా అన్నట్టుంటోంది మహిళల పట్ల మగవారి వైఖరి చూస్తుంటే. ఒకప్పటితో పోల్చి చూస్తే ఉన్నత చదువులు, డిగ్రీలు, సగటు విద్యార్హతలు ఈ మధ్య కాలంలో రమారమి పెరిగాయి. కానీ, మహిళల పట్ల మగవాళ్లు వ్యవహరి స్తున్నతీరు, అత్యాచారాలతో సహా జరుగుతున్న నేరాలు, నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తగ్గకపోగా పెరగడం దీన్నే సూచిస్తోంది. విద్యార్హతలతో నిమిత్తం లేకుండా బాగా చదువు కున్న వారు కూడా మహిళల్ని న్యూనతపరిచే, అవమానించే, వేధించే, హింసించే దురాగతాలు ఈ దుస్థితికి అద్దం పడుతున్నాయి. గృహహింస (నిరోధక) చట్టం, నిర్భయ చట్టం అమల్లోకి వచ్చాక కూడా సదరు నేరాలు, నేర స్వభావం తగ్గటం లేదు. జాతీయ నేర నమోదు బ్యూరో గణాంకాలు విస్మయం కలిగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ నేర గణాంకాల్లో అగ్ర శ్రేణిలో ఉండటం ఆందోళనకరం. ఇది ప్రధానంగా వ్యక్తి ఆలోచనా ధోరణి, వ్యక్తిత్వం, స్వభావానికి సంబంధించిన అంశం. 2015లో దేశవ్యాప్తంగా 3.27 లక్షల కేసులు నమోదు కాగా ఏపీలో 15,931, తెలంగాణలో 15,135 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మహిళా జనా భాకు ఎంత మందికి ఇలాంటి నేరాలు అని లెక్కగట్టే క్రైమ్‌ రేటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థితిలో ఉంది. ఢిల్లీ, అస్సాం, రాజస్థాన్‌ తర్వాతి స్థానం తెలంగాణ (83.1), ఏపీ (62.3)లదే అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి మారాలి!

సంపద గర్వంతో ప్రదర్శనాతత్వం
సమాజంలో ఆర్థిక అసమానతలే అనర్థమంటే, సంపద గర్వం, ప్రదర్శ నాతత్వం కొందరిలో మితిమీరుతున్న వైనం మరో అనర్థం. ఈ పోకడ ఇటీ వల కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అక్రమార్జన వల్ల తేలిగ్గా వచ్చే డబ్బు వారినిలా ప్రోత్సహిస్తుండవచ్చని అనిపిస్తోంది. ముఖ్యంగా పండుగలు, పబ్బాలు, పెళ్లి ఇతర సాంఘిక వేడుకల్లో ఈ ప్రదర్శనా∙తత్వం తారస్థాయికి చేరడం విస్మయకరం, కొన్ని సందర్భాల్లో జుగుప్సాకరం కూడా. తమ సంపదను బహిరంగ ప్రదర్శనకు పెట్టడం ధనగర్వం, ప్రదర్శనతత్వం తప్ప మరోటి కాదని, ఇది ధనిక–పేద అంతరాల్ని ఎలుగెత్తి చాటే కవ్వింపు చర్య అని సామాజిక శాస్త్రవేత్తలంటున్నారు. సినిమా సెట్టింగుల ఆర్భాటంతో ఒక్కో పెళ్లికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న వారున్నారు. కర్ణాటక మాజీ మంత్రి ఒకరు తమ కుమార్తె వేడుకకు చేస్తున్న ఆర్భాటాన్ని చూసి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కె. ఆర్‌. రమేష్‌కుమార్‌ నివ్వెరపోయారు. పెళ్లి వేడుకలను భారీ హంగు, ఆర్భాటంతో జరిపించి సంపదను ప్రదర్శించడాన్ని నియం త్రించాలంటూ ఆయనే ఇటీవల ఆ రాష్ట్ర శాసనసభలో ప్రైవేటు మెంబరు బిల్లును తీసుకువచ్చారు. ఎంపిక చేసిన వారికి విమాన టిక్కెట్లు, స్టార్‌ హోటళ్లు, లగ్జరీ కార్లు ఏర్పాటు చేసే ఖరీదైన ‘డెస్టినేషన్‌ మ్యారేజెస్‌’ వేడుకలు జరుపుతున్న సంపన్నులూ ఉన్నారు. పుట్టినరోజు, పిల్లలకి పట్టు వస్త్రాలు కట్టివ్వడం వంటి చిన్న చిన్న వేడుకలకూ భారీ ఆర్భాటాలు జరిపించే «ధోరణీ పెరిగిపోతోంది. అన్నీ కలిగిన వారిని చూసి ఆర్థిక స్తోమత లేకపోయినా కొందరు కుహనా ప్రతిష్టకు పోయి, ఇటువంటి ఆర్భాటాలకు పోయి చతికిల బడతున్నవారు పెరుగుతున్నారు. ఇలాంటి వేడుకల్లో ఆహారంతో సహా అన్నీ వృధాయే. కవి కాళోజీ అన్నట్టు ‘అన్నపు రాశులు ఒకవైపు ఆకలి మంటలు ఒకవైపు’ అన్న తరహాలో ఈ నిర్లక్ష్యపు వృధాలు ఆర్థిక అసమానతల్ని ఎత్తి చూపుతాయి. పేదల్ని  రెచ్చగొట్టే ఇటువంటి చర్యలే సామాజిక అశాంతికి దారితీస్తాయి..

రాక్షస సంహారమే తరువాయి
కాలుష్యమైనా, మహిళలపై నేరాలయినా, సంపద ప్రదర్శన తత్వమైనా... మరో అవాంఛనీయ పరిణామమేదైనా ప్రభుత్వం చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటుంది. అలా ఒత్తిడి తీసుకురావడం సగటు పౌరుల బాధ్యత. అదొ క్కటే సరిపోదు. వీటిని నిలువరించడంలో వ్యక్తులుగా ఎవరేం చేయవచ్చ న్నది ఆలోచించాలి. ఎవరికి వారు, ఇందుకు కారణమవుతున్న తమలోని రాక్షసుడ్ని వెతకాలి. ఉంటే, తుదముట్టించాలి. స్వార్థంతో పర్యావరణానికి భంగం కలిగించేలా భూమిని చెరబట్టిన ‘హిరణ్యాక్ష’ హననం జరగాలి. పర కాంతను చెడుదృష్టితో చూసే ‘కీచక’ సంహారం జరగాలి. సంపద ప్రదర్శనా తత్వం బలపడ్డ ‘రావణ’ హతం జరగాలి. అదే చీకటిపై వెలుగు గెలుపు! అప్పుడే నిజమైన దీపావళి, నిత్యదీపావళి.
 
  
(వ్యాసకర్త : దిలీప్ రెడ్డి
ఈ మెయిల్: dileepreddy@sakshi.com )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement