
పళని స్వామి రాయని డైరీ
మాధవ్ శింగరాజు
కలిసే చేతుల్ని కురిసే చినుకులు అడ్డుకుంటాయా? రా.. మిత్రమా.. ముందు చేతులు కలుపుకుని, ఆ తర్వాత ఆలింగనంతో ఒక్కటై పోదాం. పొయెట్రీ రాస్తున్నాను! ఊపిరి సలపడం లేదు. పన్నీర్‌సెల్వం పట్టు బిగించాడు. ఇష్టం లేని ఆలింగనం కూడా ఇంత గాఢంగా ఉంటుందా?! వదిలెయ్ మిత్రమా! దయచేసి వదిలెయ్. చేతులు, ఛాతీలు కలిసింది చాలు. కలిసేందుకు ఇక మన మధ్య కాస్తయినా చోటు మిగల్లేదు. పొయెట్రీని చాలా బలంగా రాస్తున్నాను.
పన్నీర్‌సెల్వం వదలడం లేదు. గట్టిగా అతడిని వదిలించుకుని.. ఒక్క ఉలికిపాటుతో నిద్ర లేచాను! మురుగా.. ఇది నిజం కాదు! నేను నా ఇంట్లోనే ఉన్నాను. పన్నీర్‌సెల్వం కూడా తన ఇంట్లో ఉండి ఉంటాడు. సమయానికి నిన్న వర్షం కురిసి ఒక బలమైన ఆలింగనం తప్పిపోయింది. ‘వర్షం పడుతోంది ఇప్పుడు కాదు’ అని పన్నీర్‌సెల్వంని తప్పించుకుని వచ్చేశాను. పన్నీర్‌సెల్వం కూడా నన్ను ఇలాగే తప్పించుకుని వెళ్లిపోయాడట.. ‘వర్షం పడుతోంది ఇప్పుడు కాదు’ అని! ఇద్దరం ఒకేమాట చెప్పకుండా ఉండాల్సింది. మోదీకి డౌట్ వచ్చినట్లుంది!
పన్నీర్‌సెల్వంని హత్తుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను హత్తుకోవడం çపన్నీర్‌సెల్వంకీ ఇష్టం లేదు. కానీ.. ఇష్టం లేని ఆలింగనం లోంచే ఒక ఇష్టమైన బంధం ఏర్పడుతుందని నాకూ, పన్నీర్‌సెల్వంకి నచ్చజెప్పమని ఢిల్లీ నుంచి డిప్యూటీ స్పీకర్ తంబిదొరైకి చెప్పి పంపించారు మోదీ! ‘‘మోదీజీకి ఆలింగనాలంటే ఇష్టమని నీకూ తెలుసు కదా పళని స్వామీ. ఎందుకు మొండికేస్తావ్? దేశ ప్రధాని ఒక కోరిక కోరినప్పుడు దానిని తీర్చడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ ధర్మం కాదా?! ఆయనేమీ తనని ఆలింగనం చేసుకొమ్మని అడగడం లేదే. ప న్నీర్‌సెల్వంని హత్తుకోమని అంటున్నాడు. అంతే కదా’’ అన్నారు తంబిదొరై.
‘అంతే కదా’ అని తంబిదొరై చాలా తేలిగ్గా అనేయడం నా మనసును తీవ్రంగా గాయపరిచింది. పన్నీర్ సెల్వం లాంటి వాణ్ణి మనసా వాచా కర్మణా హత్తుకోవడం.. ‘అంతే కదా’ అవుతుందా! ‘‘అలవాటైతే కష్టం కూడా ఇష్టంగా అనిపిస్తుంది పళని స్వామీ. ఇప్పుడు పన్నీర్‌సెల్వంని హత్తుకోవడం అలవాటైతే.. రేపు మోదీజీని హత్తుకోవడం నీకు, పన్నీర్‌సెల్వంకి కూడా ఈజీ అవుతుంది. ఆలోచించు’’ అని వెళ్లిపోయారు తంబిదొరై. పన్నీర్‌సెల్వంకి కూడా సేమ్ ఇవే మాటలు చెప్పడానికి ఆయన వెళ్లి ఉంటారు.
ఇంతకీ నేను పొయెట్రీ రాస్తున్నట్లు కల ఎందుకొచ్చినట్లు? దిండు పక్కన ఎప్పటిదో కరుణానిధి కవితల పుస్తకం! రాత్రి చదువుతూ చదువుతూ నిద్రపోయినట్లున్నాను. తమిళనాడు రాజకీయాల్లో నేను కరుణానిధి, పన్నీర్‌సెల్వం ఎమ్జీఆర్ అవబోతున్నామా?