Penuganchiprolu bus accident
-
టికెట్ దొరక్క బతికి బయటపడ్డ భార్య
దివాకర్ ట్రావెల్స్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భర్త హైదరాబాద్: బస్ టికెట్ దొరక్క ఏపీలోని దివాకర్ ట్రావెల్స్ ఘోర ప్రమాదం నుంచి బతికి బయట పడ్డారు నగరానికి చెందిన లావణ్య. అయితే అదే బస్సులో ప్రయాణించిన ఆమె భర్త మధుసూదన్ రెడ్డి మృతి చెందారు. కుమారుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. జీడిమెట్ల పారిశ్రా మికవాడలోని ఓ పరిశ్రమలో సైట్ ఇంజనీర్‌గా పనిచేసే మధుసూదన్‌రెడ్డి 15 రోజుల క్రితం కంపెనీ పనిపై భువ నేశ్వర్ వెళ్లారు. అక్కడ అతనికి జ్వరం రావడంతో భార్య లావణ్య, కుమారుడు అభిలాష్‌రెడ్డి అక్కడకు వెళ్లి మధుసూదన్‌రెడ్డిని తీసుకుని హైదరా బాద్‌కు పయనమయ్యారు. అయితే రెండు టికెట్లే లభించడంతో కుమారు డితో కలసి మధుసూదన్‌రెడ్డి దివాకర్ ట్రావెల్స్‌లో, భార్య రైలులో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇంతలో కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం జరగడంతో మధుసూ దన్‌రెడ్డి మృతి చెందగా.. అభిలాష్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. -
పరామర్శకు వస్తే అడ్డుకుంటారా!
- జగన్మోహన్రెడ్డి ఎవరినీ బెదిరించలేదు - ఆయన వస్తున్నారని తెలియగానే హడావుడి చేశారు - శవాలను త్వరగా తీసుకెళ్లమని అంబులెన్సులు పంపారు - బస్సు ప్రమాదంలో మరణించిన మృతుల బంధువుల వెల్లడి గరిడేపల్లి (హుజూర్నగర్): కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపంలోని ముండ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారిని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే అడ్డుకుందని మృతుల బంధువులు ఆరోపించారు. ఆయన ఎవరినీ బెదిరించలేదని స్పష్టంచేశారు. మానవత్వంతో పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ను అడ్డుకోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం దివాకర్ ట్రావెల్స్‌కు వంతపాడడం దారుణమని మండిపడ్డారు. బస్సు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కోదండరాంపురానికి చెందిన సోదరులు శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారమిక్కడ అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు నిర్వహించారు. శేఖర్‌రెడ్డి భువనేశ్వర్ ఆర్మీ విభాగంలో వైద్యుడిగా పనిచేస్తూ మృతి చెందడంతో ఆర్మీ అధికారులు గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న నేతపై అక్కసు వెళ్లగక్కడం సిగ్గుచేటన్నారు. మేం కూడా బతకలేం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదంలో పెళ్లీడుకొచ్చిన కొడుకులిద్దర్నీ కోల్పోయాను. మేం కూడా ఇక బతకలేం. – శేషిరెడ్డి, కోదండరాంపురం (శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల తండ్రి) ప్రభుత్వాలపై హైకోర్టులో రిట్ వేస్తా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే మా పిల్లలు చనిపోయారు. ప్రతి పక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్ వస్తే అడ్డుకోవడం దారు ణం. ఆయన ఎవరినీ బెదిరించ లేదు. ప్రభుత్వాలు స్పందించ కపోతే... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై రిట్ వేస్తాను. సాయం చేయాల్సిన ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కన పెట్టి జగన్‌ను అడ్డుకుంది. – ఎన్.సత్యనారాయణరెడ్డి, మృతుల పెదనాన్న, అడ్వొకేట్, హైదరాబాద్ మంత్రి పట్టించుకోలేదు చనిపోయిన వారు మా బావమర్దులు. ప్రమాదంలో మర ణిస్తే వారిని పరామర్శిం చాల్సిన మంత్రి కామినేని శ్రీనివాసరావు అక్కడికి వచ్చి పట్టించుకోలేదు. జగన్ వస్తున్నారన్న విషయాన్ని తెలు సుకున్న అధికారులు.. చిన్న అంబులెన్స్‌లను పంపించి శవాలను త్వరగా తీసుకెళ్లమని చెప్పారు. – కట్టా శ్రీనివాస్‌రెడ్డి, నేరేడుచర్ల కావాలనే బద్నాం చేస్తున్నారు పోస్టుమార్టం చేసేటప్పుడు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిం చారు. డ్రైవర్ ఎలా చనిపోయాడో.. ఆల్క హాల్ తీసుకున్నాడా.. లేదా..అన్న విష యం పోస్టుమార్టం నివేదికలో తేలాల్సింది. ఈ విషయంపైనే జగన్ అడిగారు. అయినా డాక్టర్లు నోరు విప్పలేదు. జగన్‌ని ప్రభుత్వం కావాలని బద్నాం చేస్తోంది. – తోడేటి బాలకృష్ణ, స్నేహితుడు, గరిడేపల్లి దివాకర్ ట్రావెల్స్‌ను నిషేధించాలి దివాకర్ ట్రావెల్స్‌ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలి. కేవలం ఒకే డ్రైవర్‌ను కేటాయించడం వల్ల 11 మంది ప్రాణాలు గాల్లో కలిసా యి. అయినా ఏపీ ప్రభుత్వం దివాకర్ ట్రావెల్స్‌పై చర్య తీసుకోకపోవడం బాధాకరం. జగన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు. జగన్ రాకతోనే మాకు న్యాయం జరిగింది. – వెన్న రవీందర్‌రెడ్డి, కోదండరాంపురం -
నందిగామ ఆస్పత్రిలో ఏం జరిగింది?
ప్రతిపక్షనేత చేసిన నేరమేమిటి? సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్ జగన్ ఏదో చేశారంటూ గగ్గోలు పెడుతున్న టీడీపీ నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? ప్రాణాలు పోగోట్టుకున్న వారిని పరామర్శించాల్సింది పోయి ఘటనా స్థలికి వెళ్లిన ప్రతిపక్షనేతను ఎందుకు తప్పుబడుతున్నారు? వాస్తవాలేంటీ? వక్రీకరణలేంటీ? ఓ పెద్ద ప్రమాదం జరిగినపుడు బాధ్యతగలిగిన ప్రతిపక్షనేతగా హుటాహుటిన అక్కడకు వెళ్లడం, బాధితులను ఓదార్చడంతోపాటు వారికి న్యాయం జరిగేందుకు ప్రయత్నించడమే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేసిన నేరం! జగన్ అక్కడకు వెళ్లకపోయి ఉంటే అసలు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేవారా? పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాలను తరలించేసేందుకు అధికారయంత్రాంగం, డాక్టర్లు ప్రయత్నించడం నిజం కాదా? కృష్ణాజిల్లాలోనే ఉన్న ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడు నందిగామ ఎందుకు వెళ్లలేకపోయారు? పైగా అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్షనేతపై కేసులు నమోదు చేయడం చూస్తేనే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నదో, ఎవరి మేలు కోసం పనిచేస్తున్నదో అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు. (చదవండి: విషాద వాటికలో దోషుల సేవ) ప్రతిపక్షనేతగా కేబినెట్ మంత్రి హోదా ఉన్న జగన్మోహన్రెడ్డి ఆస్పత్రిలో ఉన్న అధికారుల విధులకు ఆటంకం కలిగించడమేమిటి? ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ కన్నా ప్రతిపక్షనేతది పెద్ద హోదాయే కదా? పైగా జగన్ వస్తున్నాడంటూ అధికారులే హడావిడి చేశారని, ఆగమేఘాలపై అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసి శవాలను తీసుకెళ్లాల్సిందిగా తమను వత్తిడి చేశారని మృతుల బంధువులు చెబుతున్నారు. జగన్ ఎవరినీ బెదిరించలేదని, దూషించలేదని, ఎవరి విధులకూ ఆటంకం కలిగించలేదని వారు వివరించారు. మొదట నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు జగన్ వస్తున్నారని తెలుసుకునే ఆగమేఘాలమీద స్పందించారని వారు తెలిపారు. వాస్తవాలనెందుకు మరుగుపరుస్తున్నారు? నిజానికి హాస్పటల్‌కు వెళ్లడానికి ముందే జగన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. డివైడర్‌ను ఢీకొన్న బస్సు గాలిలో 100 అడుగులు ప్రయాణించి కల్వర్టులో పడిపోయింది. దానికి కారణం మితిమీరిన వేగం లేదా డ్రైవర్ తాగి ఉండాలని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఆయన హాస్పటల్‌కు వెళ్లారు. అక్కడ ఒక పెద్ద హాలులో కొన్ని మృతదేహాలను కట్టకట్టి ఉంచారు. ఒకటి రెండు మృతదేహాలను సుమోలలో ఎక్కిస్తున్నారు. బాధితుల బంధువులతో జగన్ మాట్లాడారు. తరలించడానికి సిద్ధంగా ఉన్న మృతదేహాలలో డ్రైవర్ మృతదేహం కూడా ఉందని డాక్టర్లు చెప్పారు. ‘పోస్టుమార్టం అయిపోయిందంటున్నారు.. డ్రైవర్ తాగి ఉన్నాడా’ అని డాక్టర్‌ను జగన్ అడిగారు. జవాబిచ్చేందుకు డాక్టర్ తడబడ్డారు. పోస్టుమార్టం చేయలేదు అని చెప్పారు. పోస్టుమార్టం చేయాల్సిందిగా అభ్యర్థించే పత్రాల నకళ్లలో ఒకదానిని జగన్‌కు డాక్టర్ అందించారు. అదే సమయంలో జగన్ వెనక ఉన్న కలెక్టర్.. చెప్పవద్దు అంటూ డాక్టర్‌కు సైగలు చేయడం కనిపించింది. దాంతో అక్కడే ఉన్న మీడియాతో జగన్ మాట్లాడుతూ ‘ఇదీ పరిస్థితి. డాక్టర్ పోస్టుమార్టం చేయలేదు అని చెబుతున్నారు. మరోవైపు డ్రైవర్ మృతదేహాన్ని పంపించివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు. ఆ సందర్భంలోనే జగన్ కలెక్టర్‌తో మాట్లాడుతూ ‘మీరు తప్పు చేస్తున్నారు.. ఇంత పెద్ద సంఘటన జరిగినపుడు విచారణతో సహా అన్నీ పద్ధతి ప్రకారం జరిగేలా చూడాల్సిన మీరు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మీకే నష్టం. బాధితుల పక్షాన నిలబడకపోతే అందరూ జైలుకు పోవలసి వస్తుంది.’ అని అన్నారు. కేసు విచారణకు సంబంధించిన కీలకమైన అంశాన్ని జగన్ లేవనెత్తడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆయన ప్రశ్నించిన తరువాత వెంటనే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రభుత్వ ఫోరెన్సిక్ వైద్యుడు శ్రీనివాస్ నాయక్ పోస్టుమార్టం చేశారు. కొన్ని శరీర భాగాలను పరీక్షల కోసం రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ముండ్లపాడు బస్సు ప్రమాద ఘటనలో వాస్తవాలివీ.. మరి వీటిని ఎందుకు మరుగునపరుస్తున్నారు.. ప్రశ్నించిన ప్రతిపక్షనేతపై కేసులు పెట్టడమేమిటని ప్రజలంతా విస్తుపోతున్నారు. -
విషాద వాటికలో దోషుల సేవ
- బస్సు ప్రమాదం ఘటనలో ప్రభుత్వ బాధ్యతను మరచిన అధికారులు - ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై కేసులతో ఎదురుదాడి - దివాకర్ ట్రావెల్స్‌ని కాపాడేందుకు ఆపసోపాలు - కలెక్టర్ నుంచి రవాణా, పోలీసులు, వైద్యుల వరకూ ఇదే తీరు - ప్రాథమిక అంశాలను గాలికొదిలి తూతూమంత్రంగా విచారణ సాక్షి, అమరావతి బ్యూరో: ఓ పెద్ద విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం.. పది కుటుంబాలలో అంతులేని వ్యథను మిగిల్చింది.. ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఆ ఘటనకు కారణమేమిటో కనుక్కోవద్దా..? బాధ్యతెవరిదో తేల్చవద్దా..? బాధ్యులెవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకుంటే కదా అలాంటి మరో ముప్పు నుంచి మనమందరం తప్పించుకోగలుగుతాం..! అది ప్రభుత్వ కనీస బాధ్యత. అది అధికారయంత్రాంగం కనీస విద్యుక్తధర్మం. కానీ అందరూ కలసికట్టుగా దానిని అటకెక్కించారు. కూడబలుక్కుని దోషులను రక్షించేందుకు కంకణం కట్టుకున్నారు. సాక్ష్యాలు పట్టించుకోరు.. మృతదేహాలకు పోస్టుమార్టం చేయించరు. రెండో డ్రైవర్ లేకపోయినా ఉన్నట్లు కనికట్టు చేస్తారు. అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీకి చెందిన ట్రావెల్స్ ఇబ్బందుల్లో పడిపోతుందని ఇంతమంది ఇన్ని రకాలుగా రక్షించే ప్రయత్నించడం బహుశా ఇంకెక్కడా మనం చూసి ఉండం. డాక్టర్లు, పోలీసులు, రవాణాశాఖ అధికారులు.. చివరకు జిల్లా కలెక్టర్ ఇలా అందరూ ఒక్కతాటిపై ఒక్కమాటపై నిలబడి దోషుల సేవలో తరించడం చూసి జనం నివ్వెరపోతున్నారు.. ‘‘ఇదేం న్యాయం? బాధితులకు ఇంత అన్యాయం చేస్తారా? ఇది మీకు తగదు’’ అని అన్న పాపానికి ప్రతిపక్షనేతపై కేసులు మోపే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో అరాచకపాలన ఏ స్థాయికి చేరుకుందో తెలుసుకునేందుకు కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన బస్సుప్రమాదం తాజా ఉదాహరణ.. వైద్యులకిది తగునా...:? మెడికో లీగల్ కేసుల్లో పోస్టుమార్టం అన్నది అత్యంత కీలకమైన అంశమని వైద్యులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నందిగామ ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు ఆ అంశానికి ప్రాధాన్యమివ్వకపోవడం విస్మయపరుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగినపుడు డ్రైవర్ తాగి ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవడం అతి ముఖ్యమైన అంశం. డ్రైవర్ బతికి ఉంటే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలి. డ్రైవర్ మృతిచెందితే ఆయన శరీరభాగాలను పరిశీలించాలి. పోస్టుమార్టం చేయాలి. తుది నివేదిక కోసం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలి. కానీ దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో వైద్యులు ఈ ప్రాథమిక అంశాలన్నీ విస్మరించారు. (చదవండి: డెత్ ట్రావెల్స్!) పోలీసుల తీరూ అంతే... సంచలనం సృష్టించిన ఇలాంటి కేసుల విచారణ సందర్భంలో పోలీసులు ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. రెండో డ్రైవర్ ఉన్నాడా? ఉంటే ఎవరు? అన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించాలి. కానీ మంగళవారం మధ్యాహ్నం తరువాత తానే రెండో డ్రైవర్ని అంటూ ఒకరు వస్తే ఎలాంటి ఆధారాలూ సరిపోల్చుకోకుండా పోలీసులు సరేనన్నారు. కానీ ఆయన నిజంగా రెండో డ్రైవరా కాదా అనేది నిగ్గుతేల్చాలని భావించనే లేదు. అంతవరకు కనిపించని ఆ డ్రైవర్ హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చాడనే దిశగా విచారించనే లేదు. ప్రమాదం సంభవించి 24గంటల తరువాత కూడా రెండో డ్రైవర్ ఎవరన్నది పోలీసులు వెల్లడించలేదు. ‘ట్రావెల్స్’ని కాపాడేందుకు రవాణా శాఖ తాపత్రయం బస్సు ప్రమాదం కేసులో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు రవాణా శాఖ అధికారులు శతవిధాలుగా ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది. డ్రైవర్ తాగి బస్సు నడపడం వల్ల ప్రాణనష్టం సంభవిస్తే ట్రావెల్స్ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. డ్రైవర్ తాగి బస్సు నడిపాడా? లేక మరో కారణం వల్ల ప్రమాదం జరిగిందా అనేది పోస్టుమార్టం సవ్యంగా జరిగితే తేలే అవకాశం ఉండేది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలవరకు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోయినా అధికారులు పట్టించుకోనే లేదు. పైగా ఫోరెన్సిక్ నివేదిక వచ్చే వరకూ కూడా ఆగకుండానే బుధవారం నాడు హడావిడిగా ఓ ప్రకటన విడుదల చేసేశారు. డ్రైవర్ తాగి లేడని వారంతట వారు తేల్చేశారు. ప్రమాదానికి ముందు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది? మరో కీలకమైన అంశం. బీపీ, గుండెపోటు, కంటిచూపు ఇతరత్రా సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారికే విధులు అప్పగించాలి. అందుకోసం ట్రావెల్స్ యాజమాన్యం తమ డ్రైవర్లకు క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మరి దివాకర్ ట్రావెల్స్ ఆ నిబంధనలను పాటిస్తోందా లేదా అన్నది రవాణా శాఖ అధికారులు పట్టించుకోనే లేదు. ప్రమాదానికి గురైన బస్సుకు రెండో డ్రైవర్ ఉన్నారా?.. ఉంటే ఎవరు? కీలకమైన ఈ అంశాన్ని రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడమే లేదు. ప్రమాదం సంభవించిన చాలాసేపటి వరకు రెండో డ్రైవర్ ఎవరన్నది ఎవరూ చెప్ప లేదు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల తరువాత ఒకర్ని తీసుకువచ్చి ఆయనే రెండో డ్రైవర్ అని చూపించారు. ప్రమాదం సంభవించినప్పుడు రెండో డ్రైవర్ బస్సు కింది భాగంలో ఉన్న డిక్కీలో నిద్రపోతున్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బస్సు రన్నింగ్‌లో ఉన్నప్పుడు డిక్కీలో రెండో డ్రైవర్ నిద్రపోవడం అసాధ్యమని సీనియర్ ఆర్టీవో ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. తన 15ఏళ్ల అనుభవంలో ఇలాంటి విషయాన్ని చూడలేదని ఆయన చెప్పారు. గమ్యస్థానంలో బస్సును నిలిపి ఉన్నప్పుడు డీక్కీ తెరచి అందులో నిద్రించవచ్చన్నారు. అంతేగానీ బస్సు ప్రయాణిస్తున్నప్పుడు డిక్కీలో నిద్రపోవడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఏమాత్రం గాలి కూడా అందని డిక్కీలో ఉండలేరన్నారు. డ్రైవర్ సీటు వెనుకభాగంలోనే రెండో డ్రైవర్ విశ్రాంతి తీసుకునేందుకు బెర్త్ ఉంటుందన్నారు. దీంతో ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సుకు రెండో డ్రైవర్ ఉన్నారా అన్నది సందేహాస్పదంగా మారింది. రెండో డ్రైవర్ లేరన్న విషయాన్ని నిర్ధారిస్తే ట్రావెల్స్ యాజమాన్యం ప్రమాదానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం రెండో డ్రైవర్ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడంతో అధికారులు గతుక్కుమన్నారు. రెండో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారని బుధవారం ఉదయం ప్రకటించారు. కలెక్టర్ అలా ఎందుకు వ్యవహరించారు? ఏదైనా ప్రమాదంగానీ విపత్తుగానీ సంభవిస్తే సంబంధిత అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌దే. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు శాస్త్రీయంగా చర్యలు చేపట్టారా లేదా అన్నది కలెక్టర్ పరిశీలించాలి. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించాల్సిన బాధ్యత పోలీసు అధికారులది. పోస్టుమార్టం చేయాల్సింది వైద్యులు. పోలీసులు, వైద్యులు ఆ విధంగా వ్యవహరించకపోతే కలెక్టర్ స్పందించాలి. పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించాలి. జిల్లా మేజిస్ట్రేట్‌గా ఆయనకు విచక్షణాధికారాలు ఉన్నాయి. కానీ దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద అనంతరం కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబు. ఆ అంశానికే ప్రాధాన్యమివ్వలేదు. ఉదయం 5.45గంటలకు ప్రమాదం సంభవించింది. దాదాపు 10గంటల సమయంలో డ్రైవర్ మృతదేహం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. కలెక్టర్ బాబు దాదాపు మధ్యాహ్నం 1గంట సమయంలో ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ సాయంత్రం 3 గంటలకు ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వచ్చేవరకు కూడా డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయనే లేదు. జగన్మోహన్రెడ్డి అడిగినపుడు ఆ విషయాన్ని వైద్యులే చెప్పారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని కలెక్టర్ ఆదేశించకపోవడం, పైగా జగన్ అడిగితే అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని చెప్పడం ప్రశ్నార్థకంగా మారాయి. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి తరలించేందుకు అధికారులు ఎందుకు ఏర్పాట్లు చేసినట్లు? -
బాబు సర్కారు ఉలికిపాటు
పెనువేగంతో దూసుకుపోతూ ప్రయాణికులను మాత్రమే కాదు... రోడ్డుపై వచ్చే పోయేవారిని సైతం హడలెత్తించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మరోసారి 10 నిండు ప్రాణాలను హరించింది. ఒడిశాలోని కటక్ నుంచి హైదరాబాద్ వెళ్తూ కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపాన మంగళవారం వేకువజామున బ్రిడ్జిపై నుంచి కాలు వలో పడిపోయిన బస్సు... ప్రమాద సమయానికి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నదంటే ఆ బస్సుల తీరుతెన్నులెలా ఉన్నాయో అర్ధమవుతుంది. ప్రైవేటు బస్సులు వాయు వేగంతో దూసుకుపోతున్నా, ఒక బస్సుకు పర్మిట్ తీసుకుని ఆ ముసుగులో మూడు నాలుగు బస్సులు నడుపుతున్నా పాలకులకు పట్టదు. కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతులు తీసుకోవడం, స్టేజ్ క్యారియర్లుగా తిప్పడం సర్వసాధారణమైపోయింది. ఎక్కడబడితే అక్కడ ప్రయాణికుల్ని ఎక్కించుకో వడం, ఆ జాప్యాన్ని అధిగమించడం కోసం పెను వేగంతో పోవడం రివాజు. ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్సు కాంట్రాక్టు క్యారియర్‌గా ఉంది. మృతుల వివరాలు చూస్తుంటే వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడల్లో ఎక్కిన వారుగా తేలింది. నిబంధనలేమీ పాటించలేదని దీన్నిబట్టే అర్ధమవుతుండగా ఇంతవరకూ యాజమాన్యంపై కేసే పెట్టలేదు! కనీసం బస్సు నడిపినవారికి లైసెన్స్ ఉందో లేదో చూసే దిక్కయినాలేదు. ఈ బస్సు టీడీపీ ఎంపీది కనుక నిజాలను కప్పెట్టేం దుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 32మందినీ సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రులకు తరలించి కాపాడాలన్న స్పృహ కూడా అధికార యంత్రాంగానికి లేకపోయింది. గాయపడినవారంతా తెల్లారుజామునుంచి మధ్యాహ్నం వరకూ బస్సులోనే ఇరుక్కుపోయి హాహాకారాలు చేస్తూ ఉండిపోయారంటే చంద్రబాబు సర్కారు సిగ్గుపడాలి. కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు–దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఆ పార్టీకి చెంది నవారే. ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు వెనువెంటనే ప్రారంభ మయ్యేలా చూడాలని వీరెవరికీ అనిపించలేదు. కానీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చేసరికి మాత్రం ఈ బాపతు నేతలంతా కార్యకర్తలను అక్కడికి తోలి అలజడి సృష్టించడానికి ప్రయత్నించారు. వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అధికారులతో రహస్య మంతనాలే ఆయ నకు ప్రధానమయ్యాయి. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యానికి ఇబ్బంది లేకుండా చూడటం ఎలాగన్న ఆత్రుతే ఆయనకు ఎక్కువైనట్టుంది. ఇలాంటి సమయాల్లో దగ్గరుండి అన్నిటినీ పర్యవేక్షించాల్సిన జిల్లా కలెక్టర్‌కు అసలు పోస్టుమార్టం జరిగిందో లేదో కూడా తెలియదు! ప్రతిపక్ష నేత అడిగినప్పుడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని ఆయన చెబితే... కాలేదని అక్కడున్న డాక్టర్ జవాబి చ్చారు. ఈ విషయంలో కలెక్టర్ నిజంగా అయోమయంలో ఉన్నారా... మరెవరి నైనా కాపాడేందుకు ఇలా చెప్పారా అన్న అనుమానం రాకమానదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్ ఏ స్థితిలో ఉన్నాడన్నది కీలకమవుతుంది. అతడు సజీవంగా ఉంటే తాగి ఉన్నాడో లేదో తేల్చాలి. ప్రస్తుత ప్రమాదంలో డ్రైవర్ కూడా మరణించాడు గనుక పోస్టుమార్టమే ఏకైక మార్గం. మరి దాన్ని దాటేసే ప్రయత్నం ఎందుకు జరిగింది? పోస్టుమార్టం అయిపోయిందని కలెక్టర్ ఎలా చెప్పగలిగారు? ఒకవేళ డాక్టర్ చెప్పినట్టు పోస్టుమార్టం ఇంకా నిర్వహిం చకపోతే అతడి మృతదేహాన్ని ఎందుకు మూటగట్టారు? అసలు నిబంధనల ప్రకారం ఉండాల్సిన రెండో డ్రైవరైనా సక్రమంగా ఉన్నాడో లేదో, అతనికి లైసెన్స్ ఉందో లేదో ఎందుకు తెలుసుకోలేదు? కావాలనే ఇంత గందరగోళం సృష్టించినప్పుడూ, నిజాలను కప్పెట్టడానికి ప్రయత్నించినప్పుడూ ఎత్తిచూపడం తప్పవుతుందా? పోస్టుమార్టం లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే జైలుకు పోవాల్సివస్తుందని హెచ్చరించడం నేరమవు తుందా? యాజమాన్యంపై కేసులు పెట్టని సర్కారు ఈ మాటలన్నందుకు విల విల్లాడిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాసుపత్రులు ఏ స్థాయిలో ఉంటు న్నాయో, అక్కడ రోగులెలా ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలుసు. ఆసు పత్రి అభివృద్ధి కమిటీలు ఈ సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు. కానీ నందిగామ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ మాత్రం జరిగిన ఉదంతంలో జగన్మోహన్రెడ్డిపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కె. పార్థసారథి, ఉదయభాను, జోగి రమేష్ తదితరులపైనా ఫిర్యాదు చేయడం... పోలీసులు కేసు నమోదు చేయడం చకచకా పూర్తయ్యాయి. ఇక ఐఏఎస్ అధికారుల సంఘం పోస్టుమార్టం అంశంలో కలెక్టర్ ఎందుకలా వ్యవహరించాల్సి వచ్చిందో తెలుసు కున్నట్టు లేదు సరిగదా... ఎదురు ప్రతిపక్ష నేతపైనే ఆరోపణలు చేసింది. 37 ఏళ్ల తన సర్వీసులో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని చెప్పిన సంఘం నేత ఏకే ఫరీదా... ప్రమాద సమయాల్లో పోస్టుమార్టం ఊసులేకుండా మృతదేహాలను తర లించిన ఉదంతాలు గతంలో ఎప్పుడైనా జరిగాయేమో చెప్పి ఉంటే బాగుండేది. ఇదే జిల్లాలో ఈ కలెక్టర్ ఏలుబడిలోనే ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టినప్పుడు చర్యలెందుకు లేవో చెప్పవలసింది. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా దివాకర్ ట్రావెల్స్‌పై కేసు ఎందుకు పెట్ట లేదో వివరించాల్సింది. ఒత్తిళ్లకు లొంగకుండా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు అధికారుల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అందుకు భిన్నంగా ఉంటే నిలదీసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ప్రతిపక్ష నేతకు అది మరింతగా ఉంటుంది. అధికారుల సంఘాన్ని అడ్డం పెట్టుకుని, ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో కేసులు పెట్టించి తన నేరాన్ని బాబు ప్రభుత్వం కప్పి పుచ్చుకోలేదు. ప్రమాదం జరిగిన బస్సు తన పార్టీ ఎంపీది కనుక అడ్డగోలుగా వ్యవహరిస్తానంటే చెల్లదు. ప్రైవేటు బస్సు యాజమాన్యాల ఆగడాలను అరికట్టి, పౌరుల ప్రాణాలను కాపాడటానికి చిత్తశుద్ధితో ప్రయత్నించకపోతే జనం చూస్తూ ఊరుకోరు.