బాబు సర్కారు ఉలికిపాటు
పెనువేగంతో దూసుకుపోతూ ప్రయాణికులను మాత్రమే కాదు... రోడ్డుపై వచ్చే పోయేవారిని సైతం హడలెత్తించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మరోసారి 10 నిండు ప్రాణాలను హరించింది. ఒడిశాలోని కటక్ నుంచి హైదరాబాద్ వెళ్తూ కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపాన మంగళవారం వేకువజామున బ్రిడ్జిపై నుంచి కాలు వలో పడిపోయిన బస్సు... ప్రమాద సమయానికి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నదంటే ఆ బస్సుల తీరుతెన్నులెలా ఉన్నాయో అర్ధమవుతుంది. ప్రైవేటు బస్సులు వాయు వేగంతో దూసుకుపోతున్నా, ఒక బస్సుకు పర్మిట్ తీసుకుని ఆ ముసుగులో మూడు నాలుగు బస్సులు నడుపుతున్నా పాలకులకు పట్టదు.
కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతులు తీసుకోవడం, స్టేజ్ క్యారియర్లుగా తిప్పడం సర్వసాధారణమైపోయింది. ఎక్కడబడితే అక్కడ ప్రయాణికుల్ని ఎక్కించుకో వడం, ఆ జాప్యాన్ని అధిగమించడం కోసం పెను వేగంతో పోవడం రివాజు. ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్సు కాంట్రాక్టు క్యారియర్‌గా ఉంది. మృతుల వివరాలు చూస్తుంటే వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడల్లో ఎక్కిన వారుగా తేలింది. నిబంధనలేమీ పాటించలేదని దీన్నిబట్టే అర్ధమవుతుండగా ఇంతవరకూ యాజమాన్యంపై కేసే పెట్టలేదు! కనీసం బస్సు నడిపినవారికి లైసెన్స్ ఉందో లేదో చూసే దిక్కయినాలేదు. ఈ బస్సు టీడీపీ ఎంపీది కనుక నిజాలను కప్పెట్టేం దుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 32మందినీ సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రులకు తరలించి కాపాడాలన్న స్పృహ కూడా అధికార యంత్రాంగానికి లేకపోయింది. గాయపడినవారంతా తెల్లారుజామునుంచి మధ్యాహ్నం వరకూ బస్సులోనే ఇరుక్కుపోయి హాహాకారాలు చేస్తూ ఉండిపోయారంటే చంద్రబాబు సర్కారు సిగ్గుపడాలి. కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు–దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఆ పార్టీకి చెంది నవారే. ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు వెనువెంటనే ప్రారంభ మయ్యేలా చూడాలని వీరెవరికీ అనిపించలేదు. కానీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చేసరికి మాత్రం ఈ బాపతు నేతలంతా కార్యకర్తలను అక్కడికి తోలి అలజడి సృష్టించడానికి ప్రయత్నించారు. వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అధికారులతో రహస్య మంతనాలే ఆయ నకు ప్రధానమయ్యాయి. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యానికి ఇబ్బంది లేకుండా చూడటం ఎలాగన్న ఆత్రుతే ఆయనకు ఎక్కువైనట్టుంది. ఇలాంటి సమయాల్లో దగ్గరుండి అన్నిటినీ పర్యవేక్షించాల్సిన జిల్లా కలెక్టర్‌కు అసలు పోస్టుమార్టం జరిగిందో లేదో కూడా తెలియదు!
ప్రతిపక్ష నేత అడిగినప్పుడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని ఆయన చెబితే... కాలేదని అక్కడున్న డాక్టర్ జవాబి చ్చారు. ఈ విషయంలో కలెక్టర్ నిజంగా అయోమయంలో ఉన్నారా... మరెవరి నైనా కాపాడేందుకు ఇలా చెప్పారా అన్న అనుమానం రాకమానదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్ ఏ స్థితిలో ఉన్నాడన్నది కీలకమవుతుంది. అతడు సజీవంగా ఉంటే తాగి ఉన్నాడో లేదో తేల్చాలి. ప్రస్తుత ప్రమాదంలో డ్రైవర్ కూడా మరణించాడు గనుక పోస్టుమార్టమే ఏకైక మార్గం. మరి దాన్ని దాటేసే ప్రయత్నం ఎందుకు జరిగింది? పోస్టుమార్టం అయిపోయిందని కలెక్టర్ ఎలా చెప్పగలిగారు? ఒకవేళ డాక్టర్ చెప్పినట్టు పోస్టుమార్టం ఇంకా నిర్వహిం చకపోతే అతడి మృతదేహాన్ని ఎందుకు మూటగట్టారు? అసలు నిబంధనల ప్రకారం ఉండాల్సిన రెండో డ్రైవరైనా సక్రమంగా ఉన్నాడో లేదో, అతనికి లైసెన్స్ ఉందో లేదో ఎందుకు తెలుసుకోలేదు?
కావాలనే ఇంత గందరగోళం సృష్టించినప్పుడూ, నిజాలను కప్పెట్టడానికి ప్రయత్నించినప్పుడూ ఎత్తిచూపడం తప్పవుతుందా? పోస్టుమార్టం లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే జైలుకు పోవాల్సివస్తుందని హెచ్చరించడం నేరమవు తుందా? యాజమాన్యంపై కేసులు పెట్టని సర్కారు ఈ మాటలన్నందుకు విల విల్లాడిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాసుపత్రులు ఏ స్థాయిలో ఉంటు న్నాయో, అక్కడ రోగులెలా ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలుసు. ఆసు పత్రి అభివృద్ధి కమిటీలు ఈ సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు. కానీ నందిగామ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ మాత్రం జరిగిన ఉదంతంలో జగన్‌మోహన్‌రెడ్డిపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కె. పార్థసారథి, ఉదయభాను, జోగి రమేష్ తదితరులపైనా ఫిర్యాదు చేయడం... పోలీసులు కేసు నమోదు చేయడం చకచకా పూర్తయ్యాయి.
ఇక ఐఏఎస్ అధికారుల సంఘం పోస్టుమార్టం అంశంలో కలెక్టర్ ఎందుకలా వ్యవహరించాల్సి వచ్చిందో తెలుసు కున్నట్టు లేదు సరిగదా... ఎదురు ప్రతిపక్ష నేతపైనే ఆరోపణలు చేసింది. 37 ఏళ్ల తన సర్వీసులో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని చెప్పిన సంఘం నేత ఏకే ఫరీదా... ప్రమాద సమయాల్లో పోస్టుమార్టం ఊసులేకుండా మృతదేహాలను తర లించిన ఉదంతాలు గతంలో ఎప్పుడైనా జరిగాయేమో చెప్పి ఉంటే బాగుండేది. ఇదే జిల్లాలో ఈ కలెక్టర్ ఏలుబడిలోనే ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టినప్పుడు చర్యలెందుకు లేవో చెప్పవలసింది. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా దివాకర్ ట్రావెల్స్‌పై కేసు ఎందుకు పెట్ట లేదో వివరించాల్సింది. ఒత్తిళ్లకు లొంగకుండా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు అధికారుల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అందుకు భిన్నంగా ఉంటే నిలదీసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ప్రతిపక్ష నేతకు అది మరింతగా ఉంటుంది. అధికారుల సంఘాన్ని అడ్డం పెట్టుకుని, ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో కేసులు పెట్టించి తన నేరాన్ని బాబు ప్రభుత్వం కప్పి పుచ్చుకోలేదు. ప్రమాదం జరిగిన బస్సు తన పార్టీ ఎంపీది కనుక అడ్డగోలుగా వ్యవహరిస్తానంటే చెల్లదు. ప్రైవేటు బస్సు యాజమాన్యాల ఆగడాలను అరికట్టి, పౌరుల ప్రాణాలను కాపాడటానికి చిత్తశుద్ధితో ప్రయత్నించకపోతే జనం చూస్తూ ఊరుకోరు.