
‘మత్తు’ యావే మరణ శాసనం
సమకాలీనం
గోవా–హైదరాబాద్ మధ్య, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వారు యధేచ్చగా తిరుగుతూ డ్రగ్స్ మార్పిడి చేస్తున్నా గుర్తించే వ్యవస్థ లేదు. డ్రగ్స్‌ను నియంత్రించేందుకు 1989లోనే ప్రతీ రాష్ట్ర పోలీసు విభాగంలో ఓ నార్కోటిక్ శాఖ ఏర్పడింది. ఇది కాకుండా కేంద్ర నార్కొ టిక్ డైరెక్టరేట్, ఒక దర్యాప్తు బృందం ఉన్నాయి. కానీ, ఇవన్నీ నామమాత్రమే! సిబ్బంది లేదు, వాటి మధ్య సమన్వయం ఉండదు. ఆధునికీకరణా అంతంతే! మరోవైపు నేరగాళ్లు ‘డార్క్‌వెబ్’ వంటి ఆధునిక సమాచార వ్యవస్థతో డ్రగ్స్ రవాణా– పంపిణీ చేస్తున్నారు.
సంపద–విచ్చలవిడితనానికి పుట్టిన అక్రమ సంతానం డ్రగ్ కల్చర్! అప్ర మత్తమై ఆ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయకపోతే జరిగే విధ్వంసం చరిత్ర పుటల్ని నిలువునా మలినం చేస్తుంది. సంకేతాలు గుర్తించాక చేపట్టే నివారణ చర్యల సత్తాను బట్టే ఈ విష జాడ్యం విస్తరణా? నియంత్రణా? అన్నది తేల నుంది. పుట్టుక, విస్తరణ అనేవి బాధ్యత విస్మరించిన సంపన్నవర్గ సమాజం నుంచే మొదలైనా... అన్ని బలహీనతల్ని ఆలింగనం చేసుకుంటూ డ్రగ్ రక్కసి సృష్టించే అరాచకం పేద, మధ్యతరగతి కుటుంబాల్లోనూ కార్చిచ్చే! సమస్య తీవ్రత తెలిశాక కూడా చూసీ చూడనట్టుంటే, మొత్తం సమాజమే కోలుకోలేని విధంగా దెబ్బ తింటుంది. కడకు నిర్వీర్యమైన, నిస్తేజమైన ఓ తరాన్ని మిగిల్చి పోయే మహమ్మారి డ్రగ్ సంస్కృతి. పతనం అంచుల దాకా జారిన పంజాబ్ కళ్లెదుట కనిపిస్తూనే ఉంది. దేశంలోనే సంపన్న రాష్ట్రంగా, పౌరుషాల గడ్డగా వెలిగిన పంజాబ్ నేడొక రోగాల దిబ్బ, అశక్తుల అడ్డా!
చారిత్రక నగరం హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటీవల వెలుగు చూస్తున్న అవలక్షణాలు భవిష్య త్తుపై గగుర్పాటు కలిగించేవిగా ఉన్నాయి. మన విలువల సమాజం పతన మౌతున్న ఆరంభ సంకేతాలా? అన్న సందేహం కలుగుతోంది. ఎనిమిదో తరగతి పిల్లల నుంచి, సమాజాన్ని ప్రభావితం చేసే సినిమా ‘పెద్ద’ మనుషుల దాకా విస్తరిస్తున్న క్రమం ప్రమాదకరం! ఇది ఇంతేనా? ఇంకెంత లోతుకు విస్తరించింది! అన్నది తేలాలి. మూలాలు ఎక్కడున్నాయి, ఊడ లెక్కడెక్కడ దిగాయి? అన్నది శోధిస్తే తప్ప విరుగుడు చర్యలు అంత తేలక కాదు! ఒక వైపు నిఘా–నియంత్రణ వ్యవస్థల వైఫల్యం, మరో వైపు విద్యా సంస్థల్లో దిగజారుతున్న విలువలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. మత్తులో ఇప్పుడు దొరికే మజా తప్ప తుది పరిణామాలెంత దుర్భరమో గ్రహించని పసితనం–యువతరం అవగాహనా రాహిత్యం ఈ దురాగతానికి వేదిక కట్టింది. పిల్లల కదలికల్ని గమనించని తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం మరింత దన్నుగా నిలుస్తోంది. మద్యాన్ని ప్రభుత్వం విక్రయించి, విద్యను ప్రయివేటు శక్తులు అమ్ముకునే దుర్మార్గపు సమీకరణం... ఇలా అన్నీ వెరసి డ్రగ్ రక్కసి కోరలు చాస్తోంది.
తల్లిదండ్రులూ... తస్మాత్ జాగ్రత్త!
తొలుత దొరికిన మూడు సెల్‌ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషిస్తేనే నగరంలోని వెయ్యి మంది విద్యార్థులు, యువత డ్రగ్స్ వినియోగించినట్టు దర్యాప్తు అధి కారులు గుర్తించారు. వారం దర్యాప్తు తర్వాత విద్యార్థుల సంఖ్య 3వేలు దాటింది. మొత్తానికి ఇంకెంతమంది ఉన్నారో? పాతిక పాఠశాలలు, మరో పాతికపైన కళాశాలలకు హెచ్చరిక సందేశాలు పంపారు. విద్యార్థుల ప్రవ ర్తనపై విద్యాసంస్థల నిర్వాహకులకు నియంత్రణ సంగతలా ఉంచి కనీసం అవగాహన కూడా ఉండదు. తరగతుల నిర్వహణ, పాఠాలు చెప్పడం, పరీ క్షలు జరిపి పంపించడం తప్ప మరే క్రియాశీల, సృజనాత్మక పనిని వారు చేపట్టరు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో విద్యార్థులేంచేస్తున్నారో? వారి ఆగడా లెలా ఉంటాయో కూడా నిర్వాహకులకు సోయి ఉండదు. ఇక తల్లిదండ్రులు సరేసరి! ముఖ్యంగా సంపన్నవర్గాల వారి పిల్లల ఆగడాలకు అంతే ఉండదు. వాటి గురించి తల్లిదండ్రులు ఏనాడూ పట్టించుకున్న దాఖలాలుండవు. పెద్ద మొత్తంలో నెలసరి పాకెట్ మనీ అందజేసి, క్రెడిట్–డెబిట్ కార్డులు వారి చేతికిస్తూ, ఏయే అవసరాలకా డబ్బు వ్యయం చేస్తున్నారో కూడా గమనించని అలక్ష్యం వారిది. పర్యవసానంగా... లెక్క చెప్పే పనిలేని డబ్బు, బాధ్యతెరు గని స్వేచ్ఛ, ఇతరులతో పోటీ పడే డాబు–దర్పం వెరసి వారిని వ్యసనాలకు బానిసలను చేస్తున్నాయి. ఏ కొరతా రానీయకుండా పెంచుతున్నామనే భావ నలో కొట్టుకుపోయే తల్లిదండ్రులు తెలియకుండానే కన్నబిడ్డల్ని సోమరు లను, అయోగ్యులను, అర్భకులను తయారు చేస్తున్నారు. దారి తప్పుతున్న పుడు గమనించకుండా పరిస్థితి చేయిదాటాక బాధ పడుతుంటారు. అదేదో కొత్త రుచి–చవిచూడాలనే ఉత్సుకతతో కొందరు, ఇతరుల కన్నా తామేమీ తక్కువకాదనే పొగరుబోత్తనంతో ఇంకొందరు, ఒత్తిడే లేని గమ్మత్తు లోకంలో విహరించాలని మరి కొందరు ‘మత్తు’కు అలవాటు పడుతున్నారు. ఒకసారి ఉచ్చులో చిక్కాక బానిసలవుతున్నారు. బతుకు బలిపెట్టి చిత్తవుతున్నారు.
రంగు వెలుస్తున్న సినిమా
ఒకనాడు విలువలకు నెలవైన తెలుగు సినిమారంగం నేడు పలుచబారు తోంది. తెలుగునాట డ్రగ్స్ జాడ్యం సినిమా రంగానికి తగులుకొని చాన్నాళ్ల యింది. అప్పుడప్పుడు కేసులు పట్టుపడుతున్నా ఎవరూ వాటిని తీవ్రంగా తీసుకోవట్లేదు. రోడ్డుమీద గొడవల్లోనో, ప్రమాదాల్లోనో, ట్రాఫిక్ ఉల్లంఘన లతోనో.. వర్థమాన నటులు కొందరు మత్తులోనే దొరికిన ఘటనలెన్నో! తీగ లాగితే ఇప్పుడు డొంక కదులుతోంది. అరుదుగా కాల్షీట్లు లభించే ముఖ్యు లతో ఎక్కువ గంటలు అలసట లేకుండా పనిచేయించేందుకు డ్రగ్స్ వాడు తున్న సందర్భాలున్నాయి. సన్నివేశాల్లో అనుకున్న నాణ్యత, ప్రభావం తీసు కువచ్చేందుకు, ప్రేమ–శృంగార సన్నివేశాల్ని పండించేందుకు కూడా కోరి మరీ దర్శక–నిర్మాతలు కొందరు డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తారు. వీటన్నిం టికీ మించి... ఈ రంగపు లక్షణమైన పుష్కలంగా డబ్బు, తిరుగులేని స్వేచ్ఛ, ఎదురులేని విచ్చలవిడితనం కొందరు ఆర్టిస్టుల్ని డ్రగ్స్ వైపు నడిపిస్తోందని తాజా దర్యాప్తులో వెల్లడయిన లింకుల్ని బట్టి తెలుస్తోంది. పెద్ద పేరున్న కొందరు దర్శకులూ ఈ ‘మత్తు’ మహత్తులో జోగుతున్నట్టు తాజా సమా చారం. సినిమా, టీవీ రంగుల ప్రపంచం పురిగొల్పే ‘రేవ్’పార్టీలే డ్రగ్స్ వ్యాప్తికి బీజం వేస్తున్నాయని దర్యాప్తు అధికారులంటున్నారు. సమాజ పరి వర్తనలో కీలకపాత్ర పోషిస్తామని గొప్పలు చెప్పుకునే సినిమా రంగం, ఇలాంటి పరిణామాలతో మసకబారుతుందని బాధ్యతగల సినీ పెద్దలు కొందరు ఆందోళన చెందుతున్నారు.
విరివిగా లభ్యతే పతనానికి తొలిమెట్టు
పిల్లలు, యువత ‘మత్తు’లోకి దిగి జీవితాల్ని ఛిద్రంచేసుకోవడానికి కారణా లెన్నో! సులువుగా డ్రగ్స్ లభించడమే ప్రధాన కారణం. ఇది పంజాబ్‌లో, ఢిల్లీలోనూ ధ్రువపడింది. రోజూ సగటున రెండు వేల కోట్ల రూపాయల మాద కద్రవ్యాలు దేశంలోకి వస్తున్నట్టు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడంచిన సమాచారం. దేశవ్యాప్తంగా డ్రగ్ డీ–అడిక్షన్ సెంటర్లలో 20 శాతం మంది 16 ఏళ్ల లోపువారంటే కళ్లలోకి నీళ్లొస్తాయి. దశాబ్దం కిందట డ్రగ్స్ రవాణాకు హైదరాబాద్ ట్రాన్సిట్ అడ్డాగా మారుతోందనే ప్రచారం ఉండేది. కానీ, విని యోగం అంతగా ఉండేది కాదు. ఇటీవల బాగా పెరిగింది. అదీ ముఖ్యంగా సంపన్న యువతరం, ఆర్భాటపు స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో వాడకం బహిరంగ రహస్యమే! పని ఒత్తిడి, నూతనత్వపు యావ ఉండే ఐటీ రంగానికీ పాకింది. చాలా సందర్భాల్లో ఇది గంజాయితో మొదలవుతుంది. నగరంలో రోజూ సగటున 200 నుంచి 250 కిలోల గంజాయి వాడుతున్నట్టు సమాచారం. నాలుగయిదు మార్లు గంజా తీసుకున్నాక ఆ డోస్ సరిపోదు. కిక్కివ్వడం లేదనే కారణంతో కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఎల్లెస్డీ, ఎమ్డీఎమ్యే తదితర డ్రగ్స్ వైపు జారుతారు. కేవలం కెమికల్స్‌తో రూపొందే సింథటిక్ డ్రగ్స్ చాలా ప్రమాదకరం. సిగరెట్లలో, బ్లాటింగ్ పేపర్‌పైన, ద్రవంగా, స్వల్పపరిమాణంలో నాలుకపై వేసుకునే ఘన పదార్థంగా... ఇలా రకరకాలుగా ఉంటాయి. ద్రవరూపంలో ఇంజక్షన్ల ద్వారా నరాల్లోకి తీసు కోవడం కాస్త నొప్పితో కూడుకున్నది కావడం వల్ల పద్ధతిని మార్చారు. నాలు కపై వేసుకుంటే 20 సెకన్లలో కరిగిపోయి, పది నుంచి పన్నెండు గంటలు మత్తు ఇచ్చే ఎల్లెస్డీ అత్యాధునికం! అంతే ప్రమాదకరం. గంజా 20–25 మార్లు తీసుకొని వ్యసనపరులవుతుంటే, ఇతర సింథటిక్ డ్రగ్స్ అయిదారు మార్లు తీసుకున్నా చాలు వారికది వ్యసనంగా మారుతోంది. గరిష్ఠంగా నలుగురు పంచుకోగలిగే ఒక్కో యూనిట్ సగటున 3 వేల రూపాయలకు లభిస్తోంది. డబ్బులయిపోయాకో, ఇంట్లో కట్టడి పెరిగితేనో... డబ్బుకోసం చిల్లర మల్లర దొంగతనాలు, దోపిడీలకూ తెగిస్తున్నారు. అదీ కుదరనపుడు, వ్యవసనప రులు తామే స్వయంగా పంపిణీదారు అవతారమెత్తుతారు.
నిఘా–నియంత్రణ ఓ భ్రమ!
మూడు నెలల కింద, ఏప్రిల్ 8న నగరంలోని కుతుబ్‌షాయీ సమాధుల వద్ద ప్రమాదకర డ్రగ్స్‌తో 5గురిని టాస్క్‌ఫోర్స్ విభాగం పట్టుకుంది. అందులో ఇద్దరు నైజీరియన్లు. రోతిమి అనే పాత నేరగాడు వస్త్ర వ్యాపారం పేరిట నగరానికి వచ్చి, ఈది అని కొత్తగా వచ్చిన మరో నైజీరియన్‌తో కలిసి డ్రగ్స్ రవాణా, పంపిణి చేస్తున్నాడు. రోతిమిని జూబ్లీహిల్స్ పీఎస్‌లో 2015లోనే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. మళ్లీ ఇవే నేరాలు చేస్తూ పట్టుబడ్డాడు. వీరే కాకుండా పలువురు నైజీరియన్లు ఇక్కడ డ్రగ్స్ వ్యవహారాల్లో ఉన్నారు. వీరిపై ఓ నిఘా, నియంత్రణ ఏదీ లేదు. గోవా– హైదరాబాద్ మధ్య, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వారు యధేచ్చగా తిరు గుతూ డ్రగ్స్ మార్పిడి చేస్తున్నా గుర్తించే వ్యవస్థ లేదు. డ్రగ్స్‌ను నియం త్రించేందుకు 1989లోనే ప్రతీ రాష్ట్ర పోలీసు విభాగంలో ఓ నార్కోటిక్ విభాగం ఏర్పడింది. ఇది కాకుండా కేంద్ర నార్కొటిక్ డైరెక్టరేట్, ఒక దర్యాప్తు బృందం ఉన్నాయి. కానీ, ఇవన్నీ నామమాత్రమే! సిబ్బంది లేదు, వాటి మధ్య సమన్వయం ఉండదు. ఆధునికీకరణా అంతంతే! మరోవైపు నేరగాళ్లు ‘డార్క్‌వెబ్’ వంటి ఆధునిక సమాచార వ్యవస్థను వాడుతూ డ్రగ్స్ రవాణా– పంపిణీ చేస్తున్నారు. ఫెడరల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సాంకేతికత, ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ నిర్వహణకు ఓ రహస్యనిధి, తగిన సిబ్బంది ఉంటే తప్ప ఇటువంటి నేరాల్ని నియంత్రించలేమని అధికారులంటారు. నగరపోలీసు కమీషనరేట్ పరిధిలోని యాంటీ నార్కోటిక్ సెల్ అప్పుడప్పుడు కొన్ని తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నా పెద్ద ప్రభావం లేదు. నిజానికి ప్రమాదకర డ్రగ్స్, గంజాయి తదితర మాదకద్రవ్యాల రవాణాపై స్థానికుల ద్వారా సమాచారం ఉప్పం దుకునే ఆస్కారమున్న స్థానిక పోలీసులు నమోదు చేసే కేసులే ఉండట్లేదు. ఇదో పెద్దలోపం! డ్రగ్స్ ఓ అంతర్జాతీయ నెట్‌వర్కింగ్ ఉన్న నేరప్రపంచం! ఇరుగుపొరుగునున్న శత్రుదేశాలూ మన దేశంలో వాటి వ్యాప్తికి కుట్ర చేసే ఆస్కారముంది. వ్యవస్థీకృతంగా సాగే ఈ నేర సామ్రాజ్యం ఆట కట్టించేం దుకు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిఘా–దర్యాప్తు వ్యవస్థలు, వాటి మధ్య సమన్వయం ఎంతో అవసరం. డ్రగ్స్ డీ–అడిక్షన్ సెంటర్లు కూడా తగినన్ని లేవు. ఉన్న అరకొర సెంటర్లు డబ్బు గుంజే దోపిడీ కేంద్రాలే!
నాలుగు చేతులు కలిస్తేనే...!
డ్రగ్స్ మహమ్మారి ఎంతో ప్రమాదకారి. శైశవ దశలో కర్కశంగా నలిపేస్తే తప్ప దాన్ని నియంత్రించడం దుస్సాధ్యం. అన్ని వైపుల నుంచీ సమీకృత చర్యలు ఓ పోరాట పంథాలో సాగాలి. విద్యార్థులు–యువతరం చక్కటి అవ గాహనతో వ్యవహరించాలి. తమ పిల్లల కదలికల్ని గమనిస్తూ తల్లిదండ్రులూ అప్రమత్తం కావాలి. తగు సాధన సంపత్తితో నిఘా వ్యవస్థలు నిద్రలేవాలి. భవితను దృష్టిలో ఉంచుకొని పౌరసమాజం చేతనతో చొరవ చూపాలి. స్వచ్ఛందంగా కేసులు స్వీకరిస్తూ న్యాయస్థానాలు క్రియాశీలం కావాలి. ప్రభు త్వాలు మరింత బాధ్యతాయుతంగా జవాబుదారీతనాన్ని చాటాలి. ఇవన్నీ జరిగితేనే ‘మత్తు’ మహమ్మారి నుంచి ఈ తరానికి ఊరట, భవితకు భద్రత!
- దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com