నా భూభ్రమణ కాంక్ష | Opinion on World Visit of Prof. M Adinarayana from Rotation of the Earth | Sakshi
Sakshi News home page

నా భూభ్రమణ కాంక్ష

Published Sun, Jan 15 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

నా భూభ్రమణ కాంక్ష

నా భూభ్రమణ కాంక్ష

∙ముందుమాట

ఎన్ని దేశాలు తిరిగినా కొత్త ప్రదేశం అని ఎక్కడా అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ! ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం.

‘మనసుకి నచ్చిన ప్రదేశాల్లోకి వెళ్లి అక్కడి ప్రజలతో కలిసిపోయి, వారి జీవన విధానంలో పాల్గొనాలి’ అనేదే నా భ్రమణ కాంక్షకి మూలం. లోకాన్ని తిరగటంలో నిజమైన ఆనందం ఉంది. తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది.

మా తాతయ్య వైకుంఠ పెరుమాళ్లు మాదిరిగా పాటలు పాడుకొంటూ, ప్రకృతిని పూజిస్తూ, ‘పూర్తిస్థాయి దేశ దిమ్మరిగా మారిపోదాం’ అని డిగ్రీ చదివే రోజుల్లో అనుకొనే వాడిని. అలాంటి భావాలు నాకు చిన్నప్పటినుంచీ కొద్దో గొప్పో ఉండబట్టేనేమో, మా అమ్మమ్మ నన్ను ఎప్పుడూ ‘‘ఒరే, చిన్నగాలోడా! దేశమంతా తిరుగుతూ ఉంటావు. ఒక చోట కుదురుగా ఉండవు కదరా!’’ అంటూ నా భవిష్యత్‌ ప్రయాణాల ప్రభంజనం గురించి, ఒక ప్రవక్త మాదరిగా ప్రవచించింది.

నా జీవిత చక్రాన్ని నాకు ఇష్టమైన బాటల్లో తిప్పుకొంటూ ఆనందించే పిల్లాడిని నేను. రసాత్మకమైన ఒక వాక్యానికి కావ్యంతో సరితూగ గలిగిన శక్తి ఉన్నప్పుడు, ప్రజల మధ్యకి చేసిన ఒక చిన్న ప్రయాణానికి కూడా సంవత్సరాలపాటు సాగిన పెద్ద అన్వేషణకి సమానమైన శక్తి ఉంటుందని నమ్ముతాను.

ఈ పురాతన సత్రంలో ‘మనం ఉండేది కాసేపే’ అనే సత్యాన్ని తెలుసుకొన్న ఉమర్‌ ఖయ్యాం, దారి పొడవునా బుల్‌బుల్‌ పిట్టల సంగీతం వింటూ పచ్చిక మైదానాల్లోకి ప్రయాణాలు చేస్తూ, తన జీవన పాత్రని నిత్యం మధువుతో నింపుకొనేవాడు.

మరణానికి భయపడటం మానేసి దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, సుదూర ప్రాంతాలకి ప్రయాణాలు తలపెట్టారు మానవులు. దానిలో భాగమే భారతీయులు చేసిన కాశీ–రామేశ్వర తీర్థయాత్రలు, కైలాస పర్వతానికి చేసిన సాహస యాత్రలు. ఇదే విధంగా బ్రిటిషువారు ‘కాంటర్‌బరీ’కీ, ఇటలీవారు ‘మెడోనా దే గిసోల్‌’కీ, ఫ్రాన్సు దేశస్థులు ‘సెయింట్‌ జేమ్స్‌ వే’కీ ప్రయాణాలు చేశారు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశస్థులు ‘మాఛు పీఛు’కి సాహస యాత్రలు చేశారు.

ఇండియాకి ప్రయాణం చేసిన మధ్యయుగాల నాటి యాత్రికుల్లో గొప్ప వ్యక్తి తుడేలా బెంజిమీన్‌(క్రీ.శ. 1130–1173). ఆ తరువాత గొప్ప వ్యక్తి ఇబన్‌ బతూతా (క్రీ.శ. 1304–1377). ఇలాంటి గొప్పవారి రచనలు భారతదేశ చరిత్రకి ఆధారాలైనాయి. భౌతిక ప్రపంచపు బురద నుండి త్వరగా విముక్తి పొంది, ఆనందలోకాల్లో విహరించాలనే ఆశాభావంతో ఆనాడు బాణభట్టు (క్రీ.శ. 7వ శతాబ్దం) సర్వాంతర సంచారీ పాదలేపనాన్ని ఊహించాడు.

16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన గారి ప్రవరుడు, సిద్ధుణ్ణి ‘‘ఏయే దేశములన్‌ చరించితిరి?’’ అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా ‘‘ఈ యా దేశంబననేల చూచితి, సమస్తాశావకాశంబులన్‌’’ అని చెప్పి గృహస్థునిలో యాత్రాభిలాషని రగిలించాడు.

1952వ సంవత్సరంలో చే గువేరా తొమ్మిది నెలల పాటు లాటిన్‌ అమెరికా మీదుగా ఉత్తర అమెరికాకి మోటార్‌ సైకిల్‌ మీద ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తన దేశ ప్రజల జీవన స్థితిగతుల్ని తెలుసుకున్నాడు. ఇలాంటి ప్రయాణాలన్నీ సమాజం మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపి, యాత్రల పట్ల స్పృహని పెంచాయి.

అడివి బాపిరాజు(1895–1952) నవల ‘తుపాన్‌’లోని నాయకుడు తన ప్రపంచ యాత్రలో భాగంగా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు తిరిగి కళాసాధన చేసి చాలామందితో పరిచయాలు పెంచుకుంటాడు. అది చదివినప్పుడు అలాంటి అవకాశం నిజంగా నాకు వస్తే బాగుంటుందని అనుకునేవాడిని.

నేను ఒంటరివాణ్ణి. నా వాళ్లందరూ నాకు దూరమైపోయారు. చెట్టూ పిట్టలతో సహా నాకు అందరి స్నేహమూ కావాలి. ప్రయాణం అంటేనే ప్రేమ కోసం చేసే ఒక అన్వేషణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కళాకారులతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకొన్నాను. ఎస్పరాంతో భాష నేర్చుకోవటం వలన మరికొందరు తోడయ్యారు.

2002వ సంవత్సరంలో నేను రాసిన ‘జిప్సీలు’ (ప్రపంచవ్యాప్త సంచారులు) కోసం ఆరు ఖండాల్లో చెల్లాచెదురుగా జీవిస్తున్న మనదేశపు ‘రొమానీ జిప్సీ’ల గురించి తెలుసుకోవటానికి ప్రపంచ యాత్రా సాహిత్యం అంతా అధ్యయనం చేయాల్సి వచ్చింది. తరువాత రాసిన ‘స్త్రీ యాత్రికులు’(2005) కోసం ఆరు ఖండాల్లో ఉన్న వివిధ దేశాల్లోని ‘స్త్రీ యాత్రా సాహిత్యాన్ని’ చదవటం వలన, ప్రపంచం గురించి రెండోసారి అవగాహన పెరిగింది. ‘మహా యాత్రికులు’ (2008) పుస్తకం కోసం మరొక్కసారి ‘ప్రపంచ యాత్రా సాహిత్య విజ్ఞాన సర్వస్వాన్ని’ తెలుసుకొన్నాను.

అప్పటికే నేను ఇండియాలో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రలు పూర్తి చేశాను. యాత్రా ప్రపంచాన్ని అధ్యయనం చేయటం వలన, ప్రపంచం అంతా ఒంటరిగా తిరగ్గలను అనే నమ్మకం కుదిరింది. నేను ప్రపంచయాత్ర చేయగలిగితే నా పాదయాత్రా జీవితానికి, ఒక పరిపూర్ణత, నిండుదనం కూడా వస్తాయి అనుకొన్నాను.

‘భూగోళం అంతా సంచారం చెయ్యాలి’ అనే ఆలోచనకు నాంది పలికిన మొదటి భారతీయ యాత్రికుడు ఏనుగుల వీరాస్వామి. ఆయన తన కాశీయాత్ర (1830–31)ని ముగించుకొని, తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం పట్టణానికి దగ్గరలో ఉన్న ‘అలమండ’ అనే గ్రామంలో ఆగినప్పుడు, పల్లకీలు మోయటంలో ఉప్పాడ బోయీల గొప్పతనాన్ని వర్ణిస్తూ ‘‘ఉప్పాడ బోయీలతో భూగోళ సంచారం యావత్తూ చేయవచ్చునని తోచుచున్నది’’ అనే నిర్ణయానికి వస్తాడు.

భారతదేశంలో విపరీతంగా ప్రయాణాలు చేసిన వారిలో రాహుల్‌ సాంకృత్యాయన్‌(1893–1963) ప్రథమ స్థానాన్ని ఆక్రమించినా, ఆ తరువాత వచ్చిన ఎ.కె.చెట్టియార్‌ (1911–1983) విదేశీ యాత్రల గురించి పదిహేడు పుస్తకాలు రాసి, తమిళ యాత్రా సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు.

ఇలాంటి నేపథ్యంలో నా అంతర్జాతీయ ప్రయాణాలకు 2009వ సంవత్సరం మార్చి నెలలో అంకురార్పణ జరిగింది. అప్పటినుండి నిర్విరామంగా, ఆరు ఖండాల్లోని పద్నాలుగు దేశాల్లో ప్రయాణాలు చేశాను. ఆయా దేశాల్లోని అనుభవాలతో నేను రాసుకొన్న పుస్తకమే ఈ ‘భూభ్రమణ కాంక్ష’.

ఈ యాత్రలో నేను అత్యంత ఆనందాన్ని పొందిన సంఘటనలు మూడు. ఇటలీలోని వెనిస్‌ నగరంలో మార్కోపోలో ఇంటికి వెళ్లటం, ఆ దేశంలోని విసెంజా అనే మరో నగరంలో యాంటానియో ఫిగటెట్టా ఇంటికి దగ్గరలో ఎనిమిది రోజుల పాటు నివాసం ఉండటం, హుయాన్‌ త్సాంగ్‌ నివసించిన దాయంతా పగోడాని దర్శించటం.

నిరంతర ప్రయాణాలతో అలసిన నా పాదాలు సప్త సముద్రాల (ఇండియాలో బంగాళాఖాతం, అరేబియా సముద్రం; స్వీడన్‌లో బాల్టిక్‌ సముద్రం; నైజీరియా, బ్రెజిల్‌ దేశాల్లో అట్లాంటిక్‌ సముద్రం; ఇటలీలో అడ్రియాటిక్‌ సముద్రం; స్కాట్‌లాండ్‌లో నార్త్‌ సముద్రం; తాస్మానియా దీవిలో తాస్మానియా సముద్రం) తీరాల్లోని అలల వొడిలో అలసట తీర్చుకొన్నాయి.

ఇన్ని దేశాలు తిరిగాక, ప్రపంచం అంతా నాదేననీ, అందరూ నా వాళ్లేననీ తెలుసుకొన్నాను. ఆ ప్రయాణాలు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఐశ్వర్యవంతుణ్ణి చేశాయి. ‘నాకు ఎవరూ లేరు’ అనే బెంగ తీరిపోయి, ‘ప్రపంచం అంతా నావాళ్లు ఉన్నారు’ అనే ధైర్యం ఏర్పడింది.
ఎన్ని దేశాలు తిరిగినా కొత్త ప్రదేశం అని ఎక్కడా అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ! ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం.

(బ్రెజిల్‌లోని రియో డీ జనీరో నగరంలోని
క్రైస్ట్‌ ద రిడీమర్‌ విగ్రహం ముందు వ్యాసకర్త ఎం.ఆదినారాయణ
9849883570 )
(ప్రొఫెసర్‌ ఎం.ఆదినారాయణ తన ‘భూభ్రమణ కాంక్ష’కు రాసుకున్న ముందుమాటలోంచి; ప్రచురణ: బాటసారి బుక్స్‌)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement