ప్రతిపక్షం మీద ఎందుకీ పగ? | revenge on opposition in andhrapradesh | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షం మీద ఎందుకీ పగ?

Published Tue, Mar 1 2016 11:41 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ప్రతిపక్షం మీద ఎందుకీ పగ? - Sakshi

ప్రతిపక్షం మీద ఎందుకీ పగ?

డేట్‌లైన్ హైదరాబాద్
రైల్వే బడ్జెట్ వచ్చింది. సాధారణ బడ్జెట్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటి మాదిరి గానే నాలుగు మెతుకులు విదిల్చి ఊరుకుంది కేంద్రం. రైల్వే బడ్జెట్‌లో విశాఖకు ప్రత్యేక జోన్ లేదు. సాధారణ బడ్జెట్‌లో పోలవరానికి ఎప్పటిలాగే వంద కోట్లు విదిల్చి, ప్రత్యేక హోదా ఊసే లేకుండా కానిచ్చేశారు. రాజధాని ప్రస్తావన అంతకన్నా లేదు, బహుశా పార్లమెంట్ మట్టి, యమున నీళ్లు ఇచ్చినప్పుడు చంద్రబాబు కళ్లలో మోదీకి కనిపించిన ఆనందం, సంతృప్తి కారణంగా ఇంకేమీ ఇవ్వనక్కరలేదు అనుకుని ఉంటుంది కేంద్రం.

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకీ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికీ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడిని ఎన్డీఏ కూటమి అసలు పట్టించుకుంటున్నదా? పార్టీ ఏదైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మామూలుగా ఉండే సంబంధాలు కూడా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య లేవా? ఎన్నికల సమయంలో తప్ప, మిగిలిన కాలంలో రాజకీయాలు మాట్లాడను అంటూ గతంలో తాను చెప్పిన మాటను కూడా చంద్రబాబునాయుడు మరచి పోయారా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సాగుతున్న ధోరణులను చూస్తుంటే ఇటువంటివే ఇంకా ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి.

బాబు బాధ్యతా రాహిత్యం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతవారం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు కావలసిన నిధులు వంటి అంశాల మీద వినతిపత్రాలు సమర్పిం చారు. నిజానికి ఆ బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. కానీ మధ్య మధ్య విపక్ష నాయకుడు కేంద్రానికి గుర్తు చేయవలసి వస్తున్నది తప్ప, రాష్ట్ర ప్రభుత్వాధి నేతకు ఈ అంశాలేవీ పెద్దగా పట్టినట్టు కనిపించదు. రాష్ట్ర ప్రయోజనాలను సత్వరం నెరవేర్చేటట్టు చేయడానికి విపక్ష నేత ఢిల్లీలో ఉంటే, రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులను తమ పార్టీలోకి లాక్కుని, కండువాలు కప్పే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలమునకలయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, తన మీద ఉన్న కేసులను గురించి మాట్లాడుకోవడానికే వెళ్లారని చంద్రబాబుకు సంబంధించిన ఒక వర్గం మీడియా అవాకులూ చెవాకులూ రాయడం, కూయడం మామూలే.

ఈసారి ఆ వర్గం మీడియా నోరు మూత పడింది. వాళ్ల నోళ్లు మూయించినది మరెవరో కాదు, సాక్షాత్తూ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆయన పార్టీ ప్రతినిధి బృందం తనను కలసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏయే సమస్యల మీద విజ్ఞాపనపత్రాలు సమర్పించారో ప్రణబ్ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ఇలా ట్వీట్ చేయడం బహుశా ఇదే మొదటిసారి. దాంతో సత్యం కళ్లెదుట కనిపిస్తుంటే విపక్షనేత మీద బురద ఎలా చల్లాలో అర్థం కాక ఇప్పుడు జుట్టు పీక్కోవడం ఆ వర్గం మీడియా వంతయింది. ఓ పక్క ప్రతిపక్షం లేకుండా చేస్తాం రాష్ట్రంలో అని డంబాలు పలుకుతూనే మరో పక్క రాష్ట్రంలో పార్టీ సంక్షోభంలో పడితే నాయకుడు మాత్రం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని అదే మీడియా చేత రాయించే పనిలో పడ్డారు ఏలినవారు.

రాజధాని, రైల్వేజోన్‌లకు మొండిచేయి
ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల విషయానికి వస్తే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి రెండురోజుల ముందు విజయవాడలో ముఖ్యమంత్రి తన పార్టీ ఎంపీలతో సమావేశమై, కేంద్రాన్ని బతిమాలుదాం, ఒత్తిడి తేవొద్దు. బడ్జెట్‌లో మనకు ఏమొస్తుందో చూసి ఆ తరువాత నేనే వెళ్లి అందరినీ కలసి, రావలసినవన్నీ సాధించుకు వస్తానని హితవు చెప్పి పంపేశారు. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. రైల్వే బడ్జెట్ వచ్చింది. సాధారణ బడ్జెట్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటి మాదిరిగానే నాలుగు మెతుకులు విదిల్చి ఊరుకుంది కేంద్రం. రైల్వే బడ్జెట్‌లో విశాఖకు ప్రత్యేక జోన్ లేదు. సాధారణ బడ్జెట్‌లో పోలవరానికి ఎప్పటిలాగే వంద కోట్లు విదిల్చి, ప్రత్యేక హోదా ఊసే లేకుండా కానిచ్చేశారు. రాజధాని ప్రస్తావన అంతకన్నా లేదు, బహుశా పార్లమెంట్ మట్టి, యమున నీళ్లు ఇచ్చినప్పుడు చంద్రబాబు కళ్లలో మోదీకి కనిపించిన ఆనందం, సంతృప్తి కారణంగా ఇంకేమీ ఇవ్వనక్కరలేదు అనుకుని ఉంటుంది కేంద్రం. 

ఎందుకిట్లా జరుగుతున్నది అని ఏ బీజేపీ నాయకుడిని అడిగినా, అబ్బే అదేం లేదు! ఆంధ్రప్రదేశ్‌కు మేం పూర్తి న్యాయం చేస్తాం. చంద్రబాబు నాయుడు కేంద్రంలో మా చిన్న తమ్ముడు, ఇక్కడ రాష్ట్రంలో మా పెద్దన్న! అని కబుర్లు చెప్పి కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్ర విభజన ఖాయం అని తేలిపోయిననాడు విపక్ష నాయకుడిగా ఉండిన చంద్రబాబు హడావుడిగా పత్రికా గోష్టి నిర్వహించి ఐదారు లక్షల కోట్లు ఇస్తే హైదరాబాద్ కంటే మంచి రాజధాని కట్టుకుంటాం అని ప్రకటించారు. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఐదారు లక్షల కోట్లు ఇమ్మని అడిగేందుకు ఆయన నోరెందుకు పెగలడం లేదో అర్థం కాదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కదా నిధులివ్వండి, లేదా మీరే బాధ్యత తీసుకుని 2018 నాటికి పూర్తి చేసివ్వండి అని అడగడానికి నోరెందుకు రావడంలేదో కూడా అర్థం కాదు. విభజన సమయంలో అందరూ అంగీకరించిన ప్రత్యేక హోదా సంగతి సరే సరి, కేంద్రం కంటే ముందు చంద్రబాబే ఆ ప్రస్తావన రావడాన్ని సహించడంలేదు. తన అపూర్వ సహోదరుడూ, కేంద్ర మంత్రి అయిన వెంకయ్య నాయుడు నుండి వ్యక్తిగత కితాబులు పొందడం తప్ప  ఆయన ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించిందేమీ కనిపించడంలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌లో మాకు న్యాయం జరగలేదంటారు. ఎన్డీఏలో మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి బడ్జెట్ బ్రహ్మాండం అంటూ పొగడ్తలు గుప్పిస్తారు. ఇవన్నీ చూస్తుంటేనే అసలు కేంద్రంతో, ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు ఎట్లా ఉన్నాయనే ప్రశ్న తలెత్తుతున్నది.

ఆదరణ కరువైన ఆంధ్ర
ఒకప్పుడు హైదరాబాద్‌లో కూర్చుని మీట నొక్కితే ఢిల్లీలో చక్రం గిర్రున తిరుగుతుందని చెప్పుకున్న చంద్రబాబు ఎందుకు ఇప్పుడు దస్త్రాలన్నీ తానే స్వయంగా మోసుకుంటూ తిరుపతి వెంకన్న లడ్డూలు కూడా పంచిపెడుతూ ఇంటింటికి తిరిగినా పైసా విదల్చడానికి కేంద్రం ముందుకు రావడంలేదు? బీజేపీ వారికి కేంద్రంలో చిన్న తమ్ముడు, రాష్ట్రంలో పెద్ద అన్నయ్య అయిన చంద్రబాబు కంటే కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ఎందుకు ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి? రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు మాటల్లో చెప్పాలంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నడూ దస్త్రాలు మోసుకుని ఢిల్లీలో ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యదు. తన రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం అయినా అధికారుల ద్వారానే చక్కబెడతారామె. మహా అయితే ఏఐఏడీఎం కేకు చెందిన పార్లమెంట్ సభ్యులు చూసుకుంటారు ఢిల్లీ వ్యవహారాలు. వాళ్ల పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఇట్లా ఏ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాధినేత అయినా ఢిల్లీ వెళితే కేంద్రం దగ్గర గౌరవం పొంది మరీ పనులు చక్కబెట్టుకుంటారు. పుల్లారావు గారే అన్నట్టు చంద్రబాబునాయుడు మోదీ ప్రభుత్వానికి నమ్మదగ్గ మిత్రు డిగా కనిపించడం లేదన్నమాట సోమవారం నాటి బడ్జెట్ కేటాయింపులతో స్పష్టమయింది.

ఆర్థికంగా అతలాకుతలమై ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తల్లడిల్లుతుంటే పరిపాలనలో పద్దెనిమిది నెలలు అంతా చక్కబెట్టేశాను, ఇక రాజకీయాల మీద  దృష్టి పెడుతున్నాను అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రలోభాల వలలు విసురుతున్నారు ముఖ్యమంత్రి. భారీగా డబ్బు ఇవ్వజూపడంతో పాటు, కొత్త నియోజకవర్గాల ఆశ కూడా చూపుతున్నారు. కేసులు ఉన్నవాళ్లు వాటి మాఫీ అడుగుతున్నారు. కేసులు లేకుంటే, మాట వినకుంటే కొత్తగా కేసులలో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. వచ్చే సోమవారం ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో ప్రజా సమస్యలేవీ చర్చకు రాకుండా రచ్చనే కోరుకుంటున్నది అధికార పక్షం. ఇది అందరికీ అర్థమైంది. సరే, సభలో ఏం చేయాలో ఓ ఆరుగురిని లాగేసినా బలంగానే ఉన్న ప్రతిపక్షం చూసుకుంటుంది. మరి ప్రజాస్వామ్యానికి చంద్రబాబు, లోకేశ్‌బాబుల రూపంలో వచ్చి పడుతున్న ప్రమాదాన్ని ఎవరు ఎదుర్కొనాలి? ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం అనేది ఉండకూడదు అని సెలవిచ్చారు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం మీడియా వారితో ముచ్చటించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌బాబు. ప్రతిపక్షం లేకపోవడం ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇప్పుడు సన్నద్ధమై రాష్ర్టంలో ప్రతిపక్షాన్ని కాపాడుకోవాలి. అదే జరుగుతుంది. పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్న సామెత లోకేశ్‌బాబుకు ఎవరైనా గుర్తు చేస్తే బాగుంటుంది.
http://img.sakshi.net/images/cms/2014-12/61417548068_295x200.jpg

datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement