నందిగామ ఆస్పత్రిలో ఏం జరిగింది? | What happened in Nandigama hospital when YS Jagan reached there | Sakshi
Sakshi News home page

నందిగామ ఆస్పత్రిలో ఏం జరిగింది?

Published Thu, Mar 2 2017 3:10 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

నందిగామ ఆస్పత్రిలో ఏం జరిగింది? - Sakshi

నందిగామ ఆస్పత్రిలో ఏం జరిగింది?

ప్రతిపక్షనేత చేసిన నేరమేమిటి?
సాక్షి, అమరావతి బ్యూరో:
వైఎస్‌ జగన్ ఏదో చేశారంటూ గగ్గోలు పెడుతున్న టీడీపీ నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? ప్రాణాలు పోగోట్టుకున్న వారిని పరామర్శించాల్సింది పోయి ఘటనా స్థలికి వెళ్లిన ప్రతిపక్షనేతను ఎందుకు తప్పుబడుతున్నారు? వాస్తవాలేంటీ? వక్రీకరణలేంటీ? ఓ పెద్ద ప్రమాదం జరిగినపుడు బాధ్యతగలిగిన ప్రతిపక్షనేతగా హుటాహుటిన అక్కడకు వెళ్లడం, బాధితులను ఓదార్చడంతోపాటు వారికి న్యాయం జరిగేందుకు ప్రయత్నించడమే ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేసిన నేరం!

జగన్‌ అక్కడకు వెళ్లకపోయి ఉంటే అసలు డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేవారా? పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాలను తరలించేసేందుకు అధికారయంత్రాంగం, డాక్టర్లు ప్రయత్నించడం నిజం కాదా? కృష్ణాజిల్లాలోనే ఉన్న ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడు నందిగామ ఎందుకు వెళ్లలేకపోయారు? పైగా అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్షనేతపై కేసులు నమోదు చేయడం చూస్తేనే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నదో, ఎవరి మేలు కోసం పనిచేస్తున్నదో అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు.

ప్రతిపక్షనేతగా కేబినెట్‌ మంత్రి హోదా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఆస్పత్రిలో ఉన్న అధికారుల విధులకు ఆటంకం కలిగించడమేమిటి? ప్రొటోకాల్‌ ప్రకారం కలెక్టర్‌ కన్నా ప్రతిపక్షనేతది పెద్ద హోదాయే కదా? పైగా జగన్‌ వస్తున్నాడంటూ అధికారులే హడావిడి చేశారని, ఆగమేఘాలపై అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసి శవాలను తీసుకెళ్లాల్సిందిగా తమను వత్తిడి చేశారని మృతుల బంధువులు చెబుతున్నారు. జగన్‌ ఎవరినీ బెదిరించలేదని, దూషించలేదని, ఎవరి విధులకూ ఆటంకం కలిగించలేదని వారు వివరించారు. మొదట నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు జగన్‌ వస్తున్నారని తెలుసుకునే ఆగమేఘాలమీద స్పందించారని వారు తెలిపారు.

వాస్తవాలనెందుకు మరుగుపరుస్తున్నారు?
నిజానికి హాస్పటల్‌కు వెళ్లడానికి ముందే జగన్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. డివైడర్‌ను ఢీకొన్న బస్సు గాలిలో 100 అడుగులు ప్రయాణించి కల్వర్టులో పడిపోయింది. దానికి కారణం మితిమీరిన వేగం లేదా డ్రైవర్‌ తాగి ఉండాలని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఆయన హాస్పటల్‌కు వెళ్లారు. అక్కడ ఒక పెద్ద హాలులో కొన్ని మృతదేహాలను కట్టకట్టి ఉంచారు. ఒకటి రెండు మృతదేహాలను సుమోలలో ఎక్కిస్తున్నారు. బాధితుల బంధువులతో జగన్‌ మాట్లాడారు. తరలించడానికి సిద్ధంగా ఉన్న మృతదేహాలలో డ్రైవర్‌ మృతదేహం కూడా ఉందని డాక్టర్లు చెప్పారు. ‘పోస్టుమార్టం అయిపోయిందంటున్నారు.. డ్రైవర్‌ తాగి ఉన్నాడా’ అని డాక్టర్‌ను జగన్‌ అడిగారు. జవాబిచ్చేందుకు డాక్టర్‌ తడబడ్డారు. పోస్టుమార్టం చేయలేదు అని చెప్పారు. పోస్టుమార్టం చేయాల్సిందిగా అభ్యర్థించే పత్రాల నకళ్లలో ఒకదానిని జగన్‌కు డాక్టర్‌ అందించారు. అదే సమయంలో జగన్‌ వెనక ఉన్న కలెక్టర్‌.. చెప్పవద్దు అంటూ డాక్టర్‌కు సైగలు చేయడం కనిపించింది. దాంతో అక్కడే ఉన్న మీడియాతో జగన్‌ మాట్లాడుతూ ‘ఇదీ పరిస్థితి. డాక్టర్‌ పోస్టుమార్టం చేయలేదు అని చెబుతున్నారు. మరోవైపు డ్రైవర్‌ మృతదేహాన్ని పంపించివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు.

ఆ సందర్భంలోనే జగన్‌ కలెక్టర్‌తో మాట్లాడుతూ ‘మీరు తప్పు చేస్తున్నారు.. ఇంత పెద్ద సంఘటన జరిగినపుడు విచారణతో సహా అన్నీ పద్ధతి ప్రకారం జరిగేలా చూడాల్సిన మీరు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మీకే నష్టం. బాధితుల పక్షాన నిలబడకపోతే అందరూ జైలుకు పోవలసి వస్తుంది.’ అని అన్నారు. కేసు విచారణకు సంబంధించిన కీలకమైన అంశాన్ని జగన్‌ లేవనెత్తడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆయన ప్రశ్నించిన తరువాత వెంటనే డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రభుత్వ ఫోరెన్సిక్‌ వైద్యుడు శ్రీనివాస్‌ నాయక్‌ పోస్టుమార్టం చేశారు. కొన్ని శరీర భాగాలను పరీక్షల కోసం రీజనల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ముండ్లపాడు బస్సు ప్రమాద ఘటనలో వాస్తవాలివీ.. మరి వీటిని ఎందుకు మరుగునపరుస్తున్నారు.. ప్రశ్నించిన ప్రతిపక్షనేతపై కేసులు పెట్టడమేమిటని ప్రజలంతా విస్తుపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement